ETV Bharat / state

సివిల్ కాంట్రాక్టుల పేరుతో రూ.10కోట్లు మింగేశారు! - ఆధారాలతో సహా ఫిర్యాదు

బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో కుంభకోణం - సుమారు రూ.10 కోట్ల దుర్వినియోగం చేశారని ఆధారాలతో సహా పలువురు సివిల్ కాంట్రాక్టర్ల ఫిర్యాదు

GHMC
GHMC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 9:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Scam In The Sanitation Department Of Badangpet Municipal Corporation : జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. శానిటేషన్ సహా పలు కీలక విభాగాల్లో అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టినట్లు జీహెచ్ఎంసీ సహా పురపాలక శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్క బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే డ్రైపూట్స్, టీ, బిస్కట్లు, మొక్కలకు రంగు వేయడం, బ్లీచింగ్ పౌడర్ సహా 232 పనుల్లో సుమారు రూ.10 కోట్ల దుర్వినియోగం చేశారని ఆధారాలతో సహా పలువురు సివిల్ కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తక్షణమే అవినీతిని నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన అధికారులు, శానిటేషన్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రూ.10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది : అప్పుల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​కు కొత్త తిప్పలు వచ్చిపడ్డాయి. ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఆదాయం, ఆస్తులు, అప్పులను స్వీకరించిన జీహెచ్ఎంసీ ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో శానిటేషన్, సివిల్ వర్క్ లకు సంబంధించి కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉంది.

సివిల్ కాంట్రాక్టుల పేరుతో రూ.10కోట్లు మింగేశారు! - ఆధారాలతో సహా ఫిర్యాదు (ETV Bharat)

అయితే ఇక్కడే పలువురు అధికారులు తమ తెలివిని ప్రదర్శించి అభివృద్ధి పేరుతో బినామీ కాంట్రాక్టర్ల పేరిట అడ్డగోలుగా కోట్లాది రూపాయల బిల్లుల ఫైల్స్​ను జీహెచ్ఎంసీకి సమర్పించారు. ఇందుకు ఉదాహరణే బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్​కు సంబంధించి అధికారులు సమర్పించిన ఫైల్స్. సుమారు 232 పనులకు సంబంధించి రూ.10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని వాటిలో వివరించారు. వాటర్ బాటిల్స్, దిన పత్రికలు, పేపర్ ప్లేట్లు, టీ, బిస్కెట్లు, డ్రైపూట్స్, మొక్కలను పెంచడం, మొక్కలకు రంగులు వేయడం, ఫాగింగ్ మిషన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, కుర్చీలు, టేబుల్స్, జేసీబీ, స్వచ్ఛ సర్వేక్షన్ ప్లెక్సీల తయారీ, బతుకమ్మ, బోనాల ఉత్సవాలు, తెలంగాణ వజ్రోత్సవాల లాంటి కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులను ఒకటికి రెండింతలు చేసి పెద్ద మొత్తంలో జీహెచ్ఎంసీకి సమర్పించారు.

విచారణ జరిపి అవినీతి అక్రమాలను బయపెట్టాలి : అయితే ఈ పనుల్లో బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో అధికారులే తప్పుడు లెక్కలు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సివిల్ ఇంజినీర్లపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో స్పందించిన ఆయా కాంట్రాక్టర్లు అసలు గుట్టు లాగే ప్రయత్నం చేశారు. బడంగ్ పేట కార్పొరేషన్​లో అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అక్రమాలను బయపెట్టాలని ఓ సివిల్ కాంట్రాక్టర్ ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. శానిటేషన్​లోని పలువురు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మకై అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. అవినీతికి సహకరించిన కాంట్రాక్టు ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి బిల్లులను నిలిపిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సమగ్ర విచారణ జరిపించాలి : సివిల్ కాంట్రాక్ట్ పనుల్లో ప్రతి విషయానికి ఆధారాలు ఉంటాయని, శానిటేషన్ కాంట్రాక్టుల విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇటీవల విలీనమైన 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై సమగ్ర విచారణ జరిపించాలని బడంగ్ పేట సివిల్ కాంట్రాక్టర్ సాయికిరణ్ కోరుతున్నారు.

పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు : ఇటీవల విలీనమై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆర్థిక లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు సమాచారం.

ఇళ్లముందు వాడని పాత వాహనాలు ఉంటే తీసేస్తారు - జీహెచ్ఎంసీ శానిటేషన్ డ్రైవ్