డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - విశాఖ, తిరుపతి జూలల్లో పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం
విశాఖ, తిరుపతి జూలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు - జంతువులకు ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించేలా ఏర్పాట్లు - వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా స్వీకరించాలని పవన్ పిలుపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 2, 2026 at 3:09 PM IST
Sanitation Drive in Visakha and Tirupati Zoo : వన్యప్రాణుల ఆరోగ్యం, సందర్శకులకు మెరుగైన వాతావరణమే లక్ష్యంగా విశాఖ, తిరుపతి జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. జూ ప్రాంగణాలు పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడం ద్వారా జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని పవన్ సూచించారు.
ఈ మేరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖ ఇందిరా గాంధీ జూ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జంతువుల ఆవాస ప్రాంతాలు, సందర్శకుల మార్గాలు, ఉద్యానవనాలు, నీటి వనరులు, విశ్రాంతి ప్రాంతాలు, ఆహార పంపిణీ కేంద్రాలు, వ్యర్థాల సేకరణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. జూ పరిసరాల్లో వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ తొలగింపు, పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకున్నారు.
వన్యప్రాణుల ఆరోగ్యం, సందర్శకులకు మెరుగైన వాతావరణమే లక్ష్యంగా…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 1, 2026
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం, తిరుపతి జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
జూ పరిసరాలు పరిశుభ్రంగా,… pic.twitter.com/uVWJ1svMhi
క్రమం తప్పకుండా నిర్వహించాలి: విశాఖ జూలో అధునాతన ఇంక్యూబేషన్ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలకు జన్మనిచ్చిన నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా విశాఖతో పాటు తిరుపతి జూలల్లో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు.
వన్యప్రాణుల సంరక్షణను ప్రతి పౌరుడు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలు మాత్రమే కాకుండా, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్ర బిందువులుగా నిలవాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. క్రమం తప్పకుండా జూలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి : పవన్ కల్యాణ్
గ్రేట్ గ్రీన్ వాల్లో తాటి వనాలు - 55 లక్షల గింజలు నాటడమే లక్ష్యం: పవన్ కల్యాణ్

