ETV Bharat / state

సాహిత్య, సాంస్కృతిక, హస్తకళల మేళవింపు - 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

గుంటూరులో ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు - ప్రధాన వేదిక పక్కన రామోజీరావు ప్రాంగణంలోని స్టాళ్లలో పుస్తకాలు - సందర్శకులు, విద్యార్థుల్ని ఆకట్టుకున్న హస్త కళాకృతులు

3rd World Telugu Conference - 2026
3rd World Telugu Conference - 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 10:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

3rd World Telugu Conference - 2026 in Guntur: గుంటూరు నగరంలో ఘనంగా ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు-2026 సాహిత్య, సాంస్కృతిక, హస్తకళలకు మేళవింపునకు చిరునామాగా నిలిచింది. ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదిక పక్కన ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రాంగణంలోని స్టాళ్లలో కవులు, రచయితలకు సంబంధించిన పుస్తకాలు ఆహుతులకు సాదర స్వాగతం పలికాయి. హస్త కళాకృతులు సందర్శకులు, విద్యార్థుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈనాడు దిన పత్రికలో ప్రచురితమైన కార్టూన్లతో పాటు పలువురు కార్టూనిస్టులు వేసిన బొమ్మలు అందరిని ఆలోచింపజేశాయి. ఏటికొప్పాక బొమ్మలు, పూర్వ కాలం నాటి చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని చాటే తెలుగు నాణాలు చిన్నారుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నుంచి వచ్చిన సాహితీ ప్రియులకు, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భాషాభిమానులకు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు సరికొత్త సాంస్కృతిక అనుభవాలను అందించింది. గతంలో ఎన్నడూ చూడని కళాకృతుల్ని, కనువిందు చేసే అబ్బుర చిత్రాల్ని, సాహిత్య పుస్తక పరిమళాల్ని ఈ తెలుగు మహా సభలు ఆహుతులకు పరిచయం చేశాయి.

సాహిత్య, సాంస్కృతిక, హస్తకళల మేళవింపు - 3వ ప్రపంచ తెలుగు మహాసభలు (ETV)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకృష్ణుడి ఆకారంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద విద్యార్థులు చిత్రాలు దిగేందుకు పోటీలు పడ్డారు. సందర్శకులు, తెలుగు ఉపాధ్యాయులు సైతం ఎన్టీఆర్‌ ఛాయాచిత్రాలను ఆసక్తితో తిలకించి ఫొటోలు దిగారు. ఎన్టీఆర్​ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. రామోజీరావు విగ్రహం వద్ద కూడా సందర్శకులు, విద్యార్థులు ఫొటోలు దిగారు. రామోజీరావు విగ్రహం ప్రత్యేకంగా కనపడటంతో కొందరు విద్యార్థులు విగ్రహానికి నమస్కరించారు.

తెలుగు నేలను పాలించిన శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బృహత్పలాయనులు,ఆనంద గోత్రీకులు, రెడ్డి రాజులు, కాకతీయులతో పాటు ఇప్పటివరకూ తెలుగు వారు ఉపయోగించిన నాణెలను, తాళపత్ర గ్రంథాలు, అరుదైన శిలాజ సంపదను వెంకటేష్ కందుల, రాయలసీమ నాణెముల సేకరణ సంఘం ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. విద్యార్థుల నుంచి ఈ ప్రదర్శనకు చక్కటి స్పందన వచ్చింది. ఏళ్ల సంవత్సరాల నాటి నాణెలు, అరుదైన వస్తువుల్ని సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పీవీఎస్‌ రామకృష్ణరావు తెలుగు కవులు గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, విశ్వనాథ సత్యనారాయణ, తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి, వేములపల్లి శ్రీకృష్ణ, దువ్వూరి వెంకటరమణశాస్త్రి, తాడిగిరి పోతురాజు, పానక కనకాంబ విగ్రహాలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో రూపొందించి స్టాల్‌లో పెట్టారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన కవుల గురించి నేటి తరం విద్యార్థులకు తెలియచేసేందుకు విగ్రహాలను రూపొందించినట్లు ఆయన వివరించారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏర్పాటు చేసిన వ్యంగ్య చిత్రాల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈనాడు దిన పత్రికలో ప్రచురితమైన కార్టూన్లతో పాటు పలువురు కార్టూనిస్టులు వేసిన బొమ్మలు అందరిని ఆలోచింపజేశాయి. పుస్తకాలు, కథల ద్వారా చెప్పే నీతిని, సందేశాన్ని కేవలం ఒక్క కార్టూన్ తో ఆకట్టుకునేలా చెప్పడం అనేది తెలుగువారికి ఉన్న అరుదైన శైలిగా వ్యంగ్య చిత్రకారులు పేర్కొన్నారు. ఈ వ్యంగ్య చిత్రాలకు సంబంధించి పోటీలు నిర్వహించి ఉత్తమ చిత్రాలను ప్రదర్శనకు ఉంచడం వల్ల సందర్శకులు ప్రత్యేకంగా చూస్తున్నారని కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైభవంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు - ప్రత్యేక ఆకర్షణగా రామోజీరావు కళాప్రాంగణం

తెలుగును కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