విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వరుస ఘటనలు - విచారణకు ఈవో ఆదేశం
విజయవాడ దుర్గగుడిలో మరో వివాదం - శుక్రవారం శ్రీచక్ర అర్చనలో వినియోగించేందుకు తెచ్చిన పాలపై దుమారం - నేడు కరెంట్ షాక్ అంటూ తెరపైకి కొత్త అభియోగం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 5:21 PM IST
Shocking Incidents At kanaka durga Temple Of Vijayawada : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం జరిగిన ఘటన మరవకముందే, నేడు మళ్లీ నేడు కొత్త ఆరోపణతో వార్తల్లో కెక్కింది. నిన్న అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శ్రీచక్ర నవావరణార్చన జరుపుతుండగా పాలలో పురుగులు వచ్చాయని భక్తులు సహా ఆలయ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై విచారణ జరగకముందే నేడు దుర్గగుడిలో మరో అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు (శనివారం) ఉదయం ప్రసాద వితరణ ప్రదేశంలో విద్యుత్ షాక్ అంటూ ప్రసార మాద్యమాల్లో జరిగిన ప్రచారంపై దేవస్థానం అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
అమ్మవారి గుడిలో కరెంట్ షాక్ : విజయవాడ దుర్గగుడిలో ఇవాళ ఉదయం ప్రసాదం వితరణ ప్రదేశంలో విద్యుత్‌షాక్ అంటూ ప్రసారమాద్యమాల్లో జరిగిన ప్రచారంపై దేవస్థానం అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. వన్‌టౌన్ సీఐతోపాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రసాదం వితరణ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి తీగలు, ఇనుప కంచెను చేతితో పట్టుకుని మరీ తనిఖీ చేశారు. ప్రసాదం పంపిణీ చేసిన అర్చకున్ని ప్రశ్నించారు. తనకు షాక్ తగిలినట్లు అనిపించిందంటూ అతని ఇచ్చిన వివరణను రికార్డు చేసుకున్నారు.
ప్రసాదం పంపిణీ ప్రాంతం కొత్తగా ఏర్పాటు చేసింది కాదు. ఇటీవల ఆలయంలో అనేక చోట్ల సీసీ కెమెరాల నిఘా పెరిగింది. భక్తుల సౌకర్యార్ధం అంటూ సంస్థాగతంగా కొన్ని మార్పులు చేశారు. పూజల ప్రదేశాల్లోను మార్పులు జరిపారు. ఈ తరుణంలో ప్రసాదం వితరణ ప్రాంతం వద్ద విద్యుత్తు షాక్ అంటూ వచ్చిన ప్రచారంతో సమగ్రంగా పరిశీలించిన తర్వాత మళ్లీ యథావిధిగా ప్రసాదం పంపిణీ జరిపారు. ఈ విషయంలో వాస్తవాన్ని ఇంజినీరింగ్ సిబ్బంది, పోలీసులు నిగ్గుతేల్చడంపై దృష్టి సారించారు.
అమ్మవారికి అర్చన చేస్తున్న పాలలో పురుగులు : శుక్రవారం శ్రీచక్ర నవావరణార్చనలో అభిషేకానికి వినియోగించే ఆవుపాలలో పురుగులు కనిపించాయంటూ వేదపండితులు అర్చనను నిలిపివేసిన అంశంపై ఈవో వీకే శీనానాయక్ సమగ్ర విచారణకు స్థానాచార్యులు శివప్రసాదశర్మ నేతృత్వంలో కమిటీ వేశారు. పంచామృత అభిషేకంలో ఆవుపాలు వినియోగిస్తుంటారు. కొండ దిగువన గోశాల ఉంది. అక్కడి నుంచి స్వచ్ఛమైన పాలు సేకరించకుండా టెట్రాప్యాక్ పాలు వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
నివేదిక అందిచాలని వైదిక కమిటీకి ఆదేశాలు : చిన్న అంశాల విషయంలో ఆలయ ఉద్యోగులు, యంత్రాంగం సరైన పర్యవేక్షణ లేకుండా అజాగ్రత్తగా వ్యవహరించడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు. టెట్రాప్యాక్ పాలలో పురుగు అంశంపై విచారణ జరిపి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేశారు. నిజనిర్ధారణ చేసి నివేదిక సమర్పించాలని వైదిక కమిటీకి బాధ్యతలు అప్పగించారు.
నిన్న శ్రీచక్రనవావరణార్చనలో అభిషేకానికి వినియోగించే ఆవుపాలలో పురుగులు కనిపించాయంటూ వేదపండితులు అర్చనను నిలిపివేశారు. స్థానాచార్యులు శివప్రసాదశర్మ నేతృత్వంలో సమగ్ర విచారణకు కమిటీ వేశాం. పంచామృత అభిషేకంలో ఆవుపాలు వినియోగిస్తుంటారు. అందుకు కొండ దిగువన గోశాల ఉంది. అక్కడి నుంచి స్వచ్ఛమైన పాలు సేకరించకుండా టెట్రాప్యాక్ పాలు వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ అనంతరం నిజ నిర్ధారణ అవుతుంది." - వీకే శీనానాయక్, దుర్గగుడి ఈవో
భక్తుల ఆవేదన : భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశాలపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. అమ్మవారి నిత్య పూజల్లో భాగంగా నిర్వహించే శ్రీచక్ర నవావరణార్చన అపచారం జరిగిందని, పూజ కోసం సిద్ధం చేసిన పాలలో పురుగులు కనిపించడంతో భక్తులు, అర్చకులు విస్మయానికి గురయ్యారు. కోట్లాది మందికి ఆరాధ్యదైవమైన కనకదుర్గమ్మ ఆలయంలో ఇలాంటి పొరపాట్లు జరగడం దురదృష్టకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదాలు, పూజా ద్రవ్యాల విషయంలో అధికారులు మరింత నిశితంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
దుర్గగుడిలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు - పక్కాగా మూడంచెల ప్రణాళిక!
కనకదుర్గ అమ్మవారి భూములకు రక్షణ ఏది - పెద్దోళ్లకు అండగా అధికారులు

