ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే - అంతకుమించి నాకేం గుర్తులేదు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
సిట్ విచారణలో చెవిరెడ్డి - కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రశ్నించిన అధికారులు - విజయవాడ జైల్లో 4 గంటల పాటు విచారణ - ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందా అనే కోణంలో ఆరా

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 23, 2025 at 8:23 AM IST
|Updated : December 23, 2025 at 12:53 PM IST
SIT Questions to Chevireddy in Tirumala Ghee Case : తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్ నిబంధనల్లో కీలక షరతులను తొలగిస్తూ, మరికొన్నింటిని మార్చేస్తూ సాంకేతిక కమిటీ సిఫార్సులు చేస్తే వాటిని మీరెలా ఆమోదించారంటూ వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ ప్రశ్నించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డిని కోర్టు అనుమతితో సోమవారం సుదీర్ఘంగా 4 గంటల పాటు విచారించింది. చెవిరెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు కొనుగోళ్ల కమిటీ సిఫార్సులను ఆమోదించారు? ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం.
అయితే సిట్ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ చెవిరెడ్డి సరైన జవాబివ్వలేదని తెలిసింది. ‘అధికారులు చెప్పారు. నేను ఆమోదించా. ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే. అంతకుమించి అప్పుడేం జరిగిందో గుర్తులేదు. ఇప్పటికే ఐదారేళ్లు దాటిపోయింది. వాటిపై ఇప్పుడు అడిగితే ఎలా?’ అంటూ తిరిగి సిట్ అధికారులనే ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థాన కొనుగోళ్ల కమిటీలో ఉన్న మరికొందరిని సిట్ విచారించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివి.
చెవిరెడ్డికి సిట్ ప్రశ్నావళి
- తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు (జాతీయ డెయిరీలు) మూడేళ్లుగా డెయిరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి తగ్గించడాన్ని మీరెలా ఆమోదించారు?
- సంబంధిత డెయిరీ అంతకుముందు ఏడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించి ఉండాలని, దీనికి ఆధారంగా ప్రొక్యూర్‌మెంట్ రికార్డులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సమర్పించిన రిటర్న్‌లు జత చేయాలనే నిబంధన ఉండేది. దాంతోపాటు ఆయా సంస్థలు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తేస్తూ చేసిన సిఫార్సులను మీరు ఎందుకు గుర్తించలేదు?
- అసలు పాలు సేకరించకుండా, వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన మీకు రాలేదా?
- ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాదన్నా రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధన తీసేసి, రూ.150 కోట్లు ఉంటే చాలని, మూడేళ్ల పాటు రోజుకు 12 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలన్న నిబంధననూ తొలగించి ఏడాదిపాటు రోజుకు 8 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలని చేసిన సిఫార్సులను మీరెలా ఆమోదించారు?
- అప్పటివరకూ ఏ ఇబ్బందీ లేకుండా సాగుతున్న నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? నిబంధనలన్నీ సడలించడం వల్లే భోలేబాబా, వైష్ణవి డెయిరీ వంటి సంస్థలకు అవకాశం కలిగింది కదా?
తిరుమల కల్తీ నెయ్యి కేసు - నిందితులుగా మరో 12 మంది
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా తదితర డెయిరీల నుంచి చిన్న అప్పన్న కేజీకి రూ.25 చొప్పున కమీషన్ డిమాండ్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ పీఎస్‌పీ సురేశ్‌కుమార్ గతంలోనే హైకోర్టులో వాదనలు వినిపించారు. చిన్న అప్పన్నకు కమీషన్ ఇచ్చినట్లు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ యజమానులు వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. ఎవరి ప్రోద్భలంతో కమీషన్ వసూలు చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.
చిన్న అప్పన్న కల్తీ నెయ్యి కేజీకి రూ.25 చొప్పున కమీషన్ డిమాండ్ చేశారు: సిట్

