ETV Bharat / state

తిరుమల కల్తీ నెయ్యి కేసు - నిందితులుగా మరో 12 మంది

ఏడుగురు టీటీడీ ఉద్యోగులు, ఐదుగురు డెయిరీల తనిఖీ బృందం సభ్యులు - ఫిర్యాదుదారు మురళీకృష్ణ పేరూ నిందితుల జాబితాలో

Sit Reveals Another 12 Accused in TTD Ghee Case
Sit Reveals Another 12 Accused in TTD Ghee Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 29, 2025 at 3:14 PM IST

|

Updated : November 30, 2025 at 6:59 AM IST

4 Min Read
Choose ETV Bharat

SIT Reveals Another 11 Accused in TTD Adulterated Ghee Case: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్‌ మరో 12 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో ఏడుగురు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కాగా, మరో ఐదుగురు డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలోని సభ్యులు. కల్తీ నెయ్యి సరఫరాలో వీరందరి ప్రమేయం ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. వీరిలో కొంతమంది డెయిరీల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని వాటికి అనుకూలంగా నివేదికలిచ్చారని, నిర్ణయాలు తీసుకున్నారని సిట్‌ గుర్తించింది. ఆ వివరాలతో ఈ నెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో శనివారం వెలుగు చూసింది.

ఫిర్యాదుదారుడే నిందితుడా!: ఈ కేసులో ఫిర్యాదుదారైన టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం ప్రళయకావేరి మురళీకృష్ణను కూడా సిట్‌ నిందితుడిగా చేర్చింది. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడు, గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీతో అంటకాగిన ఎస్వీ గోశాల డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిని కూడా కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా పేర్కొంది. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడైన ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంది.

ముగ్గురు టీటీడీ మాజీ జీఎంలు, గోశాల పూర్వ డైరెక్టర్, ఓ డిప్యూటీ ఈవో, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్లకూ కల్తీ నెయ్యి సరఫరాలో పాత్ర ఉందని సిట్‌ పేర్కొంది. నిందితుల జాబితాలో ఉన్న టీటీడీ డిప్యూటీ ఈవో నటేశ్‌బాబు, జీఎం మురళీకృష్ణ ఇప్పటికే రిటైరయ్యారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ డెయిరీలకు వీరు సహకరించారని సిట్‌ పేర్కొంది.

ఎవరి పాత్ర ఏంటంటే?:

1. పల్లి ఈశ్వరరెడ్డి (ఏ25): గోదాముల విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ, ఏఆర్‌ డెయిరీల నుంచి రూ.23,600 లంచం తీసుకున్నారు. కల్తీ నెయ్యి ట్యాంకర్ల అన్‌లోడింగ్‌కు సహకరించారు. వాటి ఇన్వాయిస్‌లను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోలు విభాగం జీఎంకు పంపించారు. ఆయా డెయిరీలు సరఫరా చేస్తున్నది కల్తీ నెయ్యేనని సీఎఫ్‌టీఆర్‌ఐ ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపకుండా తొక్కిపెట్టారు.

2. ముద్దు వెంకట అనిల్‌కుమార్‌ (ఏ26): కొనుగోళ్ల విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీల తరఫు కమీషన్‌ ఏజెంట్‌ శ్రీనివాసన్‌ నుంచి రూ.59,600 లంచం తీసుకున్నారు. భోలేబాబా, వైష్ణవి డెయిరీలకు అనుకూలంగా ఉన్నతాధికారులకు దస్త్రాలు పంపారు. భోలేబాబా డెయిరీకి సాంకేతిక అర్హత లేదని ప్లాంట్‌ తనిఖీ చేసిన కమిటీ నివేదిక ఇచ్చాక కూడా ఆ సంస్థలకు 15 శాతం ఆర్డర్లు ఇప్పించారు.

3. పోలేపల్లి వెంకట నటేశ్‌బాబు (ఏ27): డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైరయ్యారు. కమీషన్‌ ఏజెంట్‌ శ్రీనివాసన్‌ నుంచి రూ.20,000 లంచం తీసుకున్నారు. వారికి త్వరగా బిల్లులు చెల్లింపులు జరిగేలా చూశారు. నాణ్యత పరీక్షల నివేదిక రాకముందే కల్తీ నెయ్యి ట్యాంకర్ల అన్‌లోడింగ్‌కు అనుమతించారు.

