ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్ - అలా చేస్తే ఇళ్లు రద్దు!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆటుపోట్లు - పాత ఇంటికే బిల్లులు పొందాలని ఆశించిన లబ్ధిదారులకు నిరాశ - ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారుల నోటీసులు జారీ - ఇళ్లు రద్దు చేసుకుంటున్న లబ్ధిదారులు

Published : December 21, 2025 at 7:18 AM IST
Indiramma House Beneficiaries Face Difficulties : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. సంవత్సరం సమీపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని అమలు చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పాత ఇంటికే బిల్లులు పొందాలని ఆశించిన లబ్ధిదారులకు నిరాశ కలిగింది. దీంతో చాలా మంది ఇళ్లను రద్దు చేసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారుల నోటీసులు : పెద్దపల్లి జిల్లాలో 2 విడతల్లో 9,400 ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 6,600 ఇళ్లకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరిలో తొలి, మే నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. 11 నెలలుగా లబ్ధిదారుల ఇళ్లకు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పలు కారణాలతో నిర్మించుకోవడానికి దాటవేస్తూ వస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయని భావించిన కొందరు లబ్ధిదారులు రద్దు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చిన 45 రోజుల్లోపు పనులు మొదలుపెట్టాలి. నెలల గడుస్తున్నా ముందుకురాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,400 మంది రద్దు కోసం అంగీకార పత్రాలు ఇచ్చారు.
పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడు పట్టణాల్లో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. రామగుండంలో 470, పెద్దపల్లిలో 411, సుల్తానాబాద్‌లో 220 మంజూరు చేశారు. వీరందరికీ అనుమతి పత్రాలు ఇచ్చి పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రగతిలో వేగం పెంచుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసుకోవడానికి కారణాలు ఇవే : -
- ఎంతో మంది గతంలో మాదిరి పాత ఇల్లు, రేకుల షెడ్డుకు బిల్లు పొందాలని ఆలోచన చేస్తున్నారు.
- ఒక ఇంటిలో 4 గదులు ఉంటే ఏదో ఒక గది పేరిట బిల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు.
- ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్ అనుసంధానించి ఫొటో చిత్రీకరించడంతో పాత ఇళ్లకు బిల్లు పొందడానికి వీలు కావడం లేదు.
- ముగ్గు పోసిన నుంచి పూర్తైయ్యే వరకు సాంకేతికత ఉపయోగించడంతో ఇళ్లు కట్టుకోవడానికి వెనకాడుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఇళ్ల ప్రగతి వివరాలు ఇవే : -
- ముగ్గు పోసినవి : 5,700
- బేస్‌మెంట్ స్థాయి : 3,600
- పైకప్పు పూర్తయినవి : 2,043
- స్లాబులు పూర్తయినవి : 1,250
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్లు : ఇళ్లపై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్లను ప్రభుత్వం సెప్టెంబర్ నెల 11న మొదలుపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే ఆదివారం మినహా మిగతా రోజుల్లో 18005995991 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించింది. నెల రోజుల్లోపే మొత్తం 14,950 ఫిర్యాదులు అందాయి. వీటిపై బిల్లులు పెండింగ్, అధికారుల అక్రమాలపైనే అధికంగా వస్తున్నాయి. జిల్లాల్లో కార్యనిర్వహణాధికారి (ఈఈ) స్థాయిలో ఇళ్ల అప్రూవల్, ఆధార్ అప్డేట్, జియో ట్యాగింగ్, ఆర్థికశాఖలో అనుమతులపైనా లబ్ధిదారులు కాల్ సెంటర్‌ని ఆశ్రయిస్తున్నారు. లబ్ధిదారులు ఇంటి పునాది దశ తరువాత యాప్‌లో బిల్లులను అప్లోడ్ చేస్తున్నారు. హౌసింగ్ శాఖ నుంచి బిల్లులు మంజూరు అవుతాయి. కానీ బ్యాంకులో లబ్ధిదారుల ఆధార్ కార్టు, ఫోన్ నంబర్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ లేకపోవండతో బిల్లులు ఆగిపోతున్నాయి. ఇదే అదనుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ - అతి తక్కువ ధరలో ఇసుక
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్! - స్వశక్తి సంఘాలతో రుణాలు

