ETV Bharat / state

చీరలు కట్టుకుని సింగారించుకున్న పురుషులు - ఎందుకో తెలుసా!

తరతరాలుగా గ్రామంలో కొనసాగుతోన్న వింత ఆచారం- హోలీ సందర్భంగా మహిళలుగా అలంకరించుకున్న పురుషులు- రతి మన్మథుడికి ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్థులు

Santhekudlur  Villagers Following Different Ritual on Holi Festival Day
చీరలు కట్టుకుని సింగారించుకున్న పురుషులు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 4:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

Villagers Following Different Ritual on Holi Festival Day in Kurnool District: హోలీ అంటే కాముని దహనం, రంగులు చల్లుకోవడమే అందరికీ తెలిసింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొడ్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పండుగ జరుపుకుంటారు.

ఇక్కడ హోలీ ఎంతో ప్రత్యేకం: కానీ, కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామస్థులు ఈ పండుగకు విభిన్నమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హోలీ పండుగ రోజున అక్కడంతా జంపలకడిపంబ మాదిరిగా ఉంటుంది. పురుషులు మహిళల వేషధారణలోకి మారిపోతారు. చీరలు కట్టుకుని ఆభరణాలు, పూలతో సింగారించుకుంటారు. రతీమన్మథులకు పూజలు చేస్తారు. తమ కోరికలు నెరవేరేందుకు ఇలా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా తరతరాల నుంచి తాము ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్టు ఆ గ్రామస్థులు వివరిస్తున్నారు. ఇంతకీ అదెక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే.

వాళ్లు వీళ్లవుతారు: కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. తరతరాల నుంచి ఓ సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని మహిళ్లలా సింగారించుకుంటారు. ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వస్తారు. పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకమని చెప్తున్నారు స్థానికులు.

కర్ణాటక నుంచి భక్తులు: అంతే కాకుండా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని, ఇంట్లో ఏ సమస్యలు తలెత్తవని అక్కడి వారి నమ్మకం. ప్రతి ఏటా హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి భారీ ఎత్తున తరలివస్తారు. ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వల్ల పండుగకు కర్ణాటక నుంచి భక్తులు భారీ ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

'మా తల్లిదండ్రుల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కోరికలు నెరవేరితే ఇలా మొక్కులు చెల్లించుకుంటాం. హోలీ నాడు ఊర్లో 75 శాతం మంది మగవాళ్లు ఆడవాళ్లలా తయారవుతారు. ఇలా చెయ్యడం వల్ల మాకు సుఖ, సంతోషాలు కలుగుతాయి. దైవానుగ్రహం ఉంటుందని మేము నమ్ముతాం.' - గ్రామస్థులు

హోలీ స్పెషల్ - ఆర్టిఫిషియల్​ రంగులకు చెక్​ - ఇంట్లోనే నేచురల్​గా చేసుకోండిలా

రంగుల పండగ వేళ విషాదం - వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి