ETV Bharat / state

39 ఏళ్లుగా అన్వేషణ - ఇంకా ప్రత్యక్షంగా కనిపించని కలివికోళ్లు

1986 జనవరి 26న కనిపించిన కలివికోడి - కొన్ని రోజులకే మృతి - కలివికోడి అన్వేషణకు సుమారు రూ.50 కోట్లు ఖర్చు

Searching_for_Kalivi_Kodi
Searching_for_Kalivi_Kodi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 11, 2025 at 1:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Searching for Kalivi Kodi Bird in Siddavatam Forest: అరుదైన పక్షిగా కలివికోడి గుర్తింపు పొందింది. శతాబ్దాల కిందట అంతరించిపోయిందని అంతర్జాతీయ పరిశోధక సంస్థ భావించిన నేపథ్యంలో కడప జిల్లా సిద్దవటం అటవీ రేంజ్‌లో అనుకోకుండా కనిపించింది. పక్షి శాస్త్రవేత్తలు, అటవీ అధికారులను ఊరించి కొన్ని రోజులకే చనిపోయింది. ఆ తర్వాత నుంచి ఈ పక్షి ఆచూకీ కనుగొనేందుకు సుమారు 39 ఏళ్లుగా అన్వేషణ సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు అయింది. అయినా ఇంకా ప్రత్యక్షంగా కనిపించలేదు. ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన పక్షి ప్రేమికులు కూతను రికార్డు చేశామంటూ అంతర్జాలంలో పోస్టు చేయడం అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది.

20 అధునాతన కెమెరాలు: సిద్దవటం రేంజ్‌ పరిధి కొండూరు బీట్‌ అటవీ ప్రాంతంలో 1986 జనవరి 26న ఈ కలివికోడి కనిపించింది. అయితే కొన్ని రోజులకే మృతి చెందింది. కాగా ఈ జాతి పక్షులను తిరిగి కనిపెట్టి సంతతిని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ, రాయల్, లండన్‌ సొసైటీలు నడుం బిగించాయి. పాద ముద్రల సేకరణ, కెమెరాలతో ఫొటోల చిత్రీకరణ, కూత రికార్డు, మరికొన్ని రకాలుగా అన్వేషణ సాగుతోంది.

2002లో సీనియర్‌ శాస్త్రవేత్త జగన్నాథం సిద్దవటం అటవీ పరిధిలో ఈ పక్షి కూతను రికార్డు చేశారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదు. ఇటీవల అటవీ అధికారులు కొత్తగా అడ్వాన్స్‌ ఆడియో మాత్‌ అనే అధునాతన పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిక్షిప్తమైన డేటాను 15 రోజులకు ఒకసారి పరిశీలిస్తున్నారు. ప్లాష్‌ రాకుండా చిత్రాలు తీసే 20 అధునాతన కెమెరాలను అధికారులు అడవిలో అమర్చారు.

కలివికోడి లేదని చెప్పలేం: కలివికోడి ఆచూకీ గుర్తించేందుకు అన్వేషిస్తున్నామని కడప డీఎఫ్‌వో వినీత్‌ కుమార్ తెలిపారు. పక్షి ఏదో ఒక ప్రాంతంలో కచ్చితంగా ఉంటుందని గోదావరి నుంచి పెన్నానది వరకు ఎక్కడైనా ఉండే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల ప్రైవేట్‌ వ్యక్తులు రికార్డు చేసి అంతర్జాలంలో ఉంచినది కలివికోడి కూతగా నిర్ధారణ కాలేదని అనుమతి లేకుండా ఎవరైనా అటవీ ప్రాంతంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా, కెమెరాలతో ఫొటోలు తీసినా అది చట్టరీత్యా నేరమవుతుందని వినీత్ కుమార్ చెప్పారు.

ఈ పక్షి తొలిసారిగా 1848లో పెన్నానది పరీవాహక ప్రాంతంలో కనిపించింది. థామస్ జర్దాన్స్ మొదటిసారి దీన్ని కనుగొన్నట్లు తెలుస్తుండగా 1985 జనవరి 5న రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. దీంతో ఐతయ్యకు వాచర్‌గా గుర్తించి అటవీశాఖ ఉద్యోగం ఇచ్చింది. ఈ తర్వాత 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీయూ జంతుశాస్త్ర విభాగం పరిశోధకుల బృందం అన్వేషణ చేసింది. 2002లో ముంబయి నేచురల్ హిస్టరీ సొసైటీ కలివికోడి పాద ముద్రను, కూతను రికార్డు చేసింది. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయం, రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ సహకారంతో దీన్ని రికార్డు చేశారు.

'ట్విక్ టూ, ట్విక్ టూ'మంటూ కూత: కడప జిల్లాలో నల్లమల, శేషాచలం కొండలు కలిసే బద్వేలు ప్రాంతాన్ని లంకమలగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలోనే సరిగ్గా 20 ఏళ్ల కింద చివరిసారిగా కలివికోడి కనిపించింది. రాత్రిళ్లు మాత్రమే తిరిగే పక్షి కావడంతో నిశాచర పక్షి అని పిలుస్తారు. దీని కూత 'ట్విక్ టూ, ట్విక్ టూ' అన్నట్లుగా వినిపిస్తుంది. దాదాపు 200 మీటర్ల దూరం వరకు శబ్ధం వినిపిస్తుంది.

కిచకిచలు వినిపించేలా - పిచ్చుకలను కాపాడేలా

అదిరిపోయే ప్రకృతి అందాలు - ఫొటోషూట్​లకు తరలివస్తున్న పర్యటకులు