ETV Bharat / state

తిరుమల కల్తీ నెయ్యి కేసు - వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందన్న సిట్

ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్న సిట్ - సుబ్బారెడ్డి దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేయాలని కోరిన సిట్ ఐవో

SIT Files Counter Affidavit on YV Subba Reddy
SIT Files Counter Affidavit on YV Subba Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 9, 2025 at 7:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

SIT Files Counter Affidavit on YV Subba Reddy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని హైకోర్టుకు సిట్ నివేదించింది. కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొంది. నేరఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఆ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సుబ్బారెడ్డి, ఆయన భార్య వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ ఐవో ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు : తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరాలో అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ పేర్కొంది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో నివేదించింది. సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించేందుకు అనుమతి కోరుతున్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. వైవీ సుబ్బారెడ్డి 2019-2023 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు.

తిరుమల కల్తీ నెయ్యి కేసు - వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందన్న సిట్ (ETV)

ఛైర్మన్ హోదాలో ఆయన అనామక ఫిర్యాదును 2022 మే 16న టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యానికి అప్పగించి భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్ లిమిటెడ్‌పై విచారణ జరిపించాలని కోరారు. తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డిని 2022 మే 20న సుబ్రహ్మణ్యం కలిసినప్పుడు నెయ్యి నమూనాలను పరీక్ష కోసం మైసూరులోని CFTRI ల్యాబ్‌కు పంపించాలని పురమాయించారు. దీంతో ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, వైష్ణవి డెయిరీ స్పెషాల్టీస్‌ లిమిటెడ్‌, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను 2022 జూన్‌లో ల్యాబ్‌కు పంపారు.

విజిటబుల్‌ ఆయిల్ కల్తీ : నెయ్యి నమూనా పరీక్ష ఫలితాలు 2022 ఆగస్టులో వచ్చాయి. బీటా సిటోస్టెరాల్‌ పరీక్ష ప్రకారం అన్ని నెయ్యి నమూనాల్లో విజిటబుల్‌ ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆ నెయ్యి సరఫరా చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2024 వరకు ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్, వైష్ణవి డెయిరీ స్పెషాల్టీస్‌ సంస్థలను టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారు. భోలేబాబా డెయిరీ నుంచి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతించారు.

కిలో నెయ్యి సరఫరాకు రూ.25 : కల్తీ నెయ్యి కేసులో A-3గా ఉన్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్‌ పొమిల్‌ జైన్, కైలాష్‌ చంద్, శ్రీనివాసన్‌ 2022 మే 25న హైదరాబాద్‌లోని వైవీ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారని హైకోర్టులో వేసిన కౌంటర్‌లో సిట్ పేర్కొంది. సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న కిలో నెయ్యి సరఫరాకు 25 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పొమిల్ జైన్‌ ఆయనకు ఫిర్యాదు చేశారని తెలిపింది. ఏడాది పాటు తన ప్లాంటులో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా సుబ్బారెడ్డిని పొమిల్ జైన్‌ విజ్ఞప్తి చేశారని వెల్లడించింది.

టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ అగ్రీఫుడ్స్‌ తరఫు హవాలా ఏజెంట్‌ అమన్ గుప్త నుంచి వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న వివిధ సందర్భాల్లో దిల్లీలోని పాటిల్‌ నగర్‌, మెట్రో స్టేషన్‌ వద్ద సుమారు రూ.20 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అదే సంస్థ మేనేజర్‌ విజయ్‌గుప్త నుంచీ చిన్నఅప్పన్న రూ.30 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని సిట్‌ ఐవో హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తులో అన్ని విషయాలను పరిశీలించాల్సి ఉందని ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తులు-సంస్థల నుంచి సిట్ సమాచారాన్ని సేకరిస్తోందని వివరించారు.

ఈ నెల 14న హైకోర్టు విచారణ : కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌, శ్రీనగర్‌ కాలనీలోని యాక్సిక్ బ్యాంకు మేనేజర్‌కు సిట్‌ అదనపు ఎస్పీ నోటీసు ఇస్తూ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, స్టేట్‌మెంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకును సమాచారం కోరడాన్ని సవాల్‌ చేస్తూ టీటీడీ మాజీ ఛైర్మన్‌, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్‌ ఐవో ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 14న హైకోర్టు విచారణ జరపనుంది.

తిరుమల లడ్డూ కల్తీ కేసు - హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

ఖాళీ లారీలు తిప్పి - సిట్‌కి 'దృశ్యం' సినిమా చూపించిన నిందితులు