ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం - A2 వాసుదేవరెడ్డి అరెస్ట్, ఈ నెల 27 వరకు రిమాండ్
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు - గుంటూరు జైలుకు తరలింపు - వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 7:36 PM IST
|Updated : February 21, 2026 at 9:43 PM IST
SIT Arrests A2 Vasudeva Reddy in AP Liquor Scam Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 మధ్య కాలంలో జరిగిన సుమారు రూ. 3,570.87 కోట్ల లిక్కర్ స్కామ్‌లో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిని (A-2) దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. వాసుదేవరెడ్డికి గతంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిన వేళ సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. అనంతరం వాసుదేవరెడ్డిని పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు.
మద్యం కేసులో వాసుదేవరెడ్డితోపాటు ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేకాధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ది కీలక పాత్రని, వారి కేంద్రంగానే కుంభకోణం జరిగిందని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో స్పష్టం చేసింది. మొత్తం కుంభకోణం శరీరం అయితే వారిద్దరూ తలలాంటి వారిని తెలిపింది. తల తీసేస్తే, శరీరం కుప్పకూలుతుందని వాసుదేవరెడ్డికి బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ముడుపులిచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు కట్టబెట్టడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలోనే ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానంతో వాసుదేవరెడ్డి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి, విజయవాడలోని ఏసీబీ కోర్టుతోపాటు హైకోర్టు కూడా వాసుదేవరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి.
నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా : జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు చేసి భారీ కుంభకోణానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అందుకు వైఎస్సార్సీపీ ముఠా అనేక మార్గాలు అనుసరించినట్లు గతంలో ఈడీ గుర్తించింది. ఏపీఎస్‌బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే ఆయా సంస్థల యజమానులు అందులో 12 శాతాన్ని నగదు రూపంలోకి మార్చి వైఎస్సార్సీపీ ముఠాకు అందజేసేవారు. దీని కోసం డిస్టిలరీల యజమానులు బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల్లోకి నిధులు మళ్లించి వైట్ నుంచి బ్లాక్‌లోకి మార్చినట్లుగా ఈడీ గుర్తించింది. అప్పట్లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డికి పూర్తిస్థాయిలో సహకరించారని సిట్ ఆరోపిస్తోంది.
కిలోల కొద్దీ బంగారాన్ని కొని మేటలు : జగన్ అధికార అండతో కోట్లు దండుకున్న వైఎస్సార్సీపీ మద్యం మాఫియా సిండికేట్లు కిలోల కొద్దీ బంగారాన్ని కొని మేటలు వేసుకున్నారు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా గుంజుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమీషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని వెల్లడైంది. చివరకు ఆ బంగారం, డబ్బు ‘అంతిమ లబ్ధిదారుల’ ప్యాలెస్‌కు చేరినట్లు తెలుస్తోంది.
కార్యాలయం నుంచి దస్త్రాలు మాయం : వైఎస్సార్సీపీ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన కార్యాలయం నుంచి దస్త్రాల్ని మాయం చేస్తున్నారంటూ నమోదైన కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో వాసుదేవరెడ్డి వాహనంతో పాటు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. ఎవరైనా గ్రాములు, తులాల మేర బంగారం కొంటారుగానీ, కిలోల లెక్కన కొనడమేంటని కూపీ లాగితే బంగారం గుట్టు రట్టైంది. కొన్ని డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల రికార్డుల్ని పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లు గుర్తించారు. దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన ప్లాన్‌గా తేలింది.
ఏపీ మద్యం కుంభకోణం - నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతి
మద్యం స్కామ్‌కు రాజ్ కెసిరెడ్డినే ఆర్కిటెక్ట్ - మరికొంతకాలం జైల్లో ఉండనీయండి: సుప్రీంకోర్టు

