సర్ క్లెయిమ్‌లు, అభ్యంతరాల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఈఓ వివేక్ యాదవ్
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ మరింత వేగవంతం చేయాలన్న సీఈఓ వివేక్ యాదవ్ - సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు , అదనపు డీఈఓలు, డిప్యూటీ డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 8:05 PM IST
CEO Vivek Yadav On SIR 2026 : రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ - 2026 ప్రక్రియను, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు డీఈఓలు, డిప్యూటీ డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ ఎస్. డిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.
సులభంగా సేవలు : ఓటర్లకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఆయా రోజుల్లో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండి, ఓటర్ల జాబితా పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ, మార్గదర్శకాలను అందిస్తారని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లకు, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు అందజేయడం, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, బీఎల్ఓలతో 'బుక్ ఎ కాల్' పెండింగ్ సమస్యలు, ఎన్‌జీఎస్‌పీ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులపై సీఈఓ నిశితంగా సమీక్షించారు.
విచారణ ప్రక్రియ వేగవంతం : భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో ఓటర్ల నమోదు అధికారులకు అర్ధ-న్యాయ అధికారాలు ఉన్నాయని, విచారణ సమయంలో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విచారణల సమయంలో ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను బీఎల్ఓ యాప్ ద్వారా మాత్రమే అప్‌లోడ్ చేయాలని, ఇందుకు బీఎల్ఓలకు సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ప్రత్యేక దృష్టి : ఫారం-9, 10, 11, 11ఎ, 11బి కింద స్వీకరించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల జాబితాను ప్రతిరోజూ సీఈఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, వారానికోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఈ జాబితాలను పంచుకోవాలని ఆదేశించారు. కళాశాలలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి యువతను ఓటర్లుగా నమోదు చేసేలా డీఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రచార దినాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని సీఈఓ సూచించారు. విచారణ సమయంలో ఓటర్లు సమర్పించే ధ్రువపత్రాలను బీఎల్ఓ యాప్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో అదనపు సీఈఓ ఎస్. డిల్లీ రావు వివరించారు.
15 ఏళ్లు న్యాయపోరాటం - జైలు నుంచి విడుదలైన మాజీ మావోయిస్టు కేశవరావు
విశాఖ బీచ్ రోడ్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నాదెండ్ల మనోహర్

