ETV Bharat / state

చేతిని మరచిపోయిన పోలీసులు - స్నేహలత జీవితం చీకటిమయం

తల్లికి ఒంట్లో బాగోలేదని తెలియడంతో బుధవారం రాత్రి హడావుడిగా అనంతపురం బయల్దేరిన స్నేహలత - తెగిపడిన చేతిని రెండు గంటల్లో తెస్తే తిరిగి అతికించవచ్చని వైద్యులు చెప్పినా

Police Forget Snehalata Palm
Police Forget Snehalata Palm (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 4:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Police Forget Snehalata Palm: అమ్మకు ఆరోగ్యం బాగా లేదని సమాచారం తెలిసింది. అంతే ఆమె హడావుడిగా అమ్మ దగ్గరకు బయల్దేరింది. కానీ అదే ఆమె జీవితాన్ని చీకటి మయం చేస్తుందని ఊహించలేకపోయింది. తాను ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురవడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి. తన మీదే ఆధారపడిన కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని ఆస్పత్రికి పంపించారు. కానీ ఇంకా కాస్త దయగా ఆలోచించి ఉంటే ఆమె జీవితాంతం బాధ పడాల్సిన దుస్థితి నుంచి బయటపడేది.

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు దగ్గర బస్సు బోల్తాపడిన ఘటనలో తీవ్ర గాయాలపాలై ఎడమ చేయి మణికట్టు వరకు తెగిపోయిన స్నేహలత (23)ను తెలంగాణ పోలీసులు హుటాహుటిన కర్నూలు పంపారు. అయితే తెగిపడిన అరచేయి భాగాన్ని పంపడం మరిచిపోయారు. కర్నూలు వచ్చిన తరువాత వైద్యులు తెగిపడిన చేతిని రెండు గంటల్లో తెస్తే తిరిగి అతికించవచ్చని చెప్పినా పట్టించుకునేవారే కరవయ్యారు. అరచేతిని సకాలంలో తేలేకపోవడంతో ఆమె శాశ్వతంగా దివ్యాంగురాలిగా జీవించాల్సిన దుస్థితి తలెత్తింది.

కుటుంబానికి ఆమే ఆధారం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్‌ గ్రామానికి చెందిన దేవరకొండ స్నేహలత బీఫార్మసీ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నిరుపేదలైన తల్లిదండ్రులు ఆదినారాయణ, లక్ష్మిలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు. చెల్లి అక్షితను ఇంటర్‌ చదివిస్తున్నారు. తల్లికి ఒంట్లో బాగోలేదని తెలియడంతో స్నేహలత బుధవారం రాత్రి హడావుడిగా అనంతపురం బయల్దేరారు. బస్సు ఇటిక్యాలపాడు వద్ద బోల్తా కొట్టడంతో ఆమె చేయి తెగి, సంఘటనా స్థలంలోనే పడిపోయింది. విరిగిపడ్డ అరచేతిని వదిలేసి పోలీసులు ఆమెను కర్నూలుకు పంపారు.

కన్నీటిపర్యంతమవుతున్న యువతి తల్లిదండ్రులు: ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటే చేయి వస్తుందని ఎవరో చెప్పడంతో స్నేహలత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అరచేతిని తెచ్చుకుంటే ప్లాస్టిక్‌ సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పడంతో బాధితురాలు తన బంధువును ఘటనా స్థలానికి పంపించారు. వారు అరచేతి భాగాన్ని కర్నూలు తీసుకొచ్చేసరికి సమయం మించిపోయింది. అందులోని కణాలన్నీ అప్పటికే నిర్వీర్యమైపోవడంతో దాన్ని అతికించడానికి అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు.

పోలీసులు తెగిపడిన చేతిభాగాన్ని కూడా ఆసుపత్రికి పంపించి ఉంటే మరికొన్ని నెలలకైనా ఆమెకు చెయ్యి వచ్చేదని, వారి పొరపాటుతో తమ కుమార్తె శాశ్వతంగా దివ్యాంగురాలిగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆసుపత్రికి వచ్చిన ఆర్టీసీ అధికారులు తాము ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించలేమని తెగేసి చెప్పేశారు. దీంతో బాధితురాలి బంధువులు వారి వాహనం ముందు బైఠాయించి, నిరసన తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం ఖర్చు భరించే స్థోమత లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

దూసుకొచ్చిన మృత్యువు: విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలం చొక్కారపాలెం గ్రామానికి చెందిన బొల్లు పైడిరాజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం అంపలాం గ్రామానికి చెందిన తమ్మిన చంద్రబోస్, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చొక్కారపాలెం గ్రామానికి చెందిన చొక్కర వెంకటరమణలు రొయ్య పిల్లలను తీసుకురావడం కోసం అదే గ్రామానికి చెందిన బొల్లు పైడిరాజు (35) సరకు రవాణా వాహనంలో కాకినాడ జిల్లా వేమవరం వెళ్లారు. అక్కడ సరకు ఎక్కించుకొని తిరుగుముఖం పట్టారు.

శుక్రవారం వేకువజామున అనకాపల్లి జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా సమీపంలో వాహన టైర్లలో గాలిని చెక్ చేయడానికి ఆపారు. వాహన డ్రైవర్​ పైడిరాజు గాలిని చెక్ చేస్తుండగా వెనక నుంచి వచ్చిన బొలోరో వాహనం అతన్ని ఢీ కొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చంద్రబోస్, వెంకటరమణలు పైడిరాజును అంబులెన్సులో నక్కపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలో పైడిరాజు మృతి చెందాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

విశాఖ మీదుగా రైల్లో వెళ్లేవాణ్ని - సాగర నగరం గ్లోబల్‌ ఏఐ హబ్‌ అవుతుందని ఊహించలేదు: సుందర్‌ పిచాయ్‌

నిందితులను తప్పించేందుకు లంచం - కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసిన సీపీ రాజశేఖరబాబు