ETV Bharat / state

3 దశాబ్దాలుగా పాడి రైతుల జీవితాల్లో వెలుగులు - జాతీయ అవార్డు అందుకున్న 'సామాజిక' యాక్టర్

లఘు చిత్రాలు, వీడియోలతో అవగాహన - డాక్టర్‌ సీఎం సింగ్‌ సుశృత గౌరవ్‌ రత్న సమ్మాన్‌ అవార్డుకు ఎంపిక - పశుసంవర్ధక శాఖ ఏడీ ప్రసాదరావు ప్రస్థానమిదీ

Story on Doctor Madina Prasad Rao from Srikakulam District
Story on Doctor Madina Prasad Rao from Srikakulam District (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 6, 2026 at 10:05 PM IST

2 Min Read
Choose ETV Bharat

Story on Doctor Madina Prasad Rao from Srikakulam District : పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక్కోసారి కళాకారుడిగా మారతారు. మరోసారి శిక్షకుడిగా మారి పశువైద్యులు, సిబ్బంది, రైతులకు మెలకువలు నేర్పిస్తున్నారు. 3 దశాబ్దాలుగా వేలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. యూట్యూబ్​లో లఘు చిత్రాలు, వీడియోలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హలో డాక్టర్ సామాజిక యాక్టర్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ​

తండ్రి కలను నిజం చేస్తూ : శ్రీకాకుళం జిల్లా పెద్ద శ్రీరాంపురం డాక్టర్‌ మాదిన ప్రసాదరావు స్వస్థలం. పాడి రైతులకు సేవ చేయాలన్న తండ్రి కలను నిజం చేస్తున్నారు. 1995లో పశు వైద్యుడిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. విశాఖ పశు సంవర్ధక శాఖలో సంయుక్త సంచాలకులు (AD)గా వ్యవహరిస్తున్నారు. ‘కనీసం 2 పాలిచ్చే పశువులు పెంచుకుంటే కుటుంబానికి ఆర్థిక భరోసా’ అనే సందేశాన్ని రైతుల మనసుల్లో నాటారు. ఇటీవల జాతీయ స్థాయిలో డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన్-2025 అవార్డు సైతం అందుకున్నారు.

సోషల్ మీడియాలో విశేష సేవలందిస్తూ : సామాజిక మాధ్యమాల ద్వారా ఉచితంగా టెలిమెడిసన్‌ సేవలు అందిస్తున్నారు. వాటితో పాటుగా ప్రతిరోజు 100 మందికి పైగా పాడి రైతుల ప్రశ్నలకు స్పందిస్తున్నారు. సాగులో నూతన పద్ధతులు క్షేత్రస్థాయిలో రైతులకు చేరేలా కృషి చేస్తున్నారు. ఈ వనరులు ప్రస్తుతం రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో ఎంతో కీలకంగా మారాయి. ఇప్పటి వరకు 7 పుస్తకాలు, 154 వ్యాసాలు, 10 విజయగాథలు రచించారు. ‘ఈటీవీ’ అన్నదాతలో ఆయనవి 174 కార్యక్రమాలు, ఇతర టీవీ ఛానళ్లలో 36 కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి.

కరోనా మహామ్మారి సమయంలో లఘు చిత్రాలు, యూట్యూబ్‌ వీడియోల ద్వారా పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, పాడి పోషణ, ప్రభుత్వ పథకాలపై వంటి వాటిపై రైతులు, పశువైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఇప్పటివరకు 6 లఘు చిత్రాలను చేశారు. అదే విధంగా యూట్యూబ్​లో 350కి పైగా వీడియోలు రూపొందించారు. ఆ వీడియోలు అనతి కాలంలోనే 1.10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 40 మిలియన్‌ వీక్షణలతో ప్రజలకు ఆయనను మరింత చేరువ చేసింది.

అందుకున్న అవార్డులు : గతంలో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ‘రైతు నేస్తం’ అవార్డు అందుకున్నారు. 2007లో ఏపీ ప్రభుత్వం నుంచి డాక్టర్‌ సీకే రావు అవార్డు పొందారు. 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణ ప్రాంత ఉత్తమ ఫీల్డ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా ప్రసాదరావు గుర్తింపు పొందారు.

పశు వైద్యులకు జాతీయ స్థాయిలో ఇచ్చే ‘డాక్టర్‌ సీఎం సింగ్‌ సుశృత గౌరవ్‌ రత్న సమ్మాన్‌’ అవార్డును ప్రసాదరావు అందుకున్నారు. ప్రస్తుతం ఈయన విశాఖలో సహాయ సంచాలకుడిగా పని చేస్తున్నారు. ఇటీవల విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైౖరెక్టర్‌ కార్యాలయంలో ప్రసాదరావును సత్కరించారు.

అరుదైన వస్తువుల సేకరణ హాబీ - ఇంటినే మ్యూజియంగా మార్చేసిన డాక్టర్లు

క్యాన్సర్‌పై అవగాహన పెరగాలి - 'పద్మభూషణ్‌'తో బాధ్యత పెరిగిందన్న నోరి దత్తాత్రేయుడు