ETV Bharat / state

సీసీ కెమెరాల ద్వారా వాయు కాలుష్యం అంచనా : ఏఐతో గాలి నాణ్యతను పసిగట్టే సరికొత్త టెక్నాలజీ

డేటాను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం - కాలుష్య అంచనాలో ఏఐ 90 శాతం ఖచ్చితత్వం - ప్రజలకు కాలుష్య సమాచారం అందేలా సిటీ యాప్‌ అందుబాటులోకి

SMART CITY LIVING LAB ON POLLUTION
SMART CITY LIVING LAB ON POLLUTION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 7, 2026 at 11:49 AM IST

3 Min Read
Choose ETV Bharat

Using AI Technology For Pollution Control : హైదరాబాద్‌లో వాయు కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అయితే కాలుష్యాన్ని కొలవడానికి ఖరీదైన ఎయిర్ క్వాలిటీ సెన్సార్లు వాడుతుంటారు. నగరంలో అడుగడుగునా ఉన్న సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గాలి నాణ్యతను పసిగట్టే సరికొత్త టెక్నాలజీని హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిధిలోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ అభివృద్ధి చేసింది.

సీసీ కెమెరాల ద్వారా వాయు కాలుష్యం అంచనా : హైదరాబాద్​లో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసే సెన్సార్ల మీదే ఆధారపడాల్సి వస్తోంది. వాటి నిర్వహణ ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీనికి చెక్ పెడుతూ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ నిపుణులు ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు, వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా వాయు కాలుష్యాన్ని అంచనా వేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని ద్వారా రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంది? ఏయే వాహనాలు వెళ్తున్నాయి? చెత్త తగలబెడుతున్నారా? లాంటి పరిస్థితులను కెమెరాలో రికార్డు చేయడంతో కాలుష్య తీవ్రతను ఏఐ మోడల్స్ విశ్లేషించి ఇట్టే పసిగడతాయి.

కాలుష్య అంచనాలో ఏఐ 90 శాతం కచ్చితత్వం : సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఈ డేటాను ఎడ్జ్ ప్రాసెసింగ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం వల్ల క్షణాల్లో కాలుష్య నివేదిక అధికారులకు చేరుతుంది. దీని ఆధారంగా ఏయే మార్గాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో గుర్తించే అవకాశం ఉంటోంది. దీని సాయంతో ట్రాఫిక్ దారి మళ్లించడం, స్కూళ్లు, ఆఫీసుల వేళల్లో మార్పులు చేయడం లాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో మొదట్లో 82 శాతం కచ్చితత్వం రాగా, ఆ తర్వాత మోడల్‌ను మరింత అభివృద్ధి చేశారు. దీంతో ప్రస్తుతం కాలుష్యాన్ని అంచనా వేయడంలో ఏఐ ఏకంగా 90 శాతం కచ్చితత్వాన్ని సాధిస్తోంది.

"ట్రాఫిక్​లో ఒక కారు, ఒక లారీ ఉంటే ఈ రెండు వాహనాల నుంచి ఎంత కాలుష్యం వస్తుంది. అలాగే ఒకచోట మంట పెట్టారు. అక్కడ నుంచి ఎంత కాలుష్యం వస్తుందని అంచనా వేయవచ్చు. ఇలా వేరు వేరు సందర్భాల్లో ఎంత కాలుష్యం వస్తుందనేది కెమెరా ద్వారా తెలుసుకోవచ్చు. కెమెరాలో ఉన్న ఫొటో డేటా ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ సెంటర్​కు వెళ్తుంది. దాంతో ఎంత కాలుష్యం వస్తుందనేది తెలుస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఎక్కువ కాలుష్యం వెలువడితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగలుగుతాం. దాంతో ప్రభుత్వం కూడా ఏవైనా నిర్ణయాలు తీసుకోవచ్చు" - వట్టెం అనురాధ, చీఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్​, స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్

వాయు కాలుష్య నియంత్రణ మరింత సులభతరం : ఈ సరికొత్త టెక్నాలజీని ఇప్పటికే ల్యాబ్ ప్రతినిధులు సంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సిటీ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా డేటాను భద్రంగా ఉంచుతూనే ప్రజలకూ కాలుష్య సమాచారం అందేలా ప్రత్యేక సిటీ యాప్‌ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సామాన్యులు కూడా తాము రోజూ వెళ్లే మార్గంలో గాలి స్వచ్ఛంగా ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చు. ఒకవేళ వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే వాకింగ్ చేసేవారు వేరే రోడ్డును ఎంచుకోవచ్చు. డేటా ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా అత్యంత పకడ్బందీ సెక్యూరిటీతో దీన్ని రూపొందిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ మోడల్‌ను ప్రభుత్వ డేటా సెంటర్‌కు అనుసంధానించి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది. ప్రభుత్వం ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వాయు కాలుష్య నియంత్రణ మరింత సులభతరం కానుంది.

నగరంలో పైవంతెనల వద్ద క్షీణిస్తున్న వాయు నాణ్యత - ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

హైదరాబాద్​లో చెవులు గిల్లుమంటున్నాయి - వేళాపాళా లేకుండా మోత మోగిస్తున్నారు!