ETV Bharat / state

పనివాళ్లుగా చేరి ప్రాణాలు తీస్తున్నారు - కాపలాదారులుగా చేరి నేరాలు చేస్తున్నసెక్యూరిటీ గార్డులు

Security Guard Issue Telangana : యజమానులు లేని సమయంలో ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నారు. బంగారం, డబ్బుల కోసం హత్యలు చేస్తున్నారు. పనివాళ్లను నియమించుకునే ముందు వారి పూర్తిచరిత్ర తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Security Guard Issue Telangana
ప్రతీకాత్మక చిత్రం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2026 at 10:00 AM IST

2 Min Read
Choose ETV Bharat

Security Guard Issue Telangana : సెక్యూరిటీ గార్డులుగా పనిలో చేరిన కొందరు అదును చూసి చేస్తున్న నేరాలు కలకలం రేపుతున్నాయి. యజమానులు లేని సమయంలో ఇళ్లల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ సొత్తు కోసం హతమార్చేందుకు వెనుకాడడం లేదు. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నా, కొన్ని రోజుల తర్వాత అంతా యథాతథంగా కొనసాగుతోంది. తాజాగా బొల్లారంలో ఐదేళ్ల చిన్నారిని హతమార్చిన ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

తేలికగా డబ్బు సంపాదించేందుకు

కాపలాదారులుగా చేరి నేరాలు చేస్తున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఏటా వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. అపార్టుమెంట్లు, విల్లాల దగ్గర విధుల్లో ఉండే సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్లకు కేవలం భద్రతా విధులు మాత్రమే కాకుండా ఇళ్లల్లో పనులు అప్పగించడం పరోక్షంగా నేరాలకు కారణమవుతోంది. యజమానులు రాకపోకలు సాగించే సమయం, వారి ఆర్థిక స్థితిగతులు భద్రతా సిబ్బందికి తెలుస్తుంటుంది. జల్సాలు, తేలికగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడ్డ కొందరు భద్రతా సిబ్బంది నేరాల వైపు మళ్లుతున్నారు. విధుల్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటూ పని మానేసిన తర్వాత చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

పనివాళ్లుగా చేరి ప్రాణాలు తీస్తున్నారు - యజమానులు లేని సమయంలో అదును చూసి నేరాలు (ETV)

సెక్యూరిటీగార్డుల ముసుగులో దోపిడీలు

తక్కువ జీతాలకు పనిలో చేరతారనే ఉద్దేశంతో వృద్ధులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని ఇళ్లల్లో పనులు, అపార్టుమెంట్లకు సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటున్నారు. నేర చరిత్ర తెలుసుకోవడం లేదు. దీనికితోడు నగరంలోని ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీల నిర్లక్ష్యం అడ్డగోలు నేరాలకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్న వందలాది సెక్యూరిటీ ఏజెన్సీలు కనీస అర్హతల్లేని వారిని భద్రతా సిబ్బందిగా నియమిస్తున్నాయి. సెక్యూరిటీ గార్డులుగా విధుల్లోకి తీసుకునేముందు 20 రోజుల వ్యవధిలో కనీసం 100 గంటల తరగతులు, 60 గంటల క్షేత్రస్థాయి శిక్షణ కచ్చితంగా తీసుకొని ఉండాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌కు చెందిన ధార్, బవారియా, పార్థీ గ్యాంగ్‌లు సెక్యూరిటీగార్డుల ముసుగులో ప్రవేశించి దోపిడీలకు పాల్పడుతున్నాయి.

వారి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి

పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులను నియమించుకొనే ముందు వారి పూర్తి చరిత్ర తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల ద్వారా తనిఖీ చేయించాలని గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా మాత్రమే సిబ్బందిని పనికి తీసుకోవాలంటున్నారు. సీసీటీవీ కెమెరాలు ప్రతి ఒక్కటీ పనిచేసేలా పర్యవేక్షించాలని చెబుతున్నారు. విధుల్లో ఉండే వ్యక్తులకు తోడుగా అపరిచితులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదంటున్నారు. ఎదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య - కాళ్లు, చేతులు కట్టేసి, నీటి సంపులో పడేసి