లివర్ మార్పిడి లేకుండానే అరుదైన వ్యాధి నుంచి యువతిని కాపాడిన కిమ్స్ వైద్యులు
అరుదైన వెబర్ క్రిస్టియన్ వ్యాధి నుంచి యువతిని కాపాడిన కిమ్స్ వైద్యులు - ఇది ప్రపంచంలోనే 19వ కేసు - కిమ్స్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ టీం, రుమటాలజీ వైద్యుల ఘనత

Published : May 26, 2026 at 12:19 PM IST
KIMS Doctors Save woman from Weber Christian Disease : ఆమెకు ప్రపంచంలోనే అరుదైన లివర్ సమస్య వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 19వ కేసు మాత్రమే. ఇక అంతర్జాతీయ ప్రమాణాలు ప్రకారం ఆమె బ్రతకాలాంటే కచ్చితంగా లివర్ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తెలిపారు. కానీ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఎటువంటి లివర్ మార్పిడి అవసరం లేకుండానే రుమటాలజీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్ విభాగాల సమన్వయంతో విజయవంతంగా చికిత్స అందించి ఆమెకు పునర్జన్మను అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను చికిత్సను అందించిన క్లినికల్ డైరెక్టర్ రుమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీ విభాగం డాక్టర్ వి. శరత్ చంద్ర మౌళి, డైరెక్టర్ - హెపటాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజీ డాక్టర్ కె ఎన్ చందన్ కుమార్ తెలిపారు.
వెబర్ క్రిస్టియన్ సిండ్రోమ్‌గా నిర్ధారణ : హైదరాబాద్ నగరానికి చెందిన యువతి (26) అత్యంత అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధిగా గుర్తింపు పొందిన వెబర్ క్రిస్టియన్ డిసీజ్ కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెబర్ క్రిస్టియన్ వ్యాధి అంటే చర్మం కింద ఉండే కొవ్వు పొరల్లో వాతము(ఇన్ఫ్లమేషన్) కలిగించే ఒక అరుదైన వ్యాధి. ఈ యువతికి 2018లో చేతులు, కాళ్లపై నొప్పితో కూడిన గడ్డలు, తరచూ జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో రుమటాలజీ విభాగానిలోని డాక్టర్ శరత్ చంద్ర మౌళి నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించి ఆమెకు వెబర్ క్రిస్టియన్ సిండ్రోమ్‌గా నిర్ధారించారు. ప్రారంభ దశలో చికిత్స అందించిన తర్వాత ఆమె కోలుకోవడంతో మందులు ఆపేసింది. అంతేకాదు ఆమె దాదాపు ఆరు సంవత్సరాలు ఫాలోఅప్‌కి రాలేదు. 2026 ఫిబ్రవరిలో తీవ్ర జ్వరం, జాండీస్ వ్యాధి లక్షణాలు, ప్రవర్తనలో మార్పులు, మెదడులో రక్త స్రావం, తీవ్రమైన మైకం, లివర్ పనితీరులో మార్పులు రావడం వల్ల కిమ్స్ హాస్పిటల్స్‌కి తరలించారు.
కొద్ది రోజుల్లోనే ఆమెకు గ్రేడ్-4 హెపాటిక్ ఎన్సెఫలోపతి అనే ప్రమాదకర స్థితి ఏర్పడింది. అంటే లివర్ పనిచేయకపోవడం వలన మెదడుపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. దీంతో వెంటనే లివర్ ఐసీయూకు తరలించి, హెపటాలజీ, లివర్ మార్పిడి నిపుణుడు డాక్టర్ కె.ఎన్. చందన్ కుమార్ నేతృత్వంలోని బృందం చికిత్స ప్రారంభించింది. పెషేంట్ని వెంటిలేటర్‌పై ఉంచి మెదడు వాపు నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు ప్లాస్మాఫెరెసిస్ ద్వారా ఎక్స్ట్రాకార్పోరియల్ లివర్ సపోర్ట్ అందించారు. వైద్య పరీక్షల్లో ఆమె కింగ్స్ కాలేజ్ క్రైటీరియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో అత్యవసర లివర్ మార్పిడి అవసరమని భావించారు. అయితే రక్తంలో ఫెరిటిన్ (ఐరెన్) స్థాయిలు అసాధారణంగా పెరగడం గమనించిన వైద్యులు మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ (రోగనిరోధక వ్యవస్థ అదుపుతప్పడం) అనే తీవ్రమైన హైపర్ ఇన్ఫ్లమేటరీ స్థితికి ఆమె చేరుకుంది. ఇది అతి ప్రమాదకరమైన జబ్బుని వైద్యులు తెలిపారు.
విదేశాల నుంచి మెడిసన్ని తెప్పించిన వైద్యులు : వెబర్ క్రిస్టియన్ అనే జబ్బు లివర్‌కు సోకి ఫల్మినెంట్ హెపటిక్ ఫెయిల్యూర్ ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలలో ప్రపంచంలో కేవలం ముగ్గురికి మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రుమటాలజీ, హెపటాలజీ, లివర్ మార్పిడి ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్ విభాగాల నిపుణులు సమన్వయంతో పనిచేశారు. రోగికి శక్తివంతమైన యాంటీబయోటిక్స్, పల్స్ స్టెరాయిడ్స్, ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీకి ప్రత్యేక మందులు అందించారు. అత్యంత కీలక దశలో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కిమ్స్ వైద్యులు అనాకిన్రా అనే Iఎల్-1 రిసెప్టర్ యాంటగనిస్ట్ ఔషధాన్ని ఉపయోగించారు. భారతదేశంలో అందుబాటులో లేకపోవడంతో ఈ ఔషధాన్ని విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం రోగిలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం ప్రారంభమై, లివర్ పనితీరు క్రమంగా మెరుగుపడింది.
ఆధునిక టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ వినియోగం : న్యూరోలాజికల్ పరిస్థితి సైతం స్థిరపడటంతో వెంటిలేటర్ నుంచి తొలగించారు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించి, సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె సాధారణ జీవితం గడుపుతూ, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం, విభిన్న వైద్య విభాగాల సమన్వయంతో వేగంగా చికిత్స అందించడం, ఆధునిక టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ వినియోగం వంటి అంశాల వల్లే ఈ యువతి ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. ఈ ఘటన భారత వైద్య రంగంలో ఒక అరుదైన విజయంగా నిలిచిందని, క్లిష్ట వైద్య అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే కిమ్స్ హాస్పిటల్స్ నైపుణ్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
కిమ్స్ హాస్పిటల్స్‌లో లూపస్ యోధుల ర్యాంప్ వాక్
"పదేళ్ల బాలుడికి అరుదైన వెన్నెముక క్యాన్సర్" - ప్రాణాలు కాపాడిన కిమ్స్ కొండాపూర్ డాక్టర్లు

