విద్యార్థులకు పోలవరం ప్రాజెక్టు వీక్షించే అవకాశం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు - వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చిన స్పీకర్ అయ్యన్న - ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని యువతకు పిలుపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 3:50 PM IST
|Updated : February 18, 2026 at 9:02 PM IST
Speaker Ayyanna Patrudu Interaction with Students: అసెంబ్లీని సందర్శించిన విద్యార్థులకు త్వరలో పోలవరం ప్రాజెక్టును కూడా వీక్షించే అవకాశం కల్పిస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే నాయకత్వం స్వీకరించాలని సూచించారు.
దాదాపు 300 మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు సభా గ్యాలరీల్లో కూర్చొని ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చలు, చట్టాల రూపకల్పన ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు. 6 రోజులుగా కొనసాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో ఇప్పటికే దాదాపు 1400 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. సభ విరామ సమయంలో స్పీకర్ స్వయంగా విద్యార్థుల వద్దకు వెళ్లి వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో యువత పాత్రను స్పీకర్ వివరించడం వారికి ప్రత్యేక ప్రేరణగా నిలిచింది.
అసెంబ్లీని సందర్శించిన 1400 మంది విద్యార్థులు: భావి భారత పౌరులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏపీ శాసనసభ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ రోజు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించారు. గత 6 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 1400 మంది విద్యార్థులు భాగమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చలు, చట్టాల రూపకల్పన విధానం, బడ్జెట్ ఆమోద ప్రక్రియ వంటి అంశాలను వారు ఆసక్తిగా గమనించారు.
మేము ఇక్కడకు వచ్చేటప్పుడు ఇది రాజకీయ దేవాలయం అని చెప్పారు. కాని మాకు ఇక్కడకు వచ్చాక తెలిసింది. ఇంతమంది నేతలు ప్రజల సమస్యలు, ఆశయాల గురించి మాట్లాడటం చూసి చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా విద్యాశాఖ గురించి మాట్లాడేటప్పుడు 33,800 కోట్లు దీనికి కేటాయించారు అని తెలియజేశారు. ఇలానే వ్యవసాయం గురించి చాలా వరకు మాట్లాడారు. అలానే మా శ్రీకాకుళం నుంచి ఇంతమంది నేతలను ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది.- విద్యార్థిని
విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమైన నేతలు: కాగా నిన్నటి రోజున సభా విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పత్తిపాటి పుల్లారావు, బొండా ఉమామహేశ్వరరావు విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఉన్నత లక్ష్యాలతో చదివి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడితో విద్యార్థులు ఫొటోలు దిగారు. చట్టసభ వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూడటం తమకు స్ఫూర్తినిచ్చిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
అమరావతిలో మాక్ అసెంబ్లీ - నాయకుల్లా అదరగొట్టిన విద్యార్థులు
అసెంబ్లీకి విద్యార్థులు - సరదాగా ముచ్చటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

