నెలకో గుంత, రెండు నెలలకో పిల్లర్ - ఏడున్నరేళ్లు అయినా నెరవేరని ఉప్పల్ పైవంతెన కల
నెలకు ఒకటిన్నర పిల్లర్ల చొప్పున నిర్మాణం - వరంగల్ జాతీయ రహదారికి ఏడున్నర సంవత్సరాలు దాటినా 60శాతం పురోగతి - నెలకో గుంత, రెండు నెలలకు ఒక కాంక్రీట్

Published : January 7, 2026 at 11:39 AM IST
Roads Condition In Hyderabad : ఉప్పల్ కూడలి వద్ద పైవంతెన కోసం మొదటి పిల్లర్‌కు 2018 మేలో పునాది పడింది. దాదాపు 92 నెలల తర్వాత చివరి పిల్లర్ కోసం జనవరి 1న రాత్రి గుంత తవ్వారు. అది 148 పిల్లర్. అంటే నెలకు ఒకటిన్నర పిల్లర్ల చొప్పున నిర్మిస్తున్నారు. ఇంకా పీర్జాదీగూడ నుంచి ఉప్పల్ వైపు ఐదు పిల్లర్ల నిర్మించాల్సి ఉంది.
6.250 కిలోమీటర్ల దూరం పైవంతెన : అలాగే వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన పైవంతెన నిర్మాణం తీరు, ఏడున్నర సంవత్సరాలు దాటినా 60శాతం పురోగతి కూడా లేని ప్రాజెక్టు అది. వరంగల్‌కు వేగంగా అనుసంధానం కోసం, రోడ్డు ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు పైవంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. పలు అభ్యర్థనల తర్వాత ఎట్టకేలకు ఉప్పల్ కూడలి నుంచి నారపల్లి వరకు 6.250 కిలోమీటర్ల దూరం పైవంతెన నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.

రూ.670 కోట్లతో ఆరు లేన్లు : 2018లో కేంద్ర మంత్రి గడ్కరీ పనులకు శంకుస్థాపన చేశారు. గాయత్రి సంస్థ టెండర్ దక్కించుకుంది. రూ.670 కోట్లతో ఆరు లేన్లతో నిర్మించాల్సి ఉంది. భూసేకరణ, నిధుల లేమి, గుత్తేదారు సంస్థ సమస్యలతో తీవ్ర జాప్యం నెలకొంది. ఎన్నోసార్లు సదరు సంస్థకు నోటీసులు ఇచ్చినా లెక్క చేయలేదు.
- నెలకో గుంత తీస్తూ, రెండు నెలలకు ఒక కాంక్రీట్ వేస్తూ గుత్తేదారు సంస్థ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది.
- నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి ఉప్పల్, బోడుప్పల్, నారపల్లి ప్రాంతాల్లో అధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
- పనుల్లో జాప్యంపై ఉన్నత స్థాయిలో పలుమార్లు సమీక్షలు జరిగాయి. వేరే సంస్థలకు కాంట్రాక్టు అప్పగించే ప్రయత్నాలను గుత్తేదారు సంస్థ అడ్డుకుంది.
రామంతాపూర్ వైపు మరొకటి : ఉప్పల్ పైవంతెనకు అనుబంధంగా రామంతాపూర్ వైపు మరో పైవంతెనను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. ఉప్పల్ మెట్రో కూడలి వద్ద ఎత్తు పెంచాల్సి రావడం, భూసేకరణలో జాప్యంతో ఆగిపోయింది. ఇటీవల తిరిగి పనులు ప్రారంభించామని చెబుతున్నారు. ఉప్పల్ పైవంతెన ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. ఇది నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే మార్గం.
సంవత్సరాల తరబడి నిర్మాణం : అంత ప్రాధాన్యమున్న మార్గంలో పై వంతెన నిర్మాణం సంవత్సరాల తరబడి సాగుతోంది. దీంతో వాహనాదారుల అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది.
పలు కారణాలతో ఆలస్యమవుతున్న పనులు : అయితే దీనికోసం ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా మిగిలాయి. ఈ కారిడార్‌ను రూ.600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది. గాయత్రి సంస్థ సుమారు 25 శాతం తక్కువ మొత్తానికి టెండరు దక్కించుకుంది. 2020 జులైలో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, మధ్యలో గుత్తేదారు సంస్థ దివాలా తీసింది. దీంతో ప్రయాణికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలే ఇరుగ్గా ఉండే ఈ రహదారిపై పిల్లర్లు మాత్రమే నిర్మించి వదిలేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు ఆసక్తి చూపడంలేదు. అందుకే తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నారు.
ఈ జాతీయ రహదారి ఇంకెందరిని బలితీసుకుంటుందో!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ మార్గాల్లో వెళ్లే వాహనదారులు జాగ్రత్త

