తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర - 7 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ - ఒకట్రెండు రోజుల్లోనే నోటిఫికేషన్!
7 వేల ఖాళీల్లో 5 వేల పోలీస్ పోస్టులు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం - 148 సివిల్ ఎస్సై పోస్టులతో నాలుగో నోటిఫికేషన్

Published : July 4, 2026 at 8:25 AM IST
Police Posts Recruitment in Telangana : తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర షురూ కానుంది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సంబంధించిన 7 వేల ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దాదాపు 7 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా, మరో 2 వేల ఖాళీల కోసం ఉత్తర్వులను వెలువరించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నాలుగోసారి : విద్యార్హతలు, వయో పరిమితి, రిజర్వేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షలు, శరీర దారుఢ్య పరీక్షలు, ఇతర షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటించనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. స్వరాష్ట్రంలో 2015లో తొలిసారి 9,281 పోస్టులతో నోటిఫికేషన్ జారీ అయ్యింది. అనంతరం 2018లో 1,217 ఎస్సై ఖాళీలతో 16,285 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్సై పోస్టులతో పాటు 15, 644 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రత్యేక తెలంగాణలో నాలుగోది.
ఆందోళనల వేళ కొలువుల భర్తీ : 5 వేల పోలీస్ కొలువుల్లో సివిల్ ఎస్సై ఖాళీలు 148 ఉండగా, ఏఆర్ ఎస్సై 14, టీజీఎస్పీ-ఏఆర్ ఎస్సై 12, ఎస్‌ఏఆర్ సీపీఎల్ ఎస్సై 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై 23, సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1052, ఎస్‌ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ పీటీవో 20, కానిస్టేబుల్ మెకానిక్ పీటీవో 7 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కొలువుల భర్తీ కోసం కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ 7 వేల పోస్టుల భర్తీపై ప్రాధాన్యం సంతరించుకొంది.

20 వేల పోస్టులు భర్తీ చేయాలి : పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతీయువకులు గత కొద్దికాలంగా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో ఉన్నారు. తొలుత 20 వేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, ఇప్పుడు 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏంటని నిలదీస్తున్నారు. ఇలా చేస్తే గ్రామీణ ప్రాంతం వారికి ఉద్యోగాలే రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టుల సంఖ్యలు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే నిరుద్యోగులు ప్రతిపక్షాలను కలిసి మద్దతు కోరారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల నిరసనలో పాల్గొన్నారు. అక్కడ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సైతం నిరుద్యోగులు కలిసి మాట్లాడారు. స్పందించిన ఆయన 20 వేల పోస్టులను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా దిల్‌సుఖ్‌నగర్‌కు వస్తానని హామీ కూడా ఇచ్చారు.
తండ్రి కోరికను తమ కలగా మార్చుకుని ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీసు ఉద్యోగాలు
YUVA : తండ్రి కోరిక నెరవేర్చిన తనయుడు - 3 ప్రభుత్వ ఉద్యోగాలతో సత్తా

