ETV Bharat / state

కరీంనగర్​ కాల్పుల ఘటన : పక్కాగా రెక్కీ నిర్వహించి - 11 నిమిషాల్లోనే ప్లాన్​ అమలు చేసి

పక్కా ప్రణాళిక ప్రకారమే కరీంనగర్​ నగల దుకాణంలో చోరీ - ముందుగానే రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలు చేసినట్లు భావిస్తున్న పోలీసులు - నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు

Karimnagar Jewellery Shop
Karimnagar Jewellery Shop Firing Incident Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2026 at 7:09 AM IST

|

Updated : May 4, 2026 at 8:55 AM IST

2 Min Read
Choose ETV Bharat

Karimnagar Jewellery Shop Firing Incident Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌ నగల దుకాణంలో కాల్పులు, దోపిడీ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. చోరీకి ఆదివారాన్ని ఎంచుకోవటం, పోలీసులు తిరగని ప్రాంతాల నుంచి కేవలం 15 నిమిషాల్లోనే దొంగతనం చేసి పారిపోవటం చూస్తే పక్కాగా రెక్కీ నిర్వహించి ప్లాన్‌ అమలు చేసినట్టు అర్థమవుతోంది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

కరీంనగర్ జ్యోతినగర్‌లోని పీఎంజే నగల దుకాణంలో కాల్పులు జరిపి రూ.కోటిన్నర విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంత జరిగినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోవటం, నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. నేరం జరిగిన తీరును గమనిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలోకి ప్రవేశించడం, దోపిడీకి పాల్పడటం, తిరగబడ్డ సిబ్బందిపై కాల్పులు జరపడం, అక్కడి నుంచి పరారవడం అంతా 11 నిమిషాల్లోనే జరిగిపోయింది.

సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు : ఉదయం 11 గంటలకు మొదటి దొంగ దుకాణంలోకి ప్రవేశించాడు. 11 గంటల 7 నిమిషాలకు మరో నలుగురు వచ్చారు. లోపలికి రాగానే తుపాకీ పెట్టి సిబ్బందిని హెచ్చరించారు. వెంటనే సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. నగలను బ్యాగులో సర్దమనడంతో సిబ్బంది భయపడి బ్యాగులో వేశారు. ఈ క్రమంలోనే సిబ్బంది వారిపై తిరగబడ్డారు. దీంతో ఆగంతకులు కాల్పులు జరిపారు. 11 గంటల 12 నిమిషాలకు నిందితులు దుకాణం నుంచి పరారయ్యారు. ఈ హడావిడిలో దుండగులు ఒక నగల బ్యాగును అక్కడే వదిలేసి, ఒకదానితో రెండు ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ఈ సమయంలో ఒకతను బైక్​ పైనుంచి కింద పడిపోగా, అతడి చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోయింది. దాన్ని తిరిగి తీసుకోగా మ్యాగజైన్‌ రోడ్డు పక్కనే ఉండిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి.

దుండగుల కాల్పుల్లో నలుగురు నగల దుకాణం సిబ్బందికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో కమలాసన్‌ అనే ఉద్యోగికి ఛాతిలో బుల్లెట్‌ దిగడంతో శస్త్ర చికిత్స నిర్వహించారు. వీరెవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చోరీకి గురైన ఆభరణాలు కిలోకు పైగా ఉంటాయని, వాటి విలువ రూ.కోటికి పైగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే దోపిడీ : చోరీ జరిగిన తీరు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. అగంతకులు కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించి ఆ ప్రాంతంపై అవగాహన తెచ్చుకున్నారని అర్థమవుతోంది. వాహనాలు ఒకే చోట నిలపడం, పోలీసులు లేని ప్రాంతాలను గుర్తించి ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలపై క్షణాల్లో పారిపోవడం ఓ పథకం ప్రకారంగా చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు లేని వీధుల గుండా సిరిసిల్ల మార్గంలో పారిపోవడంతో వీరు మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దొంగల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వారిని గుర్తించి సమాచారం అందించిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు.

జువెల్లరీ షాపులో కాల్పుల కలకలం - నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి

Last Updated : May 4, 2026 at 8:55 AM IST