మద్యం కుంభకోణంలో మరో ట్విస్ట్ - పల్గొట సోదరులపై గతంలో డీఆర్‌ఐ కేసులు
వాటిలో పలుమార్లు విచారణకు హాజరైన రోణక్, చేతన్‌లు - వీరితోనే మద్యం లంచాల సొమ్ము మనీలాండరింగ్ రోణక్, చేతన్‌ను ఎవరు సంప్రదించారో తేల్చే పనిలో సిట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 5, 2025 at 2:00 PM IST
AP Liquor Scam Case Latest Updates: జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ వర్గీయులు కొల్లగొట్టిన లంచాల సొమ్ములో కొంత మొత్తాన్ని మనీలాండరింగ్ ద్వారా రూటింగ్ చేశారు. ముంబై నగల వ్యాపారులు, సోదరులైన రోణక్‌కుమార్ పల్గొట, చేతన్‌కుమార్ పల్గొటలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)లోనూ పలు కేసులున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో: 12 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో 2022 మార్చిలో ఒకసారి , 2023 జులైలో మరోసారి డీఆర్‌ఐ అధికారులు రోణక్‌ను విచారించినట్లు సిట్ గుర్తించింది. నవంబరు 29 నుంచి ఈనెల 2 వరకూ వరుసగా 4 రోజుల పాటు సిట్ అధికారులు రోణక్‌కుమార్‌ను విచారించినా ఆయన నోరు విప్పలేదు. దీంతో రోణక్ ఫోన్‌ను అతనితోనే సిట్ అధికారులు ఓపెన్ చేయించారు. అందులోని వివరాలు పరిశీలించగా డీఆర్‌ఐ కేసుల వ్యవహారం బయట పడింది.
రోణక్ సోదరుడు చేతన్ విదేశాల నుంచి అక్రమంగా తీసుకువచ్చిన బంగారం బిస్కట్లతో కోల్‌కతాలో డీఆర్‌ఐకి పట్టుబడినట్లు సిట్ గుర్తించింది. బంగారం, నగల వ్యాపారం ముసుగులో వీరు రూ.వందల కోట్లలో మనీలాండరింగ్, హవాలా చేస్తున్నారని సిట్ గుర్తించింది. సిట్ వీరికి వైఎస్సార్సీపీ వర్గీయులతో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి? వీరిని ఎవరు, ఎలా సంప్రదించారు? అనే కోణంలో ఆరా తీస్తోంది. లీలా, అదాన్, ఎస్‌పీవై డిస్టిలరీల ఖాతాల నుంచి డొల్ల కంపెనీల్లోకి వెళ్లిన రూ.78 కోట్లు కాకుండా వైఎస్సార్సీపీ వర్గీయుల తరఫున మరింత సొత్తును వీరు మనీలాండరింగ్ చేశారా? అనే దానిపై వివరాలు సేకరిస్తోంది.
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు: చేతన్, రోణక్ సోదరులు ముంబై కేంద్రంగా చాముండ బులియన్ మహాలక్ష్మీ జ్యూయలరీ, రుచిత జ్యుయలరీ తదితర పేర్లతో నగల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ ముసుగులో పలువురిని అడ్డం పెట్టుకుని నకిలీ ఇన్వాయిస్‌లు, నకిలీ వే బిల్లులు సృష్టించి వైట్‌ను బ్లాక్‌మనీగా మళ్లీ బ్లాక్‌ను వైట్‌మనీగా మారుస్తుంటారు. ఈ అన్నదమ్ములిద్దరి పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి.
చేతన్, రోణక్ తండ్రి జస్‌రాజ్ పల్గొట అలియాస్ పూనంభాయ్‌కు దుబాయ్‌లోని పలువురితో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పల్గొట సోదరులను మొదట ఎవరు సంప్రదించారో తేల్చే పనిలో పడింది. వీరు మనీ రూటింగ్‌కు అనిల్ చోఖ్రాతో పాటు ఇంకా ఎవరెవరిని వినియోగించారు అనే దానిపై ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు మనీ లాండరింగ్ కోసం అప్పట్లో వీరిని సంప్రదించారు. అందుకు ప్రతిగా 4 శాతం కమీషన్ చెల్లించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పల్గొట సోదరులు ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా (ఏ-49) ద్వారా పలు డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి పేరిట బ్యాంకు ఖాతాల తెరవటం, నకిలీ ఇన్వాయిస్‌లు, బిల్లులు సృష్టించడం వంటివి చేశారని సిట్ నిర్ధారించింది.
'లిక్కర్ స్కాం' లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేసింది పల్గొట సోదరులే!
ఏపీ లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు నిందితులు - ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు

