జూన్ 5 తరువాతే తెలంగాణకు నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు జూన్ 4, 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం- ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని ముందుగా అంచనా వేసిన వాతావరణశాఖ - అంచనాలకు భిన్నంగా నైరుతి ఆలస్యం

Published : May 29, 2026 at 1:35 PM IST
Southwest Monsoon Delayed : ఈసారి నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం కానుంది. జూన్ 4, 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినప్పటికీ దానికి భిన్నంగా రుతుపవనాల కదలికలు ఉన్నాయి. గతేడాది మే 24న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అప్పటి అంచనా కంటే 8 రోజులు ముందే ప్రవేశించాయి. 2025లో మే 26న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.
ఎల్‌నినో ప్రభావంతో : ఈ ఏడాది వానాకాలం కొంత ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్ ఐదో తేదీ తర్వాతే తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకుతాయని తెలుస్తోంది. భారతదేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25న తాకుతాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసినా ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం అధికంగా తగ్గింది.
శ్రీలంక వరకు వచ్చి : ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే మే నెల చివరికల్లా తెలంగాణ రాష్ట్రాన్ని రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల వర్షాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు : నైరుతి రుతుపవనాల ఆలస్యం అలా ఉండగా జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. మధ్య, వాయువ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ అన్నారు.
సాధారణం కన్నా ఎక్కువగా వడగాలులు : ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, బిహార్, ఒడిశా, హర్యానా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లలో సాధారణం కంటే ఎక్కువగా వడగాలుల వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సముద్ర పరిస్థితులపై డాక్టర్ మృత్యుంజయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తటస్థ ఈఎన్ఎస్ఓ పరిస్థితులు ఎల్‌నినో వైపుగా మారుతున్నాయని తెలిపారు. జూన్ నాటికి ఎల్‌నినో పరిస్థితులు స్పష్టంగా ఏర్పడే అవకాశం 82 శాతంగా ఉందని, జూలై, ఆగస్టు నాటికి 90 శాతానికి పైగా చేరుతుందని అన్నారు. రుతుపవన కాలమంతా తటస్థ హిందూ మహాసముద్ర ద్విధ్రువ(ఐఓడీ) పరిస్థితులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లోకి : దేశవ్యాప్తంగా మే నెలలో వర్షపాతం సాధారణం కంటే నాలుగు శాతం ఎక్కువగా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మే 27 వరకు నమోదైన మొత్తం రుతుపవన వర్షపాతం సాధారణం కంటే ఒక శాతం అధికంగా ఉందని డాక్టర్ మృత్యుంజయ్ పేర్కొన్నారు. ఈసారి రుతుపవనాలు సాధారణంగా మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని ఆయన తెలిపారు. వచ్చే వారంలోగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా వెల్లడించారు.
దేశంలో నైరుతి రుతుపవనాలు- ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలు: ఐఎండీ
వెదర్ అలర్ట్ : తెలంగాణలో నేడు, రేపు వడగాలులు - ఆ జిల్లాలపై తీవ్ర ప్రభావం

