కొండపై శివాలయం, దిగువన జలపాతం - శివరాత్రికి సిద్ధమైన మత్స్యగుండం
అల్లూరి జిల్లాలో మత్స్య రూపంలో దర్శనమిస్తున్న శివుడు - మూడు రోజులపాటు జరిగే జాతర మహోత్సవాలకు భారీ ఎత్తున రానున్న భక్తులు, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 2:37 PM IST
Shivaratri Celebrations At Matsyagundam in Alluri District: అల్లూరి జిల్లాలో కొలువై ఉన్న మత్య్యగుండం మహాశివరాత్రి సందర్భంగా సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. ఈ దేవాలయంలో కొలువుదీరిన శివుని పూజలకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అందాలకు నెలవైన అల్లూరి జిల్లాకు పర్యాటకంగా విశేష గుర్తింపు పొందింది. ఓ పక్కన కొండపై నెలకొని ఉన్న శివాలయం, కొండ దిగువున ప్రవహించే మత్స్యగుండం ఇది ఓ అద్భుత దృశ్యం.
అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం మత్స్య రూపంలో ఇక్కడ శివుడు, నాగ రూపంలో నాగదేవతలు ఎన్నో ఏళ్లుగా విశేష పూజలను అందుకుంటున్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ శివాలయంలో అధికారులు శివరాత్రికి సకల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐఏఎస్ లు వెల్లడించారు.
అంతేకాకుండా పోలీస్, వైద్య, పారిశుద్ధ్యం ఇతర సిబ్బందితో మాట్లాడి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. దాదాపు మూడు రోజులపాటు సాగనున్న జాతర మహోత్సవాలకు పాడేరు నుంచి 20 ప్రత్యేక బస్సులను అధికారులు నడపనున్నారు. అదే విధంగా ఏజెన్సీ నుంచే కాకుండా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రతి ఏటా అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అధికారులు అందుకు తగ్గట్లుగానే జాతర మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
"మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకోవడానికి కావాల్సిన అన్ని వసతులను కల్పించనున్నాం. దీన్ని భక్తులు గమనించి క్యూలైన్ పాటిస్తూ ఆనందంగా దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం"-తిరుమణి శ్రీపూజ,జాయింట్ కలెక్టర్
మత్స్య రూపంలో శివుడు: మత్స్యగుండం ఇది ఓ అద్భుత దృశ్యం. ఈ దేవాలయం గురించి తెలిసిన వారు ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించక మానరు. అదే విధంగా ప్రకృతి ప్రేమికులు ఇక్కడకు వచ్చి ఆనందంగా సేద తీరుతారు. రమణీయమైన ప్రకృతి సహా దైవత్వంలో ఈ ప్రాంతం మరింత మానసిక ఆనందాన్ని అందిస్తుంది. మత్స్యగుండం పాడేరుకు దాదాపు 12 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. రహదారి చేరుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ మత్స్య రూపంలో శివుడు, నాగ రూపంలో నాగదేవతలు విశేష పూజలందుకోవడం విశేషం.
ఎంతో చారిత్రక వైభవం కలిగిన ఈ ప్రకృతి సంపదను వీక్షిస్తే పర్యాటకులు అంతేకాకుండా మధురమైన అనుభూతిని పొందుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వేసవి సెలవుల సమయంలో అందరూ సరదగా ట్రిప్లు ఇక్కడకు వేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది పర్యాటకులు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. ఈ క్రమంలోనే మత్య్సగుండం పర్యాటకులతో సందడిగా మారింది.
ఈ చేపలను పూజిస్తారు : కొండల మధ్యలో బండ రాళ్లు వాటి మధ్యలో గలగలా పారే సెలయేరు ప్రవహించే దృశ్యం మదిని ఎంతో ఆకట్టుకుంటుంది. కొండ మీద పచ్చ పచ్చని చెట్లు, జలపాతపు సవ్వళ్లు తదితర ఈ మొత్తం ప్రదేశాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటారు ఇక్కడకు వచ్చిన పర్యాటకులు. బ్రిడ్జి కింద నుంచి చూస్తే ఈ ప్రదేశం మరింత సౌందర్యవంతంగా కనిపిస్తుంది. ఇక్కడ బండరాళ్ల మధ్య ఉండేటటువంటి చేపలను దేవతలుగా ఆరాధిస్తారు. వీటిని స్థానికులు వేటాడరు. ప్రకృతి ప్రేమికులు చూసి మైమరచిపోతుంటారు. మఠం పంచాయతీలో వెలసిన ఈ మత్స్యగుండం దేవాలయం ఎంతో ఆనందోత్సాహాలను పంచుతుంది. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలపాతాల నడుమ అద్భుతమైన ప్రదేశంలో వెలసిన ఈ ఆలయం పర్యాటకులను కనువిందు చేస్తుంది.
అభివృద్ది మరింత అవసరం : అంతేకాకుండా ఈ ఆలయాన్ని మరింత పునరుద్ధరించి పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిందిగా చుట్టుపక్కల గ్రామస్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ ప్రాంతానికి పర్యాటకుల సందడి తగ్గిందని స్థానికులు వాపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యత స్థానిక అధికారులపై ఉందని, ఈ ప్రాంత అభివృద్దికి తగిన చర్యలు చేపట్టాలని వీరు కోరుతున్నారు.
కొండపైన శివాలయం - కొండ కింద మత్స్యగుండం - పర్యటకులకు కనువిందు

