ETV Bharat / state

రాజకీయాల్లో కుటుంబ వారసత్వం నేను ప్రోత్సహించను - అందుకే నా పిల్లలు రాలేదు : వెంకయ్య

ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్టులో సంక్రాంతి వేడుకలు - సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు - మన పండగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయని వెల్లడి

Venkaiah Naidu
Venkaiah Naidu (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 3:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sankranti Celebrations 20226 at Swarna Bharat Trust : పరిపాలనాపరంగా రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలంతా కలిసి మెలిసి ఉన్న దృష్ట్యా తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా అభివృద్ధి చెందుతోందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, ప్రకాశ్​ గౌడ్, ముప్పవరపు ఫౌండేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్, స్వర్ణ భారత్ ట్రస్టు ట్రస్టీ దీపా తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన "ముప్పవరపు ఫౌండేషన్'' భవనం ప్రారంభోత్సవం చేశారు.

ఇద్దరు సీఎంలు అంగీకరించారు : సంక్రాంతి పండుగ మన జీవితాల్లో నవ్య క్రాంతి తీసుకురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. మూలాల్లోకి వెళ్లి బంధు, మిత్రులతో కలిసి సామూహికంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన మాతృ భాష తెలుగు సంరక్షణ కోసం ఇటీవల దివంగత రామోజీరావు జయంతి వేళ ఆయన గుర్తుగా పరిపాలన తెలుగులో చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించానని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రసంగాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో కొనసాగాలన్న సూచన మేరకు ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అంగీకరించారని గుర్తు చేశారు. తాజాగా ఒక సమీక్షలో కలెక్టర్ ఆంగ్లంలో మాట్లాడబోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారించి తెలుగులో మాట్లాడించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వం తాను ప్రోత్సహించబోనని, అందుకే తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురాలేదని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో కుటుంబ వారసత్వం నేను ప్రోత్సహించబోను : వెంకయ్య నాయుడు (ETV)

"మన భవిష్యత్‌ బాగుండాలంటే ప్రకృతితో కలిసి జీవించాలి. మన పండగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. పంటలన్నీ ఇంటికి చేరే రోజుల్లో సంక్రాంతి పండగ ఏర్పాటు చేశారు. ఈ మధ్య వాతావరణ మార్పుల వల్ల రుతువులు మారుతున్నట్లు ఉంది. మనుషులు మారుతున్నట్లే రుతువులూ మారుతున్నాయి. ఎన్ని మారినా మన సంస్కృతి- సంప్రదాయాలు కాపాడుకోవాలి. తెలుగులో చక్కని పిలుపులు ఉన్నాయి. సోదరుడిని బ్రోకర్ అని పిలిచినట్లు బ్రో అని అంటున్నారు. మదర్‌ ఇన్‌లా, ఫాదర్‌ ఇన్‌లా అని అంటున్నారు. ఇది మారాలి." - ముప్పవరపు వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

సరైన రాజధాని నగరం అమరావతి : ఏపీ రాజధాని అమరావతి విషయంలో అనవసర వివాదాలు వద్దని వెంకయ్యనాయుడు సూచించారు. గుంటూరు, విజయవాడ, గన్నవరం ఇలా కొన్ని ప్రాంతాలు కలిపి అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు "సంక్రాంతి ప్రాశస్త్యం" ప్రవచనం వినిపించారు. అమరావతి కూడా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలి, చెందుతుంది. సందేహం లేదని వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళితే ఆ పక్కన సముద్రం ఉంటుందని, ఏపీలో అన్ని ప్రాంతాలకు సరైన రాజధాని నగరం అమరావతి అని ఉద్ఘాటించారు. ఇక ఈ విషయంలో ఎలాంటి అనవసరమైన వివాదాలు వద్దని కోరారు.

అదే నా వారసత్వం : 24 ఏళ్ల కింద తమ సొంత గడ్డ నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో కూడా ఛాప్టర్లు ప్రారంభించి యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మహిళా సాధికారత, వైద్య సేవలందిస్తున్నామని అన్నారు. తన వారసత్వంగా ముప్పవరపు ఫౌండేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఆ సేవలు ముందుకు తీసుకెళ్లే బాధ్యత తన కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపకు అప్పగించానని, అదే తన వారసత్వం అని వెల్లడించారు.

సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి వేళ ప్రతి ఒక్కరూ జన్మభూమి వెళ్లి పాత జ్ఞాపకాలు నెమరువేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్​ను అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దడం ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తుండం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సంక్రాంతి ఎప్పుడు? - జనవరి 14 లేదా 15? - జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు!

సంక్రాంతి స్పెషల్​: సజ్జపిండితో రుచికరమైన "మురుకులు" - పైన క్రిస్పీగా, లోపల గుల్లగా!