4. పేరూరు జగదీశ్వర్‌రెడ్డి (ఏ28): కొనుగోళ్ల విభాగంలో జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. మాల్‌గంగ, భోలేబాబా, వైష్ణవి డెయిరీలకు సహకరించారు. వారి నుంచి 50 గ్రాముల వెండి నాణేన్ని లంచంగా తీసుకున్నారు.

5. ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యం (ఏ29): కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ డెయిరీలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదని పరీక్షల్లో తేలినా ఆ నివేదిక దాచిపెట్టారు. ఆ సంస్థల ప్రతినిధుల నుంచి రూ.3.50 లక్షల నగదు, సెల్‌ఫోన్, వెండి కంచం, నాణెం లంచంగా తీసుకున్నారు.

6. ప్రళయకావేరి మురళీకృష్ణ (ఏ30): కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీల ప్రతినిధుల నుంచి రూ.5 వేల విలువైన వెండి నాణెం లంచంగా తీసుకున్నారు.

7. డాక్టర్‌ కె. హరినాథరెడ్డి (ఏ31): ఎస్వీ గోశాల డైరెక్టర్‌. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదు.

8. డా. మల్లం మహేందర్‌ (ఏ32): డెయిరీ నిపుణుడు. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదు.

9. డా.వి. వెంకట సుబ్రమణియన్‌ (ఏ33): డెయిరీ నిపుణుడు. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదు.

10. విజయభాస్కరరెడ్డి (ఏ34): డెయిరీ నిపుణుడు. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ఎండీ నుంచి రూ.2.50 లక్షలు లంచం తీసుకుని ఆ డెయిరీకి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. టెండరు నిబంధనల్లో నాణ్యత పరీక్షించడానికి అనుసరించే బీటాసిటోస్టెరాల్‌ పద్ధతి మినహాయించొచ్చని అభిప్రాయపడ్డారు.

11: డాక్టర్‌ బత్తుల సురేంద్రనాథ్‌ (ఏ35): డెయిరీ నిపుణుడు. డెయిరీ ప్లాంట్ల తనిఖీ బృందంలో సాంకేతిక సభ్యుడు. భోలేబాబా డెయిరీ ప్లాంట్‌ తనిఖీకి వెళ్లినప్పుడు వారి నుంచి రూ.50 వేల విలువైన ఫోన్లు లంచంగా తీసుకున్నారు. మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నుంచి వచ్చిన నెయ్యి నమూనాల పరీక్ష నివేదికలను పరిశీలించి, బీటాసిటోస్టెరాల్‌ మినహా మిగతా ప్రమాణాలన్నీ సరిగ్గానే ఉన్నాయంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది ఉన్నతాధికారులకు చెప్పకుండా డెయిరీలకు మేలు చేశారు. బీటాసిటోస్టెరాల్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రమాణాలు పాటించేలా టెండరు నిబంధనల్లో మార్పు చేయాలని టీటీడీకి సూచించారు. ఆల్ఫా డెయిరీ, ప్రీమియర్‌ సంస్థలు బీటాసిటోస్టెరాల్‌ పరీక్షలు మినహాయించాలని కోరగా వారికి అనుకూలంగా సిఫార్సు చేశారు. ఆయనతోపాటు విజయభాస్కరరెడ్డి కూడా ఇదే మాట చెప్పడంతో కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమమైంది.

12: డా. కె. జయరాజ్‌రావు: (ఏ36): డెయిరీ నిపుణుడు. భోలేబాబా డెయిరీ ప్లాంట్‌ తనిఖీకి వెళ్లినప్పుడు రూ.50 వేల విలువైన ఫోన్‌ లంచంగా తీసుకున్నారు.

పోలీసు కస్టడీకి తిరుమల కల్తీ నెయ్యి నిందితులు

తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

Last Updated : November 30, 2025 at 6:59 AM IST