సుబ్రహ్మణ్యం హత్యలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర - ఛార్జిషీట్‌లో పేర్కొన్న సిట్
భర్తతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని, హత్యకు ప్రేరేపించిన అనంతబాబు భార్య - నేరంలో అన్ని విధాలా అనంతబాబుకు సహకరించిన అనంత లక్ష్మీదుర్గ - సీసీటీవీ విశ్లేషణలో నిగ్గు తేలిన నిజం అభియోగపత్రంలో పేర్కొన్న సిట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 12:41 PM IST
SIT Mentioned YSRCP MLC Ananthababu wife has Role in Subramaniam Murder : దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా కూడా పాల్గొన్నారని సిట్ తేల్చింది. ఈ హత్యకు ప్రేరేపించటమే కాకుండా ఈ నేరంలో అనంతబాబుకు అన్నివిధాలా ఆమె సహకరించారని నిర్ధారించింది. హత్య తర్వాత ఆధారాల ధ్వంసం, మాయంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను విశ్లేషించి హత్య సమయంలో ఘటనా స్థలంలోనూ, ఆ తర్వాత కూడా మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలో ప్రధాన నిందితుడైన అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లు నిగ్గు తేల్చింది.
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజాను ఏ-2గా సిట్ చేర్చింది. హత్య, హత్యకు ప్రేరేపించటం, ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగాలు మోపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో బుధవారం అభియోగ పత్రం దాఖలు చేశారు.
వెలుగులోకి అనేక కొత్త అంశాలు: వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయకుండా, కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరించకుండా వదిలేయటమే కాకుండా ప్రధాన నిందితుడు అనంతబాబుకు కొమ్ముకాసేలా వ్యవహరించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గతేడాది జులైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ప్రాసిక్యూషన్‌కు సహకారం అందించేందుకు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించింది. అందులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటినీ అభియోగపత్రంలో పొందుపరిచింది.
అనంతబాబు, అతని భార్య లక్ష్మీదుర్గ వద్ద సుబ్రహ్మణ్యం 6 ఏళ్ల పాటు కారు డ్రైవర్‌గా పని చేశారు. ఆ సమయంలో తన పెళ్లి ఖర్చుల కోసం అనంతబాబు నుంచి రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. అందులో రూ.30 వేలు తిరిగి చెల్లించేశాడు. హత్యకు గురి కావటానికి 3 నెలల ముందు సుబ్రహ్మణ్యం అనంతబాబు దంపతుల దగ్గర ఉద్యోగం మానేశాడు. కక్ష పెంచుకున్న అనంతబాబు తనకు చెల్లించాల్సిన రూ.20 వేలు ఇవ్వాల్సిందేనంటూ సుబ్రమణ్యాన్ని, అతని కుటుంబ సభ్యుల్ని పదేపదే బెదిరించేవారు.
కొన్ని గంటల్లోనే మృతదేహాన్ని డోర్ డెలివరీ: 2022 మే 19న రాత్రి 7.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం, అతని స్నేహితుడు కలిసి వారు నివసించే రాంబగీచా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లారు. అదేరోజు రాత్రి 8.09 గంటల సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి అతని గురించి ఆరా తీశాడు. తనకు చెల్లించాల్సిన రూ.20 వేలు ఇవ్వకపోతే కాళ్లు చేతులు, నరికేస్తానని బెదిరించాడు. 2022 మే 19న అనంతబాబు జన్మదినం కావటంతో అతను నివాసమైన శ్రీరామ్‌నగర్‌లోని శంకర్ టవర్ అపార్ట్‌మెంట్‌లో తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఆ రోజు రాత్రి 10.15 నుంచి 10.30 గంటల సమయంలో శంకర్ టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండటంతో అనంతబాబు అక్కడికి వెళ్లి అతన్ని తన AP-39-B-0456 నంబరు ఐ-20 వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. తర్వాత కొన్ని గంటల్లోనే అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు.
అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కాకినాడలోని శంకర్ టవర్ అపార్ట్‌మెంట్‌లోని 401 నంబర్ ఫ్లాట్‌లో నివసించేవారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజు రాత్రి అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు రాత్రి 10.20 నుంచి 10.22 గంటల మధ్య సెల్లార్‌లోని వాచ్‌మన్ గదిలోకి వెళ్లిన లక్ష్మీదుర్గ వాచ్‌మన్ కుమార్తెను పెద్ద కర్ర కావాలని అడిగారు. తన దగ్గర లేవని ఆమె సమాధానమివ్వగా ఏదో ఒక కర్ర తీసుకురావాలని ఒత్తిడి చేశారు.
రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్లే కనిపించలేదు: హత్య గురించి తనకు తెలియదని, ఆ సమయంలో తాను అక్కడలేనని ఆసుపత్రిలో బంధువులను పరామర్శించటానికి వెళ్లానని అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆమె లేరని సీసీ ఫుటేజీల విశ్లేషణలో తేల్చిన సిట్ అధికారులు అదే సమయలో ఆమె హత్య జరిగిన ఘటనా స్థలంలో ఉన్నట్లు సీసీ ఫుటేజీల్లోనే గుర్తించారు.
మే19వ తేదీ అర్ధరాత్రి 12.53 గంటల సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి నాగమల్లితోట కూడలి వద్ద రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాలపాలయ్యాడని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పారు. ఆ సమయంలో అనంతబాబు సెల్‌టవర్ లొకేషన్ నాగమల్లితోట దగ్గర కాకుండా ఎన్.ఎఫ్.సీ.ఎల్ రోడ్డు ఏరియాలో, బృందావన్ కాలనీలో ఉంది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నాగమల్లితోట కూడలి వద్దకు వెళ్లి చూడగా అసలు అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్లే కనిపించలేదు.
అదేరోజు అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అనంతబాబు తన వాహనంలో తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబ నివసించే అపార్ట్‌మెంట్ వద్ద పడేశారు. రూ.2 లక్షలు ఇస్తానని ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయించాలని బెదిరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎదురుతిరగటంతో వెనక్కి వెళ్లిపోయారు.
సుబ్రహ్మణ్యం హత్యకు ముందు, ఆ తర్వాత కూడా అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గలు వారు నివసించే శంకర్ టవర్స్ అపార్ట్‌మెంట్, ఎదురుగా ఉండే ఈశ్వర ధరణి అపార్ట్‌మెంట్స్‌లో పలుమార్లు హడావుడిగా తిరుగుతూ కనిపించారు. హత్యకు ముందు, తర్వాత నాలుగైదుసార్లు దుస్తులు మార్చుకుని కనిపించారు. ఇవన్నీ సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారై: కాకినాడలోని అమృత ఆసుపత్రి, ఆంజనేయస్వామి గుడి, భానుగుడి సెంటర్, బ్లూరే ఆసుపత్రి, బగీచా అపార్ట్‌మెంట్, ఈశ్వర ధరణి అపార్ట్‌మెంట్ ఇలా 14 చోట్ల నుంచి సీసీ కెమెరాల దృశ్యాల్ని సిట్ అధికారులు సేకరించారు. AP-39-B-0456 నంబరు ఐ-20 వాహనం హత్య జరిగిన రోజు రాత్రంతా పలుచోట్లకు తిరుగుతూనే కనిపించింది. మృతదేహంతో పాటు అనంతబాబు, అతని భార్య కూడా ఉన్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకొచ్చి తిరుగుతున్నారు. ఆయన భార్య, రెండో నిందితురాలైన లక్ష్మీదుర్గను విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేయగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారైపోయారు.
2022 మేలో జరిగిన ఈ కేసును వైఎస్సార్సీపీ పెద్దల ఒత్తిళ్లతో మొక్కుబడిగా విచారణ చేసి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరుపై వైఎస్సార్సీపీ హాయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సీఎం, డీజీపీ వద్దకు వచ్చి తమ కుమారుడి కేసును పునర్విచారణ చేయాలని మొరపెట్టుకోవడంతో ప్రభుత్వం సిట్ వేసి దర్యాప్తు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో సక్రమంగా విచారణ జరగలేదని... తాజాగా సిట్ జరిపిన విచారణలో ఈ కేసు నిరూపణ అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయని బాధితుల తరుఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు చెప్పారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కానరాని పురోగతి- రెండేళ్లుగా బయట తిరుగుతున్న అనంతబాబు
డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసులో కొత్త ఆధారాలు - సీసీటీవీలో ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు!

