సంక్రాంతికి తగ్గేదేలే - ప్రత్యేక శిక్షణ, డైట్‌తో కాలు దువ్వుతున్న పుంజులు
సంక్రాంతి బరిలో నిలిచేందుకు కాళ్లు దువ్వుతున్న పుంజులు - ప్రత్యేక తర్ఫీదుతో రాటు తేలుతున్న పందెం కోళ్లు - పుంజుల పెంపకం, శిక్షణపై ప్రత్యేక కథనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 10:11 PM IST
|Updated : January 4, 2026 at 4:08 PM IST
Special Story on on Fighting Cocks in AP : మన రాష్ట్రంలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి కోడి పందేలు. ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచేందుకు పందెం కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. పోటీలో బరిలో గెలిచేది నువ్వా, నేనా అన్న రీతిలో పోటీ పడేందుకు తర్ఫీదు పొందుతున్నాయి. పొరుగు రాష్ట్రాల వారే కాదు విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి పందేలు వీక్షించడానికి తహ తహలాడతారు. అంత క్రేజ్ ఉన్న కోడిపందేలకు బరిలో దిగే కోళ్లు మామూలుగా ఉంటే ఎలా? అందుకే వాటి ఎంపిక నుంచి శిక్షణ వరకు, అది తినే డైట్ నుంచి బరిలో చేసే ఫైట్ వరకు అన్నీ ఆసక్తికరమే. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలు కోడిపందేలకు పెట్టింది పేరు. కృష్ణాజిల్లాలో పందెం కోడి పుంజుల పెంపకం, శిక్షణపై ప్రత్యేక కథనం.
తెలుగింటి పెద్ద పండగకు సంప్రదాయ క్రీడలుగా మొదలైన కోడి పందేలు ఆ మూడు రోజులు అతి పెద్ద జూదంగా, కోట్లలో పందేలు కాసే స్థాయికి వెళ్లిపోయాయి. బ్రాండింగ్ ఉండి, గతంలో పందేల్లో గెలిచిన ఎక్కువ కోళ్లకు శిక్షణ నిచ్చిన వారితోనే శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో రాజుల కోటల్లో ఇలాంటి శిక్షణనిచ్చిన కుటుంబాలకు చెందినవారు వంశ పారంపర్యంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాంటివారినీ కోళ్లకు శిక్షణనిచ్చేందుకు నియమించుకుంటారు.
కాళ్లు దువ్వేందుకు ప్రత్యేక తర్ఫీదు : సంక్రాంతి పందేలకు కోడి పుంజులు బరుల్లో కత్తులు దూసేందుకు సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో తలపడుతున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి ఇలా పలు జాతుల పుంజులు బరిలో పోటీపడేందుకు సై అంటున్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందెం కోళ్ల పెంపకం దారులకు వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమయి ఉన్నారు. డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూపాయలు చేతులు మారే పందేల్లో తలపడాలంటే ఆ కోళ్లకు ఎంతో శక్తి, సామర్థ్యం అవసరం. అందుకు అవసరమైన బలవర్ధకమైన ఆహారాన్ని ఆ పుంజులకు అందిస్తున్నారు. ప్రత్యేక తర్పీదు ఇస్తూ పందెంలో ఇతర కోళ్లతో ఎలా పోటీపడాలే వాటికి ప్రత్యేకంగా మెలకువలను నేర్పిస్తున్నారు.
శిక్షకులకు నెలకు రూ.20 వేల వేతనం : సంక్రాంతి కోడి పందెలకు శిక్షణనిచ్చేవారు ఒక్కొక్కరు 10 నుంచి 15 కోళ్లనే పర్యవేక్షిస్తుంటారు. వీరికి నెలకు రూ.15 నుంచి 20 వేలు వేతనంగా చెల్లిస్తుంటారు. సాధారణంగా కోళకు శిక్షణ దసరా నుంచి మొదలు పెడుతుంటారు. ఈ షార్ట్ టర్మ్ కోర్సు బాగా పాపులర్. కొన్నిచోట్ల క్రాష్ కోర్స్లాగా ఇంకా తక్కువ వ్యవధిలోనూ ఇస్తారు. పందెం కోడి శిక్షణ వేకువజామున 5 గంటలకే మొదలవుతుంది. పందేనికి 60 రోజుల ముందు నుంచి రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్ లడ్డూ, ఖీమా, కొన్ని రకాల ఆకుకూరలను ఉడకబెట్టి పందెం కోళ్లకు పెడుతుంటారు. పండుగ 40 రోజుల ముందు నుంచి గుడ్డు తెల్లసొన పుంజులకు పెడతారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెందెం కోళ్లను ఆరు బయట ఉంచుతారు. నడకతోపాటు కొన్ని రకాల కసరత్తులు చేయిస్తారు. సాయంత్రం 4 గంటలకు వాటికి గింజమేత వేస్తారు.
భయాన్ని దూరం చేసేందుకు చేత్తో మేత : కోడి పుంజుల పందెం అంటే చూసేందుకు వేలాది మంది వస్తుంటారు. ఈలలు, కేకలు, అరుపులతో బరి అంతా గందరగోళంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కోళ్లు బయపడి పారిపోతుంటాయి. వాటిల్లో ఆ భయాన్ని దూరం చేసేందుకు జనంలో ఉన్నప్పుడు భయపడకుండా ఉండేందుకు చేత్తో మేత పెడతారు. వాటిల్లో ఉన్న బెరుకును పోగొడతారు. కోళ్లు చురుగ్గా ఉండేలా చేసేందుకు వారానికి ఒకటి రెండు సార్లు నీటిలో ఈత కొట్టిస్తారు. రింగులో ఐదారు కోళ్లను వదిలేసి, ఏది చివరి వరకూ ఉంటుందో చూస్తారు. మిగిలినవీ అలా ఉండేలా అలవాటు చేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న కోళ్లుకు సంక్రాంతికి వారం ముందు నుంచి పందేనికి వెళ్లే వరకు కోడికి పూర్తిగా విశ్రాంతినిస్తారు.
కొళ్లకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు : శిక్షణలో భాగంగా కోళ్లకు ఆయాసం రాకుండా, కొవ్వు పెరగకుండా, నరాలు ఫ్రీ అయ్యేందుకు నాలుగైదు రోజులకోసారి బి విటమిన్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లూ ఇస్తుంటారు. చలికాలం కావడంతో కోళ్లకు కొక్కెర వ్యాధి, కొరేగా, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు రాకుండా నివారించడానికి, అలాగే అవి వస్తే నియంత్రణ కోసం యాంటీబయాటిక్స్‌ను వాడతారు. పోటీలో ఉన్నప్పుడు అవతలి కోడి పొడిచే కత్తిపోట్లు, కాలిగోటి దెబ్బలకు నొప్పి తెలియకుండా ఉండేందుకు, శరీరాన్ని సిద్ధం చేసేందుకు నీళ్లపోతలు, శాకలు తీస్తారు. వీటితో కోళ్ల శరీరం గట్టిపడి, దెబ్బ తగిలినా నొప్పి తెలియక పోరాడుతూనే ఉంటాయి.
నీరుపోతలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తుంటారు. యూకలిప్టస్, కుంకుడు, వెదురు చెట్ల ఆకులు, జామాయిల్, పసుపుకొమ్ములు, తుమ్మ బెరడు వంటి 15 నుంచి 20 రకాల ఆకులను కలిపి నీటిలో మరిగిస్తారు. ఆ ద్రావణాన్ని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కోడిని ముంచడం, లేదా కోడి పై పోయడం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నెలక ఒకసారి మరికొన్ని ప్రాంతాల్లో 10 రోజుల నుంచి 15 రోజులకోసారి ఇలా చేస్తుంటారు.
కోడి కాళ్లే ఆయుధంగా : పందెంలో గెలవాలంటే కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దించాలి, ఏ రోజు ఏ రకం కోడి పందెం కోడుతుంది, ఏ జాతి కోడి ఏ జాతి కోడితో సరిగా కలబడుతుంది అనేది ముందుగా నిర్ణయించుకుని కోళ్లను బరిలోకి దించుతారు. పందేల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతుంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కత్తి కట్టకుండానే పందేనికి సై అంటారు. కోడి కాళ్లకు సహజంగా పెరిగే కాటానే ఆయుధంగా ఈ పోటీ నిర్వహిస్తుంటారు.
కాటాలు పెరుగుతున్నప్పుడు వాటిని షేప్ చేస్తూ బరిలోకి దింపే సమయానికి దాన్ని మొన దేలుస్తారు. ఆ కాటాతోనే ఎదుటి కోడిపై దాడి చేసి దెబ్బ తీయాలి కాబట్టి ఈ పోటీ చాలాసేపు కొనసాగుతుంది. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు 100 నుంచి 200 రుపాయాల వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో పుంజును జాతిని బట్టి లక్షల రుపాయాలకు విక్రయిస్తుంటారు. ఈ సంక్రాతి పండుగలో కాలు దువ్వేందుకు ఇప్పటికే పందెం కోళ్లు సిద్దం కాగా పందెం రాయుళ్లు కూడా సై అంటున్నారు.
సంక్రాంతి వేళ - కాలు దువ్వుతున్న పందెం కోళ్లు
కోడి పందేలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు - కాలు దువ్వుతున్న పుంజులు

