'మీ జీతం లక్షల్లోనే కదా? - ఖాతాలోకి కోట్లు ఎలా వచ్చాయి?'
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నకు సిట్ ప్రశ్నలు - చిన్న అప్పన్నపై సిట్ ప్రశ్నల వర్షం నాలుగు గంటల పాటు సాగిన విచారణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 18, 2025 at 12:51 PM IST
SIT Officials Questioning Chinna Appanna : ఐదేళ్ల మొత్తంలో జీతం లక్షల్లో ఉంటే మీ ఖాతాల్లోకి కోట్లు ఎలా జమయ్యాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నఅప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో చిన్న అప్పన్నను కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విజయగరానికి చెందిన మీకు వైవీతో సంబంధం ఎలా ఏర్పడింది? తిరుమల వ్యవహారాలతో మీకేం పని? అంటూ ప్రశ్నలు సంధించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నఅప్పన్నను కస్టడీకి తీసుకుని విచారించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న చిన్న అప్పన్నని తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత 4 గంటలపాటు ప్రశ్నించారు. ‘దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక లైజన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఐదేళ్లలో మీ జీతం, ఇతర భత్యాలు కలుపుకుంటే రూ. 65 లక్షలకు మించదు అలాంటప్పుడు మీ బ్యాంకు ఖాతాల్లో రూ. 4.69 కోట్లు ఎలా జమయ్యాయని ప్రశ్నించారు. వీటిపై ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు తెలిసింది. విజయనగరం జిల్లాకు చెందిన మీకు వైవీ సుబ్బారెడ్డితో పరిచయం ఎలా ఏర్పడిందని అడిగారు.
ఓ అధికారి ద్వారా వైవీ సుబ్బారెడ్డి పరిచయం: 2014-19 వరకు వైవీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి తర్వాత ఏపీ భవన్‌లో ప్రత్యేక లైజన్ అధికారిగా నియమితులు కావడానికి ఎవరు సహకరించారు? దిల్లీలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారు?’ అని అధికారులు ప్రశ్నించగా ఓ అధికారి ద్వారా వైవీ సుబ్బారెడ్డి పరిచయం అయ్యారని, నిబద్ధతతో పని చేయడంతో ఆ స్థాయికి ఎదిగానని, ఏపీ భవన్‌కు వచ్చే ముఖ్యుల పర్యటనలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అక్కడ నిర్వర్తించానని చిన్న అప్పన్న చెప్పినట్లు తెలిసింది.
‘తిరుమల వ్యవహారాలతో మీకేం పని? నెయ్యి సరఫరాదారులు, డెయిరీల ప్రతినిధుల వివరాలను 2022లో ప్రొక్యూర్‌మెంట్ జీఎం నుంచి ఎందుకు సేకరించారు? తర్వాత నెయ్యి నమూనాలను మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కు ఎందుకు పంపాల్సి వచ్చింది? ఇందులో అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రమేయం ఉందా?’ అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా సుబ్బారెడ్డితో ఉన్న అనుబంధంతోనే తిరుమలకు వచ్చి వెళ్లేవాడినని మాత్రమే చిన్న అప్పన్న చెప్పినట్లు సమాచారం. మిగిలిన ప్రశ్నలకు మౌనం వహించారని, పదేపదే అడిగినా స్పందించలేదని తెలిసింది.
మీ ప్రమేయం ఎంత?: నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలసి ఉన్నాయని 2022 ఆగస్టులో నివేదిక వచ్చాక కూడా భోలేబాబా, శ్రీవైష్ణవి డెయిరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి సరఫరా కొనసాగించడంలో మీ ప్రమేయం ఏమాత్రమని ప్రశ్నించగా, తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఒక్క సరఫరాదారుడిపైనా వైవీ సుబ్బారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగ్గా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం.
భోలేబాబా డెయిరీ ఏజెంట్ పీపీ శ్రీనివాస్‌ను కిలోకు రూ.25 చొప్పున కమీషన్ ఎందుకు అడిగారు? అప్పటికే ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని మీకేమైనా తెలుసా? కమీషన్ ఇవ్వకపోవడంతోనే ప్రీమియర్ అగ్రిఫుడ్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్టు దక్కేలా చేశారా? ప్రీమియర్ అగ్రిఫుడ్స్ నుంచి హవాలా ఏజెంట్ ద్వారా రెండు దఫాలుగా రూ.50 లక్షలు తీసుకున్నది వాస్తవమేనా? లంచాలు తీసుకోవడం ఇదే మొదటిసారా? లేక అంతకుముందూ తీసుకున్నారా? అంటూ అధికారులు ప్రశ్నించగా చిన్న అప్పన్న స్పందించలేదని తెలిసింది.
అయినవారికి నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కేలా 2020లో టెండరు నిబంధనలు మార్చడంలో మీ ప్రమేయం నిజమేనా? ఆ సమయంలో సహకరించిన టీటీడీ అధికారులు ఎవరు? అని అడగ్గా తాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పినట్లు సమాచారం. విచారణ అనంతరం చిన్న అప్పన్నను తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మళ్లీ ఇవాళ విచారించనున్నారు. ఈ నెల 21 వరకు విచారణ కొనసాగనుంది.
అప్పట్లోనే నెయ్యి కల్తీని గుర్తించిన టీటీడీ పోటు కార్మికులు - ఆర్గానిక్ అంటూ బుకాయించిన ధర్మారెడ్డి

