స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి ఖాతాలోకి భారీ మొత్తాల్లో నగదు మళ్లింపులు -సిట్ నిర్ధారణ
జోగి రాము ద్వారా రూ.45.06 లక్షల అందజేత- రమేష్‌కు చెందిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో రూ.72.90 లక్షల జమ -నకిలీ మద్యం కేసులో సిట్ అభియోగపత్రం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 10:58 AM IST
SIT Revealed Jogi Ramesh Deposited Money to Swarna Developers Account : వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు నుంచి విడతల వారీగా రూ.1.18 కోట్లు ముట్టిందని సిట్ తేల్చింది. అందులో రూ.45.06 లక్షలను జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా అందజేయగా, మరో రూ.72.90 లక్షలను స్వర్ణ డెవలపర్స్ (జోగి రమేష్ సొంత సంస్థ) బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తాల్లో మళ్లింపులు జరిగినట్లు నిర్ధారించింది.
జగన్ హయాంలో జోగి రమేష్ నేతృత్వంలో, ఆయన అండదండలతో అద్దేపల్లి జనార్దనరావు ఇబ్రహీంపట్నం పాత ఏఎన్‌ఆర్ బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడిపించారని, హైదరాబాద్ నుంచి ఏపీలోకి సుంకం చెల్లించని మద్యం తీసుకొచ్చి ఇక్కడ బార్‌లలో విక్రయించేవారని గుర్తించింది. అందుకు ప్రతిఫలంగానే ఎప్పటికప్పుడు జోగి రమేష్‌కు సొమ్ములు ముట్టజెప్పేవారని వెల్లడించింది. ఆయా బ్యాంకు లావాదేవీల వివరాలు, మనీ ట్రయల్, కాల్ డేటా రికార్డులు, టవర్ లొకేషన్లు, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో సిట్ ఈ గుట్టు రట్టు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు బుధవారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. జోగి రమేష్ (ఏ18), ఆయన సోదరుడు జోగి రాము (ఏ19) సహా మొత్తం 13 మందిపై అభియోగాలు మోపారు.
ప్రధానాంశాలు ఇవే : రూ.18.68 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు వెలగపూడి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జోగి రమేష్ బ్యాంక్ ఖాతాలో 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబరు వరకూ మొత్తం 33 లావాదేవీల ద్వారా రూ.18.68 కోట్లు జమయ్యాయి. ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలే. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకి చెక్‌లు, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా 2021 నవంబరు నుంచి 2025 నవంబరు మధ్య రూ.5.61 కోట్లు జమయ్యాయి. ఇవీ అసాధారణంగానే ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంకులోని రమేష్‌కు సంబంధించిన మరో ఖాతాలో రూ.3.81 కోట్లు జమయ్యాయి.
రమేష్ ఆదేశించారు- రాము తీసుకున్నారు : జనార్దనరావు సోదరుడు జగన్‌మోహన్‌రావు 2020 అక్టోబరు 25 నుంచి 2025 సెప్టెంబరు వరకూ రూ.45.06 లక్షలు జోగి రమేష్ సోదరుడు రాముకు అందజేశారు. జోగి రమేష్ సొంత సంస్థ స్వర్ణ డెవలపర్స్ పేరిట విజయవాడ పటమట ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. 2021 మే 19 నుంచి 2024 మే 28 మధ్య 12 దఫాలుగా రూ.1.02 కోట్లు జమయ్యాయి. ఒక్కో విడతలో రూ.20 లక్షలు, రూ.15 లక్షలు, రూ.10 లక్షల చొప్పున నగదు రూపంలోనే జమయ్యేవి. ఇవన్నీ అసాధారణ డిపాజిట్లేనని వివరించారు.
అలా విత్‌డ్రా చేశారు ఇలా జమ చేశారు : స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో డబ్బులు జమైన ప్రతి సందర్భంలోనూ అంతకు కొద్ది రోజుల ముందే ఏఎన్‌ఆర్ బార్ బ్యాంక్ ఖాతా నుంచి, అద్దేపల్లి జగన్‌మోహనరావు వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా అయ్యాయి. 2022 జూన్ 20, 28, సెప్టెంబరు 1, 2024 మార్చి 5వ తేదీల్లో ఏఎన్‌ఆర్ బార్ బ్యాంక్ ఖాతా నుంచి అద్దేపల్లి జనార్దనరావు రూ.42.20 లక్షలు విత్‌డ్రా చేశారు. 2022 సెప్టెంబరు 5, 13, 15, 21, 2024 మే 28 తేదీల్లో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో రూ.46 లక్షలు జమయ్యాయి. 2022 ఫిబ్రవరి 9, జూన్ 20, జులై 21, 2023 మార్చి 14, 21 తేదీల్లో అద్దేపల్లి జగన్‌మోహన్‌రావు రూ.24 లక్షలు విత్‌డ్రా చేశారు. ్య 2022 మార్చి 9, సెప్టెంబరు 21, 23 తేదీల్లో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో రూ.26.90 లక్షలు జమయ్యాయి.
మొత్తం 13 మందిపై అభియోగపత్రం : నకిలీ మద్యం కేసులో మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 23 మంది అరెస్టయ్యారు. తాజాగా వేసిన మూడో అభియోగపత్రంతో కలిపితే మొత్తం 24 మందిపై అభియోగాలు మోపారు. ఈ ముఠాకు సీసాలు, మూతలు సరఫరా చేసిన మనోజ్‌ను అరెస్టు చేయకపోయినా అతని పాత్రపై అభియోగపత్రం వేశారు.
స్వర్ణ డెవలపర్స్ టూ జోగి రమేష్ వ్యక్తిగత ఖాతా : స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి పోరంకిలోని కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్‌లో జోగి రమేష్ పేరిట ఉన్న ఖాతాలోకి 2024 మే 1 నుంచి మే 9 మధ్య రూ.25 లక్షలు జమయ్యాయి. ఇదే ఖాతాలోకి మరో రూ.15 లక్షలు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఖాతా నుంచి జమయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ డబ్బంతా వెళ్లింది. జోగి రమేష్ బాబాయ్ పేరిట పటమట బ్రాంచ్‌లో ఉన్న మరో బ్యాంక్ ఖాతాలోకి స్వర్ణ డెవలపర్స్ ఖాతానుంచి రూ.52.60 లక్షలు జమయ్యాయి.
జోగి రమేష్, జోగి రాము జనార్దనరావు, అద్దేపల్లి జగన్‌మోహన్‌రావుతో వాట్సప్ కాల్, ఇతర రహస్య మార్గాల ద్వారా మాట్లాడుకునేవారు. జనార్దనరావు (ఏ1) 2023 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 1 మధ్య జోగి రాముతో 18సార్లు కాంటాక్ట్‌లో ఉన్నట్లు కాల్ డేటా, టవర్ లొకేషన్ డేటా విశ్లేషణలో వెల్లడైంది.
నకిలీ మద్యం కేసు - జోగి రమేష్ సోదరుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
నకిలీ మద్యం కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే - అభియోగపత్రంలో సిట్

