ETV Bharat / state

విద్యావాడగా విజయవాడ - సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాలు

50 ఏళ్ల తన ప్రస్థానంలో లక్షల మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిన సంస్థ సిద్దార్థ - 1975లో ‘సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ను మొగల్రాజపురంలో ఏర్పాటు

SIDDHARTHA ACADEMY VIJAYAWADA
SIDDHARTHA ACADEMY VIJAYAWADA (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 1:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Siddhartha Academy Vijayawada : సమాజంలో లాభాపేక్ష లేకుండా విద్యా వ్యాప్తి చేయాలని 5 దశాబ్దాల కిందట చేసిన ఓ ఆలోచనతో ప్రారంభించినదే నేటి సిద్ధార్థ అకాడమీ. 50 ఏళ్ల తన ప్రస్థానంలో లక్షల మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి, నేడు సగర్వంగా స్వర్ణోత్సవాలు నిర్వహించుకుంటోంది. క్రమశిక్షణ, అకుంఠిత దీక్షకు తోడు అత్యుత్తుమ విధానాలతో సమాజంలో ప్రత్యేక స్థానం నిలుపుకుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అన్నిరకాల విద్యాసంస్థలను స్థాపించి విజయవాడను విద్యావాడగా మార్చింది. 1974లో విజయవాడలో అరకొరగా ఉన్న విద్యా సంస్థల్లో సీట్లు దొరక్క విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతుండడంతో నగరానికి చెందిన ప్రముఖులు వై.వి. రావు, ఎం. సుబ్బారావు కలిసి కళాశాలను ఏర్పాటు చేయాలని భావించారు. నగరంలో ఉన్న ప్రముఖులు సంఘంగా ఏర్పడి పేద, మధ్య తరగతికి చదువులు చేరువ చేయాలనేది వారి లక్ష్యంగా పెట్టుకున్నారు.

పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ పేరుతో : అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆ రోజుల్లో విజయవాడలోని ప్రముఖ వైద్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావును సంప్రదించారు. ఆయన సూచన మేరకు 'అకాడమీ ఆఫ్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా, ఎం. సుబ్బారావు కోశాధికారిగా, వై.వి. రావు కార్యదర్శిగా సొసైటీని రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇక్కడే అకాడమీకి మొదటి బీజం పడింది. ఆ తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, ప్రముఖ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుల సూచనల మేరకు పేరులో 'అకాడమీ' ముందు 'సిద్ధార్థ' అని స్థిరపడింది. అలా 1975లో ‘సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ను మొగల్రాజపురంలో ఏర్పాటు చేశారు. ఇది 'పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ' పేరుతో కొనసాగుతోంది.

క్రమశిక్షణకు మారుపేరు : అప్పట్లో వంద మంది చెరో రూ.10 వేలు వేసి, సొసైటీగా ఏర్పడి విద్యాసంస్థను ఆరంభించాలకున్నారు. ఊహించని విధంగా 250 మంది వరకు సభ్యులుగా చేరారు. జీవితకాల సభ్యులుగా ఉన్న వీరంతా అకాడమీ లాభం ఆశించకూడదనే నిబంధనను పెట్టుకొని, నేటికీ దానిని ఆచరిస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే 1981లో అకాడమీని ఏర్పాటు చేసిన విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలను నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సూచన మేరకు ప్రభుత్వానికి అప్పగించారు. సిద్ధార్థ విద్యా సంస్థల పర్యవేక్షణకు జీవితకాల సభ్యుల నుంచి ప్రతి మూడేళ్లకోసారి 21 మందితో పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. కళాశాల అధ్యాపకుల నియామకాల నుంచి విద్యావిధానాల వరకూ ప్రతి విషయంలోనూ క్రమశిక్షణకే పెద్దపీట వేస్తున్నారు.

విద్యా వృక్షం : ప్రస్తుతం సిద్ధార్థ విద్యా వృక్షం కింద మూడేసి ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, రెండు పాఠశాలలు, మెడికల్, డెంటల్, ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్, బీఈడీ, న్యాయ, నర్సింగ్‌లో డిప్లొమా, డిగ్రీ కళాశాలలున్నాయి. 2024 నుంచి సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కూడా వచ్చింది. ఈ విద్యా సంస్థలన్నింటిలో కలిపి మొత్తం దాదాపు 28 వేల మంది వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు.

"ఇప్పటి వరకు ‘సిద్ధార్థ’ అకాడమీ నుంచి దాదాపు వెయ్యి బ్యాచ్‌లలో లక్షల మంది విద్యార్థుల వరకు చదువులు పూర్తి చేసుకున్నారు. అనేక ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించి, ఉత్తమ విలువలతో కొనసాగిస్తున్న సంస్థ సిద్ధార్థ. అన్ని ప్రధాన దేశాల్లోనూ మా విద్యార్థులే ఉన్నారు" - పాలడుగు లక్ష్మణరావు, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి

12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు

ఇంజినీరింగ్‌ ఫీజులు సవరించిన ప్రభుత్వం - ఆ కళాశాలల్లో పెరిగిన రుసుములు