రాజధానిలో భూసమీకరణ ప్రక్రియకు శ్రీకారం - అభివృద్ధిపై స్పష్టత కోరుతున్న రైతులు
అమరావతి విస్తరణలో భాగంగా అంతర్జాతీయస్థాయి క్రీడామైదానం, రైల్వేమార్గం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు - గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల్లో భూసమీకరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 10:29 AM IST
Land Pooling in Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానం, రైల్వే మార్గం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటుకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 7 గ్రామాల్లో భూసమీకరణ చేస్తున్నారు. బుధవారం నుంచి భూసమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయా గ్రామాల్లో అమరావతిలో భాగస్వామ్యులు అవుతున్నామనే ఆనందంతో పాటు పలు సందేహాలను వ్యక్తం చేశారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వనందున మాకు ఎప్పటిలోగా అభివృద్ధి చేసిన లేఔట్లు ఇస్తారో స్పష్టత కావాలని కోరారు.
రైతుల సందేహాలు నివృత్తి: కౌలు ధరలు పెంచడంతో పాటు రైతు కూలీలకు పింఛను, రిటర్న్‌బుల్ ప్లాట్ల విస్తీర్ణం పెంచాలని విన్నవించారు. సీఆర్‌డీఏకి భూములు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నందున 3 ఏళ్లలో అభివృద్ధి చేయని పక్షంలో పరిహారం ఇచ్చేలా నిబంధన పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఇనాం భూములు ఉన్నాయని, వాటి పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయి, ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.
తొలి రోజు అటు వడ్డమాను, ఇటు యండ్రాయిలో కొందరు రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చి సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, భాష్యం ప్రవీణ్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్‌తేజ రైతులు అడిగిన సందేహాలను సైతం నివృత్తి చేశారు.
స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి: 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ చేసినప్పుడు 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రకటించామన్నారు. ఆచరణలో జాప్యం కావడంతో మరో 5 ఏళ్ల పాటు కౌలు ఇస్తున్నామని చెప్పారు. ఇక్కడ కూడా 3 ఏళ్లలో అభివృద్ధి చేయని పక్షంలో రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కౌలు పెంపు పై సీఎంతో చర్చించిన తర్వాత ఎంత పెంచుతామన్న విషయమై ప్రకటిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. వడ్డమానులో కొందరూ రైతులు రాజకీయ అస్థిరత వల్ల రాజధాని అభివృధ్ధి ఆగిపోతే రైతులకు పరిహారం వచ్చేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. యండ్రాయిలో రైతులు సీఆర్‌డీఏకి భూములు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, అయితే వీలైనంత తొందరగా అభివృద్ధి చేయాలని కోరారు.
ఆ రెండు గ్రామాల్లో సందడి: భూసమీకరణ ప్రారంభించేందుకు అధికారులు బుధవారం 2 గ్రామాల్లో కార్యాలయాలు ప్రారంభించడంతో సందడి నెలకొంది. రైతులు ప్రస్తుతం భూముల విలువ, రాజధాని రాకముందు పరిస్థితుల పై చర్చించుకోవడం కనిపించింది. భూములు తీసుకున్న తర్వాత ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారు అన్న విషయమై పలువురు చర్చించుకోవడం కనిపించింది.
రాజధానిలో జరుగుతున్న పనుల తీరు, రహదారులు ఎక్కడెక్కడి వరకు వేస్తారు అన్న అంశాల పై చర్చించుకున్నారు. 7 గ్రామాల్లో భూసమీకరణకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో ఆయా గ్రామాల ప్రజలు రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు అమరావతి, తుళ్లూరు మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16 వేల ఎకరాలు సమీకరించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పుడు భూ సమీకరణ చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వేట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది. రైతులకు స్థలాలు కేటాయించే లేఔట్ల అభివృద్ధికి అథారిటీ ఈ సారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఔట్లలో తొలుత 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించనుంది.
'మీ భూమి-మీ హక్కు' - రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా: సీఎం చంద్రబాబు
'రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తాం' - రాజధానిలో 2వ విడత భూసమీకరణ ప్రారంభం

