ETV Bharat / state

బతికి ఉన్న తల్లిని బావిలో పడేసిన కుమారులు - ఆత్మహత్య చేసుకుందని నమ్మించే యత్నం

పక్షవాతంతో మంచంలోనే ఉంటున్న తల్లి - ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలిపెట్టాల్సి వస్తుందని ఘాతుకం - తల్లిని బావిలో పడేసిన పెద్ద, చిన్న కుమారులు - దర్యాప్తులో బయటపడ్డ చేదు నిజం

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 26, 2026 at 6:22 PM IST

|

Updated : August 26, 2026 at 7:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sons Threw Their Living Mother into a Well : ఏడుపదుల వయసు పైగా పక్షవాతంతో మంచం మీద నుంచి కనీసం లేవలేని దుస్థితి. మరి అలాంటి వృద్ధురాలు తనకు తానుగా ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య ఎలా చేసుకుంటుంది. ఒకవేళ ఏ అర్థరాత్రో పాకుతూ వెళ్లిందనుకుందాం. అతికష్టం దూకినా సరిగ్గా నీళ్లల్లో పడే అవకాశం లేదు. పొలంలో ఉండే బావిలో ఒడ్డునే పడటం ఖాయం కానీ ఎవరో తీసుకెళ్లి బావి మధ్యలో పడేసినట్లుగా ఎలా దూకగలిగింది. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని జనాలను నమ్మించడానికి కట్టుకథ అల్లారని చూసిన వారెవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ కథకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే మాత్రం నోరు వెళ్లబెట్టాల్సిందే.

అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు : కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 6న పక్షవాతంతో మంచానపడిన వృద్ధురాలు నూనె వెంకటమ్మ కనిపించకుండాపోయింది. ఆమె జాడ కోసం నలుగురు కొడుకులు గ్రామం మొత్తం వెతికారు. అయితే ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ వ్యవసాయ బావిలో ఆమె పడిపోయి ఉంటుందని భావించి నీళ్లన్నీ తోడి చూశారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటిరోజు చిన్న కొడుకు శ్రీనివాస్‌ 300 మీటర్ల దూరంలో ఉన్న మరో వ్యవసాయ బావిలో పడి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ అందరినీ తీసుకుని వెళ్లి చూడగా అందులో ఆమె మృతదేహం లభ్యమైంది. పక్షవాతంతో అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అందరూ నమ్మారు. కానీ రెండో కుమారుడికి మాత్రం తల్లి ఆత్మహత్యపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బతికి ఉన్న తల్లిని బావిలో పడేసిన కుమారులు - ఆత్మహత్య చేసుకుందని నమ్మించే యత్నం (ETV Bharat)

బావిలో పడేసిన కుమారులు : పక్షవాతంతో మంచంమీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఎలా వెళ్లిందని పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. అక్కడికి వెళ్లే దారి కూడా దట్టమైన పొదలతో నిండి ఉంది. పైగా ఆ బావి ఒడ్డు నుంచి దూకినా నేరుగా నీళ్లలో పడే పరిస్థితి లేదు. గ్రామంలో విచారించగా కుమారులపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కన్నతల్లిని కుమారులే తీసుకెళ్లి బతికి ఉండగానే బావిలో పడేశారని తేలింది.

చిన్న కుమారుడి పథకం : వెంకటమ్మకు నలుగురు కుమారులు కాగా వంతులు వారీగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ఆమె చనిపోవడానికి పది రోజులు ముందే పక్షవాతానికి గురైంది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఎదురైంది. ఎక్కువకాలం బతికే అవకాశం లేదని తెలిసిపోయింది. అయితే ఎవరి వంతు ఉన్నప్పుడు తల్లి చనిపోతే వాళ్లు శాస్త్ర ప్రకారం ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందన్న మూఢనమ్మకంతో ఆమె ఇంట్లో చనిపోకుండా బయటే ప్రాణాలు విడిచేలా చిన్న కుమారుడు పథకం వేశాడు. ఈ విషయం పెద్దన్నయ్యకు చెప్పగా అతను కూడా సరేనన్నాడు. దీంతో చిన్న కుమారులు తల్లిని ఎత్తుకుని రాగా పెద్ద కుమారుడు ఎవరూ చూడకుండా దారికాచాడు. రాత్రివేళ ఎవ్వరికీ తెలియకుండా తీసుకెళ్లి బతికి ఉన్న తల్లిని బావిలో పడేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు తల్లి కనిపించడం లేదని నాటకమాడారు.

"80 సంవత్సరాల వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో 300 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఎలా ఆత్మహత్య చేసుకుంటుందనే అనే అనుమానాలు వచ్చాయి. విచారణలో భాగంగా వృద్ధురాలి పెద్ద, చిన్న కుమారులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్లు తేలింది" - శ్రీనివాస్, హుజూరాబాద్ రూరల్‌ సీఐ

అరెస్టు చేసిన పోలీసులు : రెండో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హత్యకేసును చేధించారు. పెద్దకుమారుడు సమ్మయ్యతో పాటు చిన్నకుమారుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

భూమి కౌలుకివ్వలేదని అక్కసు - తోడి కోడలిని హత్య చేసిన మహిళ

మేకలను దొంగతనం చేస్తుండగా చూశాడని 11 ఏళ్ల బాలుడి దారుణ హత్య- ఆపై హైడ్రామా!

Last Updated : August 26, 2026 at 7:05 PM IST