పందెం కోళ్లకు జ్యోతిషం - సెంటిమెంట్లకు ప్రాధాన్యమిస్తున్న పందెగాళ్లు
పుంజు ఫొటోను వాట్సాప్‌లో పంపితే రంగు, జాతిని బట్టి పండగ మూడు రోజుల్లో పందేలకు ఏ సమయం అనుకూలమో చెబుతామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు - 2 నెలల వయసు నుంచి ప్రత్యేక శిక్షణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 11:43 AM IST
Cock Fight In Godavari Districts : సంక్రాంతి రానే వచ్చింది. పల్లెల్లో సందడి నెలకొంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడిపందేల సందడి మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీ బరులు సిద్ధమవుతుండగా, పందెగాళ్లు మంచి మేలు జాతి కోడి పుంజులను పందెం బరిలో దింపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పందెం పుంజుల విజయావకాశాలు అంచనా వేసేందుకు కొందరు జ్యోతిష నిపుణులను కూడా ఆశ్రయిస్తున్నారు. పుంజు ఫొటోను వాట్సాప్‌లో పంపితే దాని రంగు, జాతిని బట్టి పండగ మూడు రోజుల్లో పందేలకు ఏ సమయం అనుకూలమో చెబుతామంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు అనేక ప్రకటనలు గుప్పిస్తున్నారు. సెంటిమెంట్లకు ప్రాధాన్యమిచ్చే పందెగాళ్లు వీటిపై మరింత ఆసక్తి చూపుతున్నారు.
సెంటిమెంట్లకు మొదట ప్రాధాన్యం : ఉదయాన్నే నిద్ర లేచి నిరంతరంగా కఠోర వ్యాయామం చేయాలి! ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా రాటుదేలాలి! గాయాలు బాధిస్తున్నా తట్టుకుని పోరాడగలిగే శక్తి కూడగట్టుకోవాలి! ఇవన్నీ మిలటరీలో సైనికులకు ఇచ్చే శిక్షణ అనుకుంటే పొరపాటే! సమరానికి సై అనే సంక్రాంతి కోళ్లకు ఏడాదిన్నర పాటు ఇచ్చే శిక్షణ తీరుతెన్నులివి. పౌరుషానికి మారు పేరైన ఈ పందెం కోళ్ల కణతల మీద ఊది, ముక్కులు రాయించి బరిలోకి దించే సంక్రాంతి సమయం రానే వచ్చింది. కయ్యానికి కాలు దువ్వే వీటి అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. ఇటువంటి తరుణంలో పందెగాళ్లు సెంటిమెంట్లకు మొదట ప్రాధాన్యమిస్తున్నారు.
సమయంతో సహా : భోగి రోజున ఉదయం 6 నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఒక జాము, ఆపై 10.48 వరకు రెండవ జాము, మధ్యాహ్నం 1.12 వరకు మూడోజాము అంటూ నక్షత్రాల ఆధారంగా పందేలకు కొన్ని ముహూర్తాలు జ్యోతిష నిపుణులు నిర్ణయించారు. ఆయా ముహూర్తాల్లో పుంజుల జాతిని బట్టి గెలిచేవి, ఓడేవి అంటూ విభజించి జ్యోతిషులు జోస్యం చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో దర్భరేవు, యలమంచిలి ప్రాంతాల్లో కొందరు పందెగాళ్లు ఇలాంటి వీటిని కచ్చితంగా అనుసరిస్తున్నారంటే అతిశయోక్తిలేదు. తన దగ్గర ఉన్న రెండు పందెం పుంజులను బరిలో దించేందుకు ఏ సమయం అనుకూలమో అని ఆన్‌లైన్‌లో తెలుసుకోగా భోగి, కనుమ రోజులు మంచివిగా సూచించారని యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన విజయ్ చెబుతున్నారు. ఆన్‌లైన్ జోస్యానికి ఒక్కో పుంజుకు కనీసం డిజిటల్ చెల్లింపుల ద్వారా సుమారు రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు.
2 నెలల వయసు నుంచి ప్రత్యేక శిక్షణ : సంక్రాంతికి కోడి పందేల నిర్వహణ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పుంజును పెంచి పోషించి బరిలోకి దింపే తంతు వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. బరిలో జరిగే కోడి పందెం 2 నుంచి 10నిమిషాలు లోపే అయినా తగ్గేదే లే అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడే తీరు వీటి సొంతం. గ్రామీణులకు సంప్రదాయంగా, పందెం రాయుళ్లకు ఉత్కంఠ భరిత జూదంగా, చూసేవాళ్లకు సరదాల సంబరమైన పందేనికి కోళ్లను ఎలా సిద్ధం చేస్తారనేదీ ఆసక్తికరమే. 2 నెలల వయసు నుంచి ప్రత్యేక శిక్షణ మొదలుపెట్టి 18 నెలలొచ్చాక పోటీకి దింపుతారు. ఈ లోపు ఒక్కో కోడి పెంపకానికి అయ్యే ఖర్చు రోజుకు 100రూపాయల నుంచి 500వరకూ ఉంటుంది.
వామ్మో! రూ.3.50 లక్షలు పలికిన పందెం కోడి - ప్రత్యేకత ఏంటంటే?
కోనసీమ తరహాలో అనకాపల్లిలో కోడిపందేలకు ఏర్పాట్లు - పది వేలకు పైగా పందెం పుంజులు సిద్ధం

