జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి ఘటనపై మంత్రి ఆగ్రహం - నలుగురు వైద్యులపై సస్పెన్షన్ వేటు
ప్రభుత్వాసుపత్రి మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్కలు - బహిర్భూమికని బయటకు వెళ్లి కనపడకుండాపోయిన భీమేశ్వర్ అనే వ్యక్తి - ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Published : March 3, 2026 at 9:00 AM IST
Jadcherla Government Hospital : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. శనివారం జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనే వ్యక్తి ఇంటి నుంచి బహిర్భూమికని బయటకు వెళ్లారు. ఆయన లారీ డ్రైవర్‌గా పని చేసేవారు. దీంతో విధులకు వెళ్లారని కుటుంబసభ్యులు భావించి, పట్టించుకోకుండా ఉన్నారు. భీమేశ్వర్ రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
సోమవారం ఉదయం స్థానిక చెరువులో మృతదేహం తేలడంతో పోలీసులు శవాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కింద నేలపైనే వదిలేశారు. అక్కడ సరైన భద్రత లేకపోవడంతో ఓ కుక్క లోపలకు చొరబడి శవాన్ని పీక్కుతింటూ కనిపించడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళను ఈటీవీ భారత్ వివరణ కోరగా పోస్టుమార్టం సిబ్బంది గదిలోకి వెళ్తుండగానే కుక్క కూడా వెళ్లిందని, అప్పుడే సిబ్బంది దాన్ని బయటకు తరిమేశారని తెలిపారు.
ఆసుపత్రిని ఉన్నతీకరించినా - పాత దానిలోనే : జడ్చర్లలో 30 పడకల ఆసుపత్రిని 2023లో 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. నూతన ఆసుపత్రిలో మార్చురీకి సంబంధించిన పరికరాలు, ఇతర వసతులు ఇంకా ఏమీ కల్పించలేదు. దీంతో పాత ఆసుపత్రి మార్చురీలోనే పోస్టుమార్టంనకు సంబంధించిన పనులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని మార్చురీకి తీసుకువచ్చి అక్కడి పరిస్థితులను చూసి రాత్రంతా అంబులెన్సులోనే ఉంచి, ఉదయం పోస్టుమార్టం చేయించడం గమనార్హం. సమస్యలను ఉన్నతాధికారులకు చెబుతున్నా స్పందన కరవవుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఎంపీ అరుణ ఆగ్రహం : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్న చోట పరిస్థితి ఇలా ఉంటే ఇతర జిల్లాల సంగతీ ఏంటని ప్రశ్నించారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనతో వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. పేదల ఇళ్లను కూల్చడంపై ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు వైద్యం అందించడంలో లేదన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం: ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి విచారణ జరిపారు. మృతుని కుటుంబ సంభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, పోలీసుల నుంచి ఘనటకు సంబంధించిన వివరాలను సేకరించారు.
సిబ్బందిపై సస్పెన్షన్ వేటు : జడ్చర్ల పాత ప్రభుత్వ ఆస్పత్రి ఘటనతో వైద్య శాఖ ఉలిక్కిపడింది. దీంతో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ వెంటనే ఆసుపత్రిని పరిశీలించారు. జడ్చర్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోలను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
వైద్యుల సస్పెన్షన్ సరికాదు : ఈ ఘటనలో వైద్యులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్రంగా ఖండించింది. ఆసుపత్రిలోని మార్చురీ నిర్వహణ బాధ్యత వైద్యులది కాదని, ఈ బాధ్యతను సూపర్వైజర్లు నిర్వహిస్తారని వెల్లడించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సంఘం అధ్యక్షుడు నరహరి, ప్రధాన కార్యదర్శి లాలూ ప్రసాద్ రాథోడ్ డిమాండ్ చేశారు.
తరతరాలుగా అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలు - భూమి విక్రయించడంతో వ్యక్తి మృతి

