రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు - తిరుమలలో పలు సేవలు, దర్శనాలు రద్దు
రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు - ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు - తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 4:38 PM IST
TTD Cancels Several Darshans on Ratha Sapthami : ఈ నెల 25న రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి సన్నిధిలో టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. రథసప్తమి రోజు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని, వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫారసు లేఖలూ స్వీకరించమని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రథసప్తమి సందర్భంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. తిరుపతిలో ఈ నెల 24వ తేదీ నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు.
భక్తులకు తితిదే సూచనలు :
- రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
- అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు
- చంటి బిడ్డల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
- తిరుపతిలో ఈ నెల 24వ తేదీ నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదు
- ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు.
- బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదు
- ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం) టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలి
ఒకేరోజు సప్త వాహనాలపై శ్రీవారు: జనవరీ 25వ తేదీన ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో మొదలయ్యి, రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహన సేవలు ముగియనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రథసప్తమి వేడుకలకు పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. మాడవీధుల్లో వాహన సేవలు తిలకించేందుకు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తామన్నారు. గ్యాలరీల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా : మేదరమిట్ట, ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లోకి ప్రవేశించే మార్గం దగ్గర గతంలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ప్రత్యేక వేడుకలప్పుడు భక్తులు ముందు రోజు రాత్రి నుంచే ఆలయ మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలకు చేరుకుంటారు. మిగిలిన వారు ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా ఎక్కడ అనుమతిస్తే అక్కడ వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఇటువంటి సమయంలో తోపులాటలు, తొక్కిసలాటలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిని నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో క్యూలైన్లను తితిదే ఏర్పాటు చేస్తుంది. తితిదే విజిలెన్స్ విభాగం, తిరుపతి జిల్లా పోలీసు విభాగం సమన్వయంతో ఈ భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నారు.
రథోత్సవం ఇలా :
- జనవరీ 25న ఉదయం 5.30 నుంచి ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరగనుంది.
- రథసప్తమి రోజు సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు ఉంటుంది.
- ఉదయం 9-10 గంటలు : చిన్నశేష వాహనం సేవ
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 : గరుడ వాహనం సేవ
- మధ్యాహ్నం 1-2 గంటలు: హనుమంత వాహనం సేవ
- మధ్యాహ్నం 2-3 గంటలు: చక్రస్నానం
- సాయంత్రం 4-5 గంటలు: కల్పవృక్షం సేవ
- సాయంత్రం 6-7 గంటలు: సర్వభూపాలం సేవ
- రాత్రి 8-9 గంటలు: చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
గుడ్న్యూస్ - టీటీడీలో పలు పోస్టుల భర్తీకి, ప్రమోషన్లకు పచ్చజెండా

