సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణ - ఇద్దరి పాత్రపై సిట్ ఆరా?
సాయికృష్ణ ఉదంతంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ - కృష్ణలంక స్టేషన్‌లోని సిబ్బందిని ప్రశ్నిస్తున్న బృందం - సాయికృష్ణ వ్యవహారంలో సీఐకు సహకరించిన వారిపై దృష్టి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 8:02 AM IST
Sai Krishna Case Updates : విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో సీఐ నాగరాజుకు సహకరించిన వారిపై సిట్ దృష్టి సారించింది. మృతదేహాన్ని ఏం చేశారు? ఎక్కడ పడేశారు? అన్న వాటిపైనా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీలోనే మరణించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి వివరాల కోసం విచారణను వేగవంతం చేసింది.
సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. టాస్క్‌ఫోర్స్ బృందం సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్‌లో అప్పగించినట్లు తేలింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు స్టేషన్‌లో ఉన్నా ఆ తర్వాత ఏమయ్యాడో మిస్టరీగా మారింది. స్టేషన్‌లో మొత్తం 60 మంది సిబ్బంది ఉన్నారు. వీరిని అందరినీ సిట్ ప్రశ్నించి, స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తోంది.
మరో రెండు, మూడు రోజులు విచారణ: సాయికృష్ణ వ్యవహారంలో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందో స్టేషన్‌లోని ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. మృతి చెందిన విషయం ఎప్పుడు తెలిసిందో సిబ్బంది స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజులు ఈ విచారణ కొనసాగనుంది. కొందరు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని కూడా పిలిచి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. వీరిలో కొందరి నుంచి ఆధారాలు దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు కొందరు సిబ్బంది పాత్రపై వివరాలు అందజేశారు. వీటిని కూడా పరిశీలిస్తున్నారు.
ఇద్దరి పాత్రపై సిట్ ఆరా? : సాయికృష్ణ ఉదంతంలో సీఐ నాగరాజుతో పాటు పోలీస్ స్టేషన్‌లో ఆయనకు అనుచరులుగా ఉండే ఇద్దరి సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహం మాయంలో వీరి పాత్ర గురించి సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇద్దరిలో ఒకరు ఏడేళ్లుగా ఇదే స్టేషన్‌లో పనిచేస్తున్నారు. మరొకరు ఏడాది క్రితం వచ్చారు. స్టేషన్‌లో వీళ్లిద్దరే చక్రం తిప్పేవారు.
స్టేషన్ బయట కూడా కీలకమైన వ్యవహారాలకు సీఐ వీరికే పురమాయించేవారు. మహిళా ఏసీపీ బృందం విచారణ సమయంలో వీరు సాధారణంగానే విధులకు వచ్చినా సిట్ ఏర్పాటు తర్వాత డ్యూటీలకు రావడం లేదు. ఈ ఇద్దరిని కూడా విచారణకు పిలవనున్నారు. వీరి ప్రమేయంపై ఆధారాలు లభించిన తర్వాత నిందితులుగా చేర్చనున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
సాయికృష్ణ మరణంపై జ్యుడీషియల్ విచారణ: సాయికృష్ణ కేసులో నిందితుడు నాగరాజు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అరెస్టు చేశాక విచారణకు సమయం లేకపోయిందని, దీనివల్ల పూర్తి వివరాలు రాలేదని పిటిషన్‌లో పేర్కొంది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని నాగరాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
సీసీటీవీ ఫుటేజీ పిటిషన్‌పై: కృష్ణలంక స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయంపై బాధ్యులు రికార్డులు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని విజయలక్ష్మి మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది సతీష్‌బాబు వాదనలు వినిపించారు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనలేదన్నారు. ప్రతి స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరుపై పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లాస్థాయి కమిటీకి ఉందని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం సీసీటీవీ ఫుటేజీ కోసం జిల్లా స్థాయి కమిటీకి నోటీసులిచ్చింది. నిందితుడిగా ఉన్న నాగరాజుకూ నోటీసులు ఇచ్చింది. విచారణను ఈనెల 29కి కోర్టు వాయిదా వేసింది.
సాయికృష్ణది లాకప్‌డెత్: సిట్ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు
సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం - దర్యాప్తునకు 'సిట్' ఏర్పాటు

