ప్రయాణికులకు శుభవార్త - దసరా, దీపావళి పండుగలకు 750 ప్రత్యేక రైళ్లు
South Central Railway Running Special Trains : దసరా, దీపావళి పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అవసరమైతే మరికొన్ని నడిపిస్తామని తెలిపింది.

Published : October 12, 2026 at 8:10 PM IST
South Central Railway Running Special Trains : దసరా, దీపావళి పండగల్లో ప్రయాణికలు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పండగల సీజన్లో 750కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా భధ్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రద్దీ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు, టికెట్ కౌంటర్ల సంఖ్యను కూడా పెంచామని ఆయన స్పష్టం చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రత్యేక రైళ్లపై సీపీఆర్ఓ శ్రీధర్తో ముఖాముఖి.
ప్రశ్న : దసరా, దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తోంది?
జవాబు : దాదాపు 750పైగా ప్రత్యేక రైళ్లను ప్రస్తుతం నడిపిస్తున్నట్లు ప్రకటించాం. అవసరమైతే మరికొన్ని నడిపించే అవకాశాలున్నాయి.
ప్రశ్న : ఏఏ రూట్లల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు? అక్కడ ఎన్ని రైళ్లను నడిపిస్తున్నారు?
జవాబు : దసరా, దీపావళి పండుగలు అంటే ఉత్తర, తూర్పు భారత్ వైపు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సిటీ నుంచి కోస్తాంధ్ర, దక్షిణ భారత్ వైపు వెళ్లే వారు అధికంగా ఉంటారు. దిల్లీ, పట్నా, హౌరా వైపు ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉంటుంది. దక్షిణ భారత్లో బెంగళూరు, చెన్నై వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు. ఇంకా ప్రముఖ దేవాలయాలు ఉన్న పట్టణాల వైపు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తారు.
ప్రశ్న : హైదరాబాద్లోని చర్లపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి ఎన్ని రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి?
జవాబు : ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. అలాగే మహారాష్ట్రలోనూ స్పెషల్ రైళ్లను వేయడం జరుగుతుంది.
ప్రశ్న : గత సంవత్సరం 1,000కి పైగా రైళ్లను నడిపించారు. ఈసారి 750 మాత్రమే పరిమితమైంది. ఎందుకు?
జవాబు : ప్రతి ఏడాది రైళ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఎన్ని ట్రైన్లు వేసిన సరిపోయే పరిస్థితి ఉండదు. సౌత్ సెంట్రల్ రైల్వే 6 డివిజన్ల నుంచి 3 అవ్వడం వల్ల మేం ప్రకటించిన సంఖ్య తక్కువగా అనిపిస్తుంది.
ప్రశ్న : ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఎలా ఉంటాయి? సర్వీసులు తక్కువగా ఉన్నాయి. ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం.
జవాబు : రోజూ ఉండే రైళ్ల మాదిరే ప్రత్యేక రైళ్లను నడిపిస్తాం. సర్వీసులో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా నడిపించడం వల్ల కొద్ది మేర అదనపు అంటే 1/3 ఛార్జీలుంటాయి. రూ.100 టికెట్ ఉంటే రూ.30 అదనపు ఛార్జీలుంటాయి. మొత్తం రూ.130 అవుతుంది టికెట్ ధర.
ఈ దసరాకు ఊరెళ్తామా? - ప్రధాన రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్
'హైటెక్ సిటీ'లో రైళ్లు ఆపండి మహాప్రభో! - పండుగ వేళ ఐటీ ఉద్యోగుల రిక్వెస్ట్

