సైబర్ నేరాలు, ఫొటో మార్ఫింగ్‌లకు అడ్డుకట్ట - వినూత్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన స్నేహితులు
అపరిక్స్ అనే సాఫ్ట్‌వేర్ రూపొందించిన ఆర్యన్, లోకేశ్ - సైబర్ నేరాలు, ఫొటో మార్ఫింగ్‌లను అడ్డుకునే సాఫ్ట్‌వేర్ - అప్‌లోడ్ కాకుండానే ముందస్తుగా అడ్డుకునే అపరిక్స్ సాఫ్ట్‌వేర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 10:24 PM IST
Software Aparix was Created by Karthikeya Aryan and Lokesh: తండ్రి సూచనతో సైబర్ నేరాలు, ఫొటో మార్ఫింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. చిన్ననాటి స్నేహితుడితో కలిసి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. డీప్‌ఫేక్ కంటెంట్‌ను అప్‌లోడ్ కాకుండానే ముందస్తుగా అడ్డుకునే 'అపరిక్స్' అనే సాఫ్ట్‌వేర్ రూపొందించారు అనంతపురానికి చెందిన కార్తికేయ ఆర్యన్, లోకేశ్. ఈ ప్రాజెక్టును ఇప్పటికే పలు వేదికలపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటున్న యువ ఇంజినీర్ల కథనమిది.
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ డీప్‌ఫేక్, మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలు అమాయకపు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సోషల్ మీడియాలో సరదాగా పెట్టే ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరుతో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేస్తూ అపరిక్స్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారీ ఇంజినీరింగ్ విద్యార్థులు. అప్‌లోడ్ కాకముందే నకిలీ కంటెంట్‌ను గుర్తించి అడ్డుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించారు.
ఆర్యన్, లోకేశ్. అనంతపురం స్వస్తలం. పదో తరగతి వరకు కలిసి చదువుకున్న వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. బెంగళూరులో వేర్వేరు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఆర్యన్ బెంగుళూరులోని నిట్టి మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లోకేశ్ తమిళనాడులోని కళాస లింగం యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నారు.
ఆ దిశగా 6 నెలల క్రితం ప్రారంభించి : వేర్వేరు రాష్ట్రాల్లో చదువుతున్నప్పటికీ సెలవుల్లో ఇంటికి వచ్చినపుడు తప్పనిసరిగా కలిసే వారు ఈ స్నేహితులు. తండ్రి న్యాయవాది కావడంతో డీప్‌ఫేక్, సైబర్ క్రైం కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయని తెలుసుకున్నాడు. అమాయకులు సైబర్ మోసగాళ్ల చేతిలో ఇబ్బంది పడటమే కాకుండా తీవ్ర అవమానాలకు గురవుతున్నారని డీప్ ఫేక్‌ను అడ్డుకునేందుకు కొత్తగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా 6 నెలల క్రితం తమ ప్రయత్నం ప్రారంభించారు.
''సోషల్ మీడియా ఎకో సిస్టమ్‌లో ఎవరైనా ఎదుటివారి అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలను డీప్‌ఫేక్, మార్ఫింగ్, ఏఐ జనరేట్ చేస్తున్నారు. ఈ సమస్యలను చెక్ పెట్టేందుకు అపరిక్స్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. అప్‌లోడ్ కాకముందే నకిలీ కంటెంట్ గుర్తించి అడ్డుకునే విధంగా సాఫ్ట్‌వేర్ తయారుచేశాం.'' - కార్తికేయ ఆర్యన్, అపరిక్స్ ఆవిష్కర్త
చిన్ననాటి స్నేహితుడితో కలిసి ప్రాజెక్ట్ రూపకల్పన : న్యాయవాదైన తండ్రి సలహాతో సైబర్ క్రైమ్, ఫొటో మార్ఫింగ్ వంటి మోసాలను అరికట్టాలని నిర్ణయించుకున్నాడు. చిన్ననాటి స్నేహితుడి లోకేశ్‌తో కలిసి ప్రాజెక్ట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. సహజ సిద్ధమైన ఫొటో, వీడియోలను డీప్ ఫేక్ చేసి అప్‌లోడ్ చేయడానికి వీల్లేని అపరిక్స్ అనే సాఫ్ట్‌వేర్ రూపొందించారీ స్నేహితులు. దీన్ని అనేక వేదికల మీద పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు : ఇప్పటికే డీఫ్ ఫేక్‌ను గుర్తించే వెబ్ సైట్లు ఉన్నప్పటికీ ఆ తరహా కంటెంట్ అప్‌లోడ్‌ను అడ్డుకునే సాఫ్ట్‌వేర్‌లు లేవంటున్నారు. వెబ్ సైట్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేశారు. దీన్ని ఓ రూపానికి తీసుకొచ్చి, పనితీరును పరిశీలించడానికి దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. చివరికి డీప్‌ఫేక్ కంటెంట్ అప్‌లోడ్ కాకుండా అడ్డుకోవడం పట్ల విజయం సాధించారు.
ఇప్పటికే పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వీరు. దీని పనితీరుపై సాంకేతిక పరీక్షలు పూర్తైతే త్వరలోనే పేటెంట్‌ను దక్కించుకోనున్నారు. ఈ ఆవిష్కరణను గుర్తించిన మోనోపో లీ రైట్స్ సంస్థ అపరిక్స్‌ను ప్రచురించింది. ఈ ప్రయోగం సక్సెస్ సాధించడం పట్ల ఈ స్నేహితుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపరిక్స్ పేటెంట్ హక్కులు పొందితే ఈ సాఫ్ట్‌వేర్‌తో పోలీసు శాఖనే కాకుండా వెబ్ ప్లాట్ ఫాంలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు, సామాజిక మాధ్యమాల ఫ్లాట్‌ఫాంల యాజమాన్యాలకు చాలా మేలు జరగనుంది. అన్నింటి కంటే ముఖ్యంగా డీప్ ఫేక్‌కు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్‌కు చెక్ పడనుంది.
12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు
అదరగొడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు - సమాజహితానికి దోహదపడేలా ఆవిష్కరణలు

