ETV Bharat / state

పశ్చిమాసియాలో భీకర యుద్ధం - హైదరాబాద్​లో భయాందోళనలు

పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా హైదరాబాద్​లో నిరసనల వెల్లువ - ఇరాన్​ దేశంలో పలు యూనివర్సిటీల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు - వారి కుటుంబసభ్యుల్లో భయాందోళనలు - నగరంలోని విదేశీ కార్యాలయాల భద్రత పెంపు

Iran War Issue In Hyderabad
Iran War Issue In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 9:04 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran War Issue In Hyderabad : పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల కారణంగా తెలంగాణలో తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్​ కూటమికి ఇరాన్​కు మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో గల్ఫ్​ దేశాలను యుద్ధ భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం ఇక్కడి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనేక మంది భారతీయ విద్యార్థులు ఇరాన్​ రాజధాని టెహ్రాన్​, కోమ్​ నగరాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో హైదరాబాద్​ టోలిచౌకి, పాతబస్తీ, మెహిదీపట్నంతో పాటు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు షాహిద్​ బహెస్తీ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

క్షిపణుల వర్షంతో భయాందోళనలు : మరోవైపు ఇజ్రాయెల్​తో పాటు సౌదీ అరేబియా, దుబాయ్​, ఖతార్​, కువైట్​ తదితర గల్ఫ్​ దేశాల్లోని అమెరికా ఎయిర్​బేస్​లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ దేశాల్లో ఉమ్మడి నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. ఇరాన్​ వేసిన క్షిపణులు పడే సమయంలో తాము బంకర్లలోకి వెళ్తున్నామని ఇజ్రాయెల్​ దేశంలో ఉన్న పలువురు తెలుగువారు సోషల్​ మీడియా వేదికగా వీడియోలను షేర్​ చేశారు. దుబాయ్​లో క్షిపణుల దాడిపై సినీ నటుడు మంచు విష్ణు సైతం తన ఎక్స్​ ఖాతాలో తెలిపారు.

స్వస్థలాలకు రప్పించేందుకు కృషి : ఇరాన్​, గల్ఫ్​ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఆయా దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలు భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన హెచ్చరికలు, సూచనలను పాటించాలని అన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే వారిని సురక్షితంగా తమ స్వస్థలాలకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందన్నారు.

"ఇరాన్​, గల్ఫ్​ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోంది. వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుని కావాల్సిన చర్యలు తీసుకోవాలి. భారత ఎంబసీ, కాన్సులేట్​తోనూ సంప్రదింపులు జరపాలి. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం." - రేవంత్​ రెడ్డి, సీఎం

శంషాబాద్​ విమానాశ్రయంలో తగ్గిన రద్దీ : పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా ఆదివారం కువైట్​, మస్కట్, బహ్రెయిన్, దమ్మామ్​, మదీనా, దుబాయ్, అబుధాబి, షార్జా, రియాద్​, జెడ్డా, దోహా తదితర నగరాల నుంచి హైదరాబాద్​కు రావాల్సిన 26 విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో పాటు ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన 27 అంతర్జాతీయ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ రకంగా విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్​ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ తగ్గిపోయింది.

ఖమేనీ హత్యకు నిరసనగా పాతబస్తీలో ర్యాలీ : ఇదిలా ఉండగా, ఖమేనీ హత్యను నిరసిస్తూ హైదరాబాద్​ పాతబస్తీలోని షియా ముస్లిం సంఘాలు ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టాయి. పురానీ హవేలీ నుంచి దారుల్​షిఫా గ్రౌండ్​ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్యే జుల్పీకర్​ అలీ, ఎమ్మెల్సీ రియాజుల్లా అసన్​ అఫంజీ పాల్గొన్నారు. ఇంకోవైపు నగర పోలీసులు సామాజిక మాధ్యమాల్లో నిఘా పెంచారు. అసత్య ప్రచారం చేసే ఖాతాలను గుర్తించి కేసులు నమోదు చేశారు.

విదేశీ కార్యాలయాల వద్ద భద్రత పెంపు : నగరంలోని విదేశీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. బంజారాహిల్స్​ రోడ్​ నంబరు -7లోని ఇరాన్​ కాన్సులేట్​ జనరల్​ కార్యాలయం, రోడ్​ నంబరు-2లోని బ్రిటిష్​ కార్యాలయం, రోడ్​ నంబరు -12లోని యూఏఈ కార్యాలయాల వద్ద భద్రతపై ఉన్నతాధికారులు సమీక్షించారు. నానక్​రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​లోని అమెరికా కాన్సులేట్​ వద్ద బందోబస్తును మరింతగా పెంచారు.

నెతన్యాహు, UAE అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

గల్ఫ్​ దేశాలపై ఇరాన్ బాంబుల దాడి - తెలంగాణలోని వారి బంధువుల్లో అలజడి