కోతులను తరుముతున్న గొరిల్లాలు - ఈ ఊరి సర్పంచ్ వినూత్న ప్రయత్నం
కోతుల బెడదతో ఆ గ్రామ ప్రజల అవస్థలు - గతంలో విఫలమైన, ప్రస్తుతం ఫలించిన కొత్త పథకం - ఎట్టకేలకు కోతుల ఆగడాలకు గొరిల్లాలతో చెక్ పెట్టిన సర్పంచ్

Published : February 26, 2026 at 6:08 PM IST
Monkeys In Village: గ్రామాలలో రోజురోజుకు కోతుల బెడద ఎక్కువ అవుతుండటంతో వాటిని తరిమేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామస్థులు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని దేవనగర్ క్యాంపు గ్రామ సర్పంచ్ కోతుల బెడదను అరికట్టడానికి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. దాంతో ఊరి గ్రామస్థులంతా ఆయనను అభినందిస్తున్నారు.
ఇచ్చిన హామీ మేరకు : ఇటీవల నిర్వహించిన పంచాయతీ రాజ్ ఎన్నికల్లో దేవనగర్ క్యాంప్ గ్రామ సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ ఆ గ్రామ ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. ఆయనను గెలిపిస్తే పదవిలోకి వచ్చాక ఊరిలోని కోతులను తరిమేసి, వాటి బెడదను తగ్గిస్తానని ప్రచార సమయంలో తెలిపారు. ఎన్నికల్లో గ్రామస్థులంతా యూసుఫ్‌ను సర్పంచ్‌గా గెలిపించారు. ఆయన పదవీలోకి రాగానే అన్నట్టుగానే కోతులను తరిమేకొట్టే పనిని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. రూ.5 వేలు వెచ్చించి రెండు గొరిల్లా డ్రెస్‌లను కొనుగోలు చేసి వాటిని ఇద్దరు వ్యక్తులకు వేశాధారణ వేసి గ్రామంలో తిప్పుతున్నారు.
భయపడి పారిపోతున్న కోతులు : ఆ గొరిల్లా బట్టలను ధరించిన వ్యక్తులు అచ్చం గొరిల్లాల అరుస్తూ, చేతులు తిప్పుతూ గ్రామంలోని అన్ని వీధుల్లో తిరగడం మొదలు పెట్టారు. గత 15 రోజులుగా నిత్యం ఆ బట్టలను వేసుకుని ఊర్లో తిరగటంతో అవి వారిని చూసి భయపడి పారిపోయేవి. ఈ విధంగా గ్రామంలో కోతుల బెడద తగ్గుముఖం పట్టింది. ఈ విధంగా ఆ వేశాధారణ ధరించిన యువకులకు ప్రతిరోజూ రూ.500 చెల్లిస్తున్నారు.
గతంలో ప్రయత్నాలు విఫలం : గతంలో కోతులను తరిమికొట్టడానికి పాత విధానంలో సర్పంచ్ ప్రయత్నించాడు. ఒక్కో కోతికి రూ.400 చొప్పున కోతులు పట్టేవారితో ఒప్పందం చేసుకున్నారు. వాటిని పట్టుకొని దూరప్రాంతాల్లో వదిలేశారు. అయినా కొంతకాలానికి అవి మళ్లీ గ్రామంలోకి వచ్చి చేరడంతో సమస్య మొదటి కొచ్చింది. కానీ ఈసారి సర్పంచ్ చేసిన నూతన ప్రయత్నం ఫలించటంతో గ్రామస్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"కోతుల వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుండేది. ఈ గొరిల్లా వేషం వేయడంతో కోతులు బాగా తక్కువయ్యాయి. వాటి బెడద తగ్గింది. అంతకు ముందు బాగా కరుస్తుండేది. ముసలివాళ్లపై దాడులు చేసేవి. ఈ వేశాధారణ వల్ల మాకు మంచి జరిగింది" - రాజవ్వ గ్రామస్థురాలు
కోతులతో ఎన్నో ఇబ్బందులు: మొదట్లో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో ఎక్కడికి వెళ్లిన భయంగా ఉండేదని గ్రామస్థులు అంటున్నారు. వీటివల్ల చాలా ఇబ్బందులు పడేవారని అంటున్నారు. వీటిని తరిమేయటానికి గతంలో కొన్ని ప్రయత్నాలు చేసిన అవి విఫలమయ్యాయని అన్నారు. ఈ కోతుల బెడదను తగ్గించటానికి ఎట్టకేలకు ఈ గొరిల్లా డ్రెస్ ప్రయత్నం ఫలించిందని తెలిపారు.
"మొదట్లో కోతులు ఎన్నో చిత్రహింసలు పెడుతుండేవి. వాటి ఆగడాలను తట్టుకోలేక పోయాం. ఎప్పుడైతే ఈ గొరిల్లా డ్రెస్సును ఏర్పాటు చేశామో అప్పటినుంచి చాలా కోతులు గ్రామంలోకి రావటం లేదు. వాటి బెడద పూర్తిగా తగ్గింది. మాకు సంతోషంగా ఉంది" - గణేష్, గొరిల్లా వేషధారణ వేసిన వ్యక్తి
ఆ ఊరివాళ్లను భయపెడుతున్న కుక్కలు, కోతులు - ముసుగు వేసుకుంటేనే రక్షణ

