ETV Bharat / state

సిద్ధార్ధ మెడికల్​ కాలేజ్​లో ముందస్తు సంక్రాంతి వేడుకలు - భోగి మంటల నడుమ విద్యార్థుల నృత్యాలు

సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి వేడుకలు - కళాశాల ప్రాంగణంలో తెలుగు లోగిళ్ల శోభను ఆవిష్కరించేలా రంగురంగుల ముగ్గులు

Sankranthi Celebrations In Siddardha Medical College
Sankranthi Celebrations In Siddardha Medical College (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 10:53 AM IST

2 Min Read
Choose ETV Bharat

Sankranthi Celebrations In Siddardha Medical College : సంక్రాంతి అంటే అచ్చమైన పల్లె పండుగ. మనవైన సంప్రదాయాలు, సంస్కృతుల్ని ప్రతిబింబించే సప్తవర్ణాల వేడుక. మనుషులు, మూగజీవాల మధ్య ఉండే అనురాగాలు, అనుబంధాలకు ప్రతీక. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందేలు, పిండి వంటలు. నిత్యం తరగతిలో పాఠాలు, ప్రాక్టికల్స్​తో బిజీగా ఉండే వైద్య విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కోలాటం ఆడుతూ, గాలి పటాలు ఎగురవేస్తూ ఆహ్లాదంగా గడిపారు.

సంప్రదాయ దుస్తులు ధరించి, భోగి మంటలు వేసి, గొబ్బెమ్మల చుట్టూ కోలాటం నృత్యాలు చేశారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్యకళాశాలలో ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుంది. యువతి యువకులు ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై ