హైదరాబాద్ అత్తరు యమ క్రేజీ గురూ! - ఎలా తయారు చేస్తారో తెలుసా?
హైదరాబాద్ పాతబస్తీ అత్తర్‌కు శతాబ్దాల చరిత్ర - వందల ఏళ్లకు పూర్వం నుంచే అంతర్జాతీయ ఖ్యాతి - నగర వాసులకు అందుబాటులో 200 రకాల అత్తర్లు - పలు ధరల్లో లభ్యం

Published : October 16, 2025 at 2:04 PM IST
Special Story on Attar Perfume : చార్మినార్ అనగానే అందరికీ వెంటనే మట్టి గాజులు గుర్తుకువస్తాయి. కేవలం అవి మాత్రమే కాదు, సువాసనలను వెదజల్లే ‘అత్తర్’ (సెంట్) కూడా అక్కడ ఎంతో ఫేమస్ అని మీకు తెలుసా? అనేక ప్రాంతాల వారు పనిగట్టుకుని మరీ పాతనగరానికి (పాతబస్తీకి) వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి వీటి ప్రస్థానం నిజాం నవాబుల హయాంలోనే మొదలైంది. దేశవిదేశాల నుంచి తీసుకువచ్చిన, ఆల్కహాల్ రహితంగా తయారయ్యే అత్తర్ సువాసనలకు నవాబులు ఎంతో ఫిదా అయ్యేవారు. దీంతో వందల ఏళ్లకు పూర్వం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం అత్తర్‌కు ఖ్యాతి లభించింది.

మార్కెట్లో లభ్యమవుతున్న విభిన్న రకాల అత్తర్లు : రంజాన్ మాసంలో ప్రార్థనలు, పెళ్లిళ్ల సమయంలో అత్తర్ల వాడకాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. అత్తర్‌ల తయారీ ప్రక్రియ ఎంతో విభిన్నంగా సాగుతుంది. పువ్వులు, ఇతర మూలికలతో పాటు సుగంధ ద్రవ్యాలను కొన్ని రోజులపాటు గంధపు నూనెలో నిల్వ ఉంచుతారు. అందువల్ల వాటికి సహజమైన సువాసన వస్తుంది. రుహ్ గులాబ్, షమామా, ఔద్, అంబర్, మజ్మువా, మిట్టి అత్తర్ ఇలా పలు రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని తయారు చేసే ల్యాబ్‌లు అనేకం పాతనగరంలో (ఓల్డ్ సిటీలో) ఉన్నాయి. అత్తర్ నిల్వ చేసే సీసాలు కూడా విభిన్నంగా, విభిన్న రకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ అత్తర్లకు శతాబ్దాల చరిత్ర ఉంది.
"ఇప్పటికీ మా తాత, ముత్తాతలు నేర్పించినటువంటి పద్ధతులకు అనుగుణంగానే అత్తర్లను తయారు చేస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలకు హాజరైన సుందరీమణులు ఇక్కడి దుకాణాలను సందర్శించి ప్రత్యేకమైన అత్తర్‌లను కొనుగోలు చేశారు. అప్పట్నుంచి వీటి విక్రయాలు మరింత పెరిగాయి"- ఫరీద్, దుకాణదారుడు
బహుమానంగానూ ఇస్తుంటారు : ఓల్డ్‌సిటీలోని 200ల రకాలకు పైగా అత్తర్లు హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల అత్తర్లు రూ.40 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నారు. గులాబీ రేకులు, మల్లె, మొగలి పూలతో పాటు సంపంగి, గంధం చెక్కలను మరిగించటం ద్వారా వచ్చే ఆవిరితోనే అత్తర్లను తయారు చేస్తారు. అత్తరు ఎంత ఎక్కువ కాలం నిలువ ఉంటే, అంత ఎక్కువ సువాసనలు వెదజల్లుతాయని, దానిని పీల్చడం ఆరోగ్యానికి సైతం మంచిదని ఇక్కడి వ్యాపారస్థులు వివరిస్తున్నారు. చిన్నారుల నుంచి యువత వరకు అన్ని వయసుల వారు వీటిని వాడొచ్చని చెబుతున్నారు. కొంతమంది వీటిని కొనుగోలు చేసి పండుగ సందర్భంగా బహుమానంగా ఇస్తుంటారని వారు తెలిపారు.
నిజాం కాలంలోనే అత్తర్ల వాడకం : సుమారు 100 ఏళ్లకు పైగా ఈ అత్తర్లు వినియోగంలో ఉన్నట్లుగా భాగ్యనగర వాసులు చెబుతున్నారు. నిజాం కాలం నుంచి అత్తర్లు ఉన్నప్పటికీ, ఆధునిక కాలంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని రకాల అత్తర్లను అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్ నగరం అంటే చార్మినర్, బిర్యానీకే కాకుండా అత్తర్లకు కూడా ప్రసిద్ధి చెందిందని వివరిస్తున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి తమ వద్దకు వచ్చి అత్తర్లను కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
భాగ్యనగరానికి వన్నెతెస్తున్న కళాత్మక అందాలు - పర్యాటకులను ఆకట్టుకునేలా థీమ్ ఆధారిత ప్రతిమలు

