ETV Bharat / state

అన్నవరం కొండపైనే మద్యం సీసాల కలకలం - టోల్‌గేటు వద్ద నామమాత్రంగా తనిఖీలు

పెళ్లి బృందంపై ఆకతాయిల దాడి - బుట్టదాఖలైన ఇంటెలిజెన్స్ నివేదికలు - ఇకపై కట్టుదిట్టం చేస్తామన్న ఈవో

Annavaram temple security lapses
అన్నవరం కొండపైనే మద్యం సీసాల కలకలం (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 4:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Annavaram temple security lapses : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో భద్రతా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. సత్యదేవుని దర్శనం కోసం వచ్చే భక్తులు, వివాహాల కోసం వచ్చే పెళ్లి బృందాలకు కనీస రక్షణ కరవైంది. సిబ్బంది నిర్లక్ష్యంతో పవిత్రమైన కొండపైకి నిషేధిత వస్తువులు యథేచ్ఛగా చేరిపోతున్నాయి. టోల్‌గేటు వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలను గాలికి వదిలేయడంతో ప్రతిరోజూ ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నిబంధనల ప్రకారం కొండపైకి ఎలాంటి నిషేధిత వస్తువులు తీసుకువెళ్లకూడదు. సిగరెట్లు, మద్యం, మాంసం, ఇతర మతాల చిహ్నాలను పైకి అనుమతించరు. ఈ మేరకు టోల్‌గేటు వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని గతంలోనే అధికారులు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. రాత్రి వేళల్లో వాహన చోదకులు మద్యం తాగి ఉన్నారో లేదో కనీసం పరీక్షించడం లేదు. బ్రీత్ అనలైజర్ తనిఖీలు జాడలేవు.

పెళ్లి బృందంపై దాడి : సిబ్బంది నిర్లక్ష్యమే అవాంఛనీయ ఘటనలకు కారణమవుతోంది. బుధవారం రాత్రి కొండపైకి వచ్చిన ఒక పెళ్లి బృందంపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఆకతాయిలు రెచ్చిపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. హరిహరసదన్‌ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ఎక్కడ పడితే అక్కడ మద్యం ఖాళీ సీసాలు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో టోల్‌గేటు వద్ద వాహనాల్లో మద్యం పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయినా సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమల తరహా భద్రత ఏదీ? : తిరుమల అలిపిరి టోల్‌గేటు వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు ఉంటాయి. అన్నవరంలోనూ అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. లగేజీ స్కానర్, మెటల్‌ డిటెక్టర్, హ్యాండ్‌ హెల్డ్ డిటెక్టర్‌లతో ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాలన్నారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. కనీసం ఆలయం వద్ద కూడా సరైన తనిఖీలు లేవు. భక్తులు తమ బ్యాగులతో నేరుగా గుడిలోకి వెళ్తున్నా సిబ్బంది చోద్యం చూస్తున్నారు.

అన్నవరం భద్రతపై ఇంటెలిజెన్స్‌ అధికారులు రెండుసార్లు నివేదికలు ఇచ్చారు. 2012లో, అలాగే 2020లో భద్రతా లోపాలను ఎత్తిచూపుతూ పలు సూచనలు చేశారు. కొండపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆ నివేదికలను అధికారులు బుట్టదాఖలు చేశారు. వాటిని అమలు చేయడంలో ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

ఏటా రూ.5 కోట్ల ఖర్చు : భద్రత కోసం దేవస్థానం భారీగానే నిధులు వెచ్చిస్తోంది. ఏటా సుమారు రూ.5 కోట్లను భద్రతా సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం కొండపై 100 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు దేవస్థానం, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది, హోంగార్డులు మరో 70 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంతమంది ఉన్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది. టోల్‌గేటు వద్దే కాకుండా, మెట్ల మార్గంలోనూ ఎలాంటి తనిఖీలు లేవు. రాత్రివేళల్లో భద్రతా సిబ్బంది పెట్రోలింగ్‌ సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

'ఇకపై భద్రత కట్టుదిట్టం' : ఈ భద్రతా వైఫల్యాలపై అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు స్పందించారు. "కొండపై ఇక నుంచి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తాం. టోల్‌గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పైకి అనుమతిస్తాం. పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా అప్రమత్తంగా ఉంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

వరుస సెలవులు - తిరుమల, అన్నవరంలో పెరిగిన భక్తుల రద్దీ

భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం - అన్నవరం, లోవ ఆలయాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ తనిఖీలు