కన్న ప్రేమపై కత్తి వేటు - తండ్రిని బలి తీసుకున్న కిరాతక పుత్రుడు
కృష్ణా జిల్లాలోని కొండిపర్రు గ్రామంలో కొడుకు చేతిలో హత్యకు గురైన తండ్రి - మద్యానికి బానిసైన కుమారుడిని మందలించిన తండ్రి - కోపోద్రిక్తుడై కత్తితో దాడి చేసిన తనయుడు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 9:45 PM IST
Son kills Father in Kondiparru at Krishna District: మద్యం మత్తు మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. కానీ ఇక్కడ ఆ మత్తు ఏకంగా కన్నప్రేమనే ఖూనీ చేసింది! బుడిబుడి అడుగుల వేళ వేలు పట్టి నడిపించిన ఆ చేతులే పెరిగి పెద్దయ్యాక అదే తండ్రి గొంతు నులిమాయి. తప్పు చేస్తున్నావని మందలించినందుకు కన్నతండ్రి అని కూడా చూడకుండా కసాయిలా మారి కత్తితో తెగనరికిన ఓ ఉన్మాద పుత్రుడి ఘాతుకమిది. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో జరిగిన ఈ దారుణం సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.
కృష్ణా జిల్లా పామర్రు మండలం, కొండిపర్రు గ్రామంలోని డీపీ గూడెంలో నివసించే చదువుల సురేష్ (45) ఒక సామాన్య తండ్రి. సురేష్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్నతనంలోనే భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. తాను రెండో పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ తనకు భార్యగా ఉంటుంది కానీ తన పిల్లలకు తల్లిగా ఉండదని పిల్లల కోసం పెళ్లికి దూరంగా ఉన్నాడు. రెక్కల కష్టంతోనే ఇద్దరు పిల్లలను పెంచి పొషిస్తున్నాడు. తన కుమారుడు చదువుల చంద్ర మహేష్ (22) ప్రయోజకుడు కావాలని ఆశపడ్డాడు. కానీ మహేష్ మాత్రం మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటు పడి దారి తప్పాడు.
కత్తిని తీసుకుని విచక్షణారహితంగా దాడి: ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చిన కుమారుడిని చూసి తండ్రి మనసు తల్లడిల్లిపోయింది. "అయ్యా ఇలా తాగుతూ తిరిగితే నీ భవిష్యత్తు ఏమైపోతుంది?" అంటూ సురేష్ తన కొడుకును ప్రేమగా మందలించాడు. కానీ, మద్యం మత్తులో ఉన్న మహేష్‌కు ఆ మాటలు బుద్ధుని బోధనల్లా కాకుండా నిప్పు కణికల్లా అనిపించాయి. మందలించిన తండ్రిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన చంద్ర మహేష్ స్నానానికి వేడి నీళ్లు కాస్తున్న సమయంలో కత్తిని తీసుకుని తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
కనికరం లేకుండా తండ్రి మెడపై, చేతులపై కత్తితో నరికాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న తండ్రిని చూసి కూడా ఆ కిరాతకుడి మనసు కరగలేదు. తీవ్ర గాయాల పాలైన సురేష్‌ను బంధువులు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు ధృవీకరించారు. కుమారుడి చేతిలోనే తండ్రి ప్రాణాలు పోవడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు చంద్ర మహేష్‌పై కేసు నమోదు చేశారు. కన్నతండ్రి చంపడం పోలీసులు రావడంతో తనను అరెస్ట్ చేశారని భయపడి మహేష్ పారిపోయాడు. తండ్రిని చంపిన కుమారుడి ఆచూకి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మహేష్‌ను ఆదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది. కన్నతండ్రిని చంపిన ఆ కుమారుడు కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు.

