విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ - మరో 13 నెలల్లో నిర్మాణం పూర్తి!
అమృత్ భారత్ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి - దశలవారీగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు పక్కా ప్రణాళిక - మరో 13 నెలల్లో అందుబాటులోకి!

Published : November 11, 2025 at 11:42 AM IST
Secunderabad Railway Station Gets Modern Features : కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులను కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తోంది. రూ.720 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించగా, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అధునాతన సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే దశలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి కాగా మరో 13 నెలల్లో అంతర్జాతీయ విమానాశ్రయ తరహా హంగులతో ఈ రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో దక్షిణం వైపు బేస్మెంట్ పనులతో పాటు మల్టీలెవల్ కార్ పార్కింగ్ అందుబాటులోకి రానుందని తెలిపారు. అలాగే అత్యాధునిక సదుపాయాలను కూడా రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందిస్తోంది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణం : ప్రస్తుతం రైల్వేస్టేషన్లో నిత్యం లక్షా 97 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ సమయాల్లో గంటకు 23 వేల మంది వరకు ఉంటున్నారు. 2060 నాటికి ఈ సంఖ్య 2 లక్షల 70 వేలకు చేరుకోనుందని అంచనా. అదే రద్దీ వేళల్లో గంటకు 25 వేల మంది, పండగ సమయాల్లో 32,500కి చేరుతోందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు.
ఇందుకోసం 1.65 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రస్తుతం ఉత్తరం వైపు ఉన్న భవనం 8,027 చదరపు మీటర్లు ఉండగా, దాన్ని 22,516 చదరపు మీటర్ల విస్తీర్ణం మేర పెంచారు. దక్షిణం వైపు ఉన్న భవనాన్ని 3,400 చదరపు మీటర్ల నుంచి 14,792 మీటర్లకు విస్తరించారు. అలాగే మూడు వేల మంది కూర్చునేలా 26,604 చదరపు మీటర్ల విస్తీర్ణంతో అభివృద్ధి చేస్తున్నారు.
వివిధ పనుల పూర్తికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇవే :
- దక్షిణం వైపు ప్రధాన భవనం - జనవరి
- నాంపల్లి వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి - జులై
- ఎయిర్ కాన్కోర్స్ - ఆగస్టు
- ఉత్తరం వైపు ప్రధాన భవనం - సెప్టెంబరు
- కవర్ ఓవర్ ప్లాట్‌ఫామ్ - నవంబరు
హైదరాబాద్‌లో 12 స్టేషన్ల అభివృద్ధి : దక్షిణ మధ్య రైల్వే రూ.514.49 కోట్లతో హైదరాబాద్ పరిధిలోని రైల్వేస్టేషన్ల రూపురేఖలను మార్చుతోంది. ఇప్పటికే చర్లపల్లి స్టేషన్ అందుబాటులోకి రాగా, ఇందుకోసం రూ.430 కోట్లను ఖర్చు చేశారు. అలాగే సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ.720 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. ఈ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్నే కాకుండా మరో 11 స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరి, యాకుత్‌పుర, ఉమ్దానగర్, బేగంపేట స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా హైదరాబాద్‌లోనే 12 స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కొన్ని స్టేషన్లును ప్రారంభించారు.
ఎయిర్‌పోర్ట్‌ల తరహాలో రైల్వేస్టేషన్లు - సికింద్రాబాద్ సహా ఈ స్టేషన్లకు మహర్దశ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు - 60 రైళ్లకు స్టేషన్ల మార్పు

