ETV Bharat / state

నకిలీ మద్యం కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే - అభియోగపత్రంలో సిట్‌

ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసులో సిట్‌ ప్రాథమిక అభియోగపత్రం - 8 మంది నిందితులపై అభియోగాలు

SIT_on_Fake_Liquor_Case
SIT_on_Fake_Liquor_Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 7, 2025 at 7:48 AM IST

3 Min Read
Choose ETV Bharat

SIT Preliminary Charge Sheet in Fake Liquor Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేషేనని (ఏ-18) సిట్‌ తేల్చింది. ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్‌రావుకు (ఏ-1) రూ.3 కోట్లు ఇస్తానని ఆశపెట్టి పావుగా వాడుకుని నేరపూరిత కుట్ర నడిపించినట్లు గుర్తించింది. ఈ నకిలీ మకిలిని కూటమి ప్రభుత్వానికి పూయాలనే దురుద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్లు తెలిపింది.

నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్‌ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం, అంతకుముందే జనార్దన్‌రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివి అన్నీ జోగి రమేషే చేశారని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా దాఖలు చేసిన 55 పేజీల ప్రాథమిక అభియోగపత్రంలో సిట్‌ ఈ వివరాలన్నీ పేర్కొంది. 8 మంది నిందితులపై అభియోగాలు మోపింది. నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.9 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.

గతంలోనూ జోగి అండదండలతోనే: జోగి రమేష్, జనార్దన్‌రావు కుటుంబాలు చిన్నతనం నుంచే ఇబ్రహీంపట్నంలో ఉండేవి. వీరిమధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జోగి రమేష్, ఆయన సోదరుడు (ఏ-19) 2006-19 మధ్య స్వర్ణబార్‌లో భాగస్వాములు. 2019లో దాని పేరు చెర్రీస్‌ బార్‌గా మార్చారు. వీరిద్దరి సహకారంతోనే జనార్దన్‌రావు 2013లో బాలాజీ బార్‌ను కొన్నారు. తర్వాత దాని పేరును ఏఎన్‌ఆర్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌గా మార్చారు. 2017లో ఇబ్రహీంపట్నం బార్‌ యజమానులంతా సిండికేట్‌గా ఏర్పడ్డారు. అందులో జోగి రమేష్, రాములు కీలకం. 2019 ఎన్నికలు జరిగేవరకూ ఈ సిండికేట్‌ కొనసాగింది.

వైఎస్సార్సీపీ హయాంలో అద్దేపల్లి జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావులు జోగి రమేష్‌ అండదండలతోనే పక్క రాష్ట్రమైన తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొని ఏపీకి తీసుకొచ్చి వేరే బాటిళ్లలో నింపి ఎక్కువ ధరకు విక్రయించేవారు. జనార్దన్‌రావుకు అడ్డొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జోగి రమేష్, రాములు తెలంగాణ మద్యం సిండికేట్‌లో భాగస్వాములైన షేక్‌ షరీఫ్, మహంకాళి పూర్ణచంద్రరావు, తుంగల సుధాకర్‌ తదితరుల్ని బెదిరించారు. జోగి రమేష్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండదండలతోనే అద్దేపల్లి జనార్దన్‌రావు ఇబ్రహీంపట్నంలోని పాత ఏఎన్‌ఆర్‌ బార్‌లో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.

అద్దేపల్లి జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావులు జోగి రమేష్, జోగి రాములకు 2 నెలలకోసారి రూ.3-5 లక్షల చొప్పున డబ్బు ఇచ్చేవారు. రాజకీయ అండదండలు, అధికారుల దాడులు లేకుండా ఉండేందుకు ఈ మొత్తాలు అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిఘా పెరగడంతో నకిలీ మద్యం తయారీని జనార్దన్‌రావు ఆపేశారు.

ఆఫ్రికాకు పంపించింది జోగి రమేషే: తంబళ్లపల్లె నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన జయచంద్రారెడ్డి ఇంజినీరింగ్‌లో తన క్లాస్‌మేట్‌ కావటంతో అద్దేపల్లి జనార్దన్‌రావు అప్పట్లో ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయం జోగి రమేష్‌కు తెలుసు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై బురదచల్లాలనే కుట్రతో జనార్దన్‌రావును ముందుపెట్టి జోగి రమేష్‌ తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో తొలుత నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించి దానిలో స్టాక్‌ సిద్ధమయ్యాక దానిపై దాడి చేయించారు.

సెప్టెంబరు 15, 16 తేదీల్లో జోగి రమేష్, రాములు జనార్దన్‌రావును సంప్రదించి జయచంద్రారెడ్డి ఎక్కడున్నారని ఆరాతీశారు. ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పగా ఆ దేశానికి వెళ్లిపోవాలని చెప్పారు. సెప్టెంబరు 23న జనార్దన్‌రావు జోగి రమేష్‌ ఇంటికి వెళ్లారు. రూ.3 కోట్లు ఇస్తామని రమేష్‌ ప్రలోభపెట్టడంతో సెప్టెంబరు 24న జనార్దన్‌రావు ఆఫ్రికా వెళ్లారు. తర్వాత కొద్దిరోజులకు రమేష్‌ ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి సమాచారం బయటకు వ్యాప్తి చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. అయినా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ఇబ్రహీంపట్నంలో నకిలీ తయారీ కేంద్రం సమాచారమిచ్చి దాడులు చేయించారు.

8 మందిపై అభియోగాలు: నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటుచేసిన జనార్దన్‌రావు (A-1), జగన్మోహన్‌రావు (A-2)తో పాటు వాటికి అవసరమైన ముడి సరకులు సమకూర్చిన, ఈ నేరంలో భాగస్వాములైన నకిరికంటి రవి (A-4), బదల్‌దాస్‌ (A-7), ప్రదీప్‌ దాస్‌ (A-8), దొండేటి శ్రీనివాసరెడ్డి (A-11), అంగలూరు వెంకటకల్యాణ్‌ (A-12), తిరుమలశెట్టి శ్రీనివాసరావు (A-13)లపై సిట్‌ అభియోగాలు మోపింది. దర్యాప్తు కొనసాగుతోంది.

మద్యం కుంభకోణంలో మరో ట్విస్ట్ - పల్గొట సోదరులపై గతంలో డీఆర్‌ఐ కేసులు

మద్యం ముడుపుల సొమ్ముని నగదు, నగల రూపంలో ఇచ్చేశా: సిట్ విచారణలో అనిల్ చోక్రా