ETV Bharat / state

ఎదగాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించారు - అర కోటి వేతనంతో జాబ్​ కొట్టారు

కర్నూలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఘనత - ప్రముఖ సంస్థల్లో అత్యధిక వేతనంతో ముగ్గురు విద్యార్థులకు కొలువులు - హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

Kurnol IIT Students Got Jobs With Good Packages
Kurnol IIT Students Got Jobs With Good Packages (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 14, 2025 at 3:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

IIT Students Got Jobs With Good Packages in Kurnool District: వారికి చదువంటే ప్రాణం. అందుకు అనుగుణంగానే వారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించారు. ఆ పయనంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగారు.

వారు ఎంచుకున్న తమ తమ రంగాల్లో అత్యున్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పాఠ్యాంశాలతోపాటు ఇతర నైపుణ్యాలపైనా పట్టు సాధించారు. ప్రముఖ సంస్థల్లో అత్యధిక వేతనంతో కొలువులు సాధించారు. వారే కర్నూలు ట్రిపుల్‌ ఐటీ (డీఎం) విద్యార్థులు మహేశ్‌రెడ్డి, నితీశ్‌కుమార్,శ్రేయాపాండే. వీరు ముగ్గురు కూడా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ వారి గురిని మాత్రం తప్పకుండా వారి కలలను సాకారం చేసుకున్నారు. వారు తమ విద్యను సాగించే క్రమంలో ఏ విధమైన సవాలను ఎదుర్కొన్నారు? వారి కుటుంబ నేపథ్యాలు తదితర విషయాలేెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.65 లక్షల వేతనంతో ఉద్యోగం: నాకు 12 ఎకరాల పొలం ఉంది, కానీ ఎప్పుడూ పంటలు దెబ్బతినేవని ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి ఏరువ మహేశ్​రెడ్డి అన్నారు. దీనికితోడు మా ఆర్థిక పరిస్థితి సైతం అంతంతమాత్రంగానే ఉండేదని తెలిపాడు. నా చదువు కోసం నా తండ్రి శివారెడ్డి, అమ్మ రమణమ్మలు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తు జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు రావడంతో కర్నూలు ట్రిపుల్‌ ఐటీ (డీఎం)లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీటు వచ్చిందని వెల్లిబుచ్చాడు.

- ఏరువ మహేశ్‌రెడ్డి, వై.డి.పాడు, పెద్దఆరవీడు మండలం
- ఏరువ మహేశ్‌రెడ్డి (Eenadu)

అనంతరం కోడింగ్, సీ, సీ++ తదితర లాంగ్వేజీలపై పట్టు సాధించానని తెలియజేశాడు. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులు సైతం చేశాననీ, ఇంటర్వ్యూ సమయంలో ఆయా అదనపు నైపుణ్యాలు విజేతగా నిలిచేందుకు అవి ఎంతగానో దోహదపడ్డాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన సూపర్‌మనీ సంస్థలో రూ.65 లక్షల వార్షిక వేతనంతో కొలువును సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు.

నాన్న వడ్రంగి పనిచేస్తూ చదివించారు: నాన్న నన్ను వడ్రంగి పని చేసుకుంటూ చదివించారని జార్ఖండ్​కు చెందిన విద్యార్థి నితీశ్​కుమార్​ అన్నాడు. తమ తల్లిదండ్రులు చదువుకు అత్యంత ప్రాధాన్యమిస్తారని వెల్లడించాడు. ఐదో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మొదటిసారి జేఈఈలో ఎలాంటి ర్యాంకు రాలేదు. ఎలాగైనా సాధించాలన్న లక్ష్యంతో ఇంటర్‌ తర్వాత ఏడాదిపాటు మళ్లీ సాధన చేసి జేఈఈ మెయిన్‌లో ర్యాంకు తెచ్చుకున్నాను.

నితీశ్‌కుమార్, నావాబంద్‌ గ్రామం (ఝార్ఖండ్‌)
నితీశ్‌కుమార్ (Eenadu)

కర్నూలు ట్రిపుల్‌ ఐటీ కళాశాల (డీఎం)లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీటు రావడం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పిందని గుర్తు చేసుకున్నాడు. పాఠ్యాంశాలతోపాటు విద్యాసంస్థలో నిర్వహించే హ్యాకథాన్లు, పలు పోటీల్లోనూ పాల్గొన్నానన్నాడు. ఆ అనుభవం నాకు బాగా కలిసొచ్చిందనీ, అందువలనే ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ చూపగలిగానని పేర్కొన్నాడు. దీని ఫలితంగా రూ.65 లక్షల వార్షిక వేతనంతో సూపర్‌మనీ సంస్థలో చక్కని ఉద్యోగం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.

మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించగాలిగా: నేను ఉన్నత స్థాయికి ఎదగాలని అమ్మ శశిపాండే ఎంతగానో పరితపించారని ఉత్తరప్రదేశ్​కు చెందిన శ్రేయాపాండే అన్నారు. అనుక్షణం నాకు అండగా ఉండి నా చదువుకు ఎలాంటి సమస్యలు రాకుండా చూశారు. మా నాన్న ఉత్తర్‌ప్రదేశ్​లో ప్రభుత్వ అదనపు ప్రైవేటు కార్యదర్శిగా విధులను నిర్వర్తిస్తున్నారని తెలియజేశారు. జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించి కర్నూలు ట్రిపుల్‌ ఐటీ (డీఎం)లో కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు తెచ్చుకున్నానని తెలిపారు. చదువుతోపాటు మంచి ఉద్యోగం సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాను. అంతేకాకుండా పలువురు సీనియర్లు, విజేతలతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు పొందానని తెలిపారు.

శ్రేయాపాండే, లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్‌)
శ్రేయాపాండే (Eenadu)

మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించి విజయం సాధించానన్నారు. రెండు నెలలపాటు విధులు నిర్వర్తించే అవకాశం దక్కింది. అందులోనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యంతో కష్టపడ్డాను. కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలతోపాటు ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. రూ.53 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపిక కావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువతకు గుడ్​న్యూస్ - రూ.లక్షల వేతనంతో జర్మనీలో ఉద్యోగావకాశాలు

ఇకపై ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు​​ ఈజీ- IIT మద్రాస్ కొత్త వెబ్‌సైట్!