ETV Bharat / state

టీటీడీలో 'ఆ ముగ్గురికి ఓ లెక్కుంది' - ఫైల్ కదలాలంటే కాసులివ్వాల్సిందే!

టీటీడీ ఎస్టేట్, రెవెన్యూ విభాగాల్లో ఆ ముగ్గురి హవా - కాసులు ముట్టచెబితేనే ఈ రెండు విభాగాల మధ్య ఫైళ్లు కదులుతున్నాయనే ఆరోపణలు - అధికారుల తీరుతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న టీటీడీ

Corrupt Officers in TTD
టీటీడీలో అక్రమాల సిండికేట్ (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 23, 2026 at 9:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Corrupt Officers in TTD : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులు, ఆదాయ వ్యవహారాలను అత్యంత పారదర్శకంగా పర్యవేక్షించాల్సిన అధికారులు దారి తప్పుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని ఎస్టేట్, రెవెన్యూ విభాగాలు కొందరు అధికారుల తీరుతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఎస్టేట్‌ విభాగంలోని ఓ ఉన్నతాధికారిణి, ఆమెకు వత్తాసు పలుకుతున్న ఓ సహాయకుడు, రెవెన్యూ విభాగానికి చెందిన మరో కీలక మహిళా అధికారిణి వెరసి ఈ ‘ముగ్గురు’ ఒక సిండికేట్‌గా మారి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాసులు ముట్టచెబితేనే ఈ రెండు విభాగాల మధ్య ఫైల్స్​ కదులుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అవినీతికి పాల్పడుతున్న వీరి అనధికార ఆదేశాలకు తలొగ్గని కింది స్థాయి సిబ్బందికి నిత్యం నరకం కనిపిస్తోంది. తాము చెప్పినట్లుగా ఫైల్​ను రూపొందించలేదనే నెపంతో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌పై వరుస మెమోలు ఇచ్చి కక్షసాధింపునకు దిగినట్లు అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ఈ వేధింపులతో విసుగెత్తిన సదరు ఉద్యోగి మరో విభాగానికి బదిలీపై వెళ్లారు. అయినా వదలకుండా అక్కడికీ మెమోలు పంపుతూ ఆమె వల్లే పని కుంటుపడిందంటూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మహిళా ఉద్యోగి డిప్రెషన్‌లోకి (సూసైడ్‌ టెండెన్సీ) వెళ్లిపోయారు. తోటి సిబ్బంది ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సముదాయించాల్సి వచ్చిందంటే, అక్కడ వేధింపుల స్థాయి ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ విభాగంలో పనిచేసే సుమారు 12 మంది కిందిస్థాయి సిబ్బంది ప్రతిరోజూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.

మెడికల్‌ షాపు రీఫండ్‌ : ఇటీవల ఓ మెడికల్‌ షాపునకు సంబంధించిన రూ.కోటిన్నర డిపాజిట్‌ రీఫండ్‌ వ్యవహారం ఈ ముగ్గురి బాగోతాన్ని బట్టబయలు చేసిందని తెలుస్తోంది. సదరు షాపునకు టీటీడీ చెల్లించాల్సిన సుమారు రూ.80,000ల బకాయిలు పోనూ, మిగిలిన డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఫైల్ ఈ విభాగానికి వచ్చింది. ఫైల్ కదలాలంటే కొంత శాతం ‘కమీషన్‌’ ఇవ్వాల్సిందేనని ఆ అధికారుల వద్ద ఉండే ఓ సహాయకుడు మధ్యవర్తిత్వం నెరిపినట్లు తెలిసింది. బేరసారాలు కుదిరాక ఫైలును పైకి ఎలా పంపాలో ఎస్టేట్‌ అధికారిణి రెవెన్యూ అధికారిణికి అనధికారిక ఆదేశాలిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆఫీసులోనే వ్యాపారాలు : తిరుపతిలోని రాంనగర్, వినాయకనగర్‌ తదితర ప్రాంతాల్లో టీటీడీకి సుమారు 1200కు పైగా క్వార్టర్లు ఉన్నాయి. ఉద్యోగులకు అర్హతలను బట్టి వీటిని కేటాయిస్తారు. ఇవి కూడా ఈ ‘ముగ్గురి’ కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఫైల్ ఆమోదం పొంది వచ్చినా చివరగా ప్రొసీడింగ్స్‌ కాపీ చేతికి ఇవ్వాలంటే తప్పనిసరిగా ‘నజరానా’ సమర్పించుకోవాల్సిందేనట. ఇదంతా ఒక ఎత్తైతే సదరు కీలక అధికారిణి ఏకంగా కార్యాలయంలోనే వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని సాటి ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు వేడుకుంటున్నారు.

దాతల సదుపాయాల్లో మార్పులు - టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

తిరుమల భక్తులకు అలర్ట్ - నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరాలపై టీటీడీ కీలక ప్రకటన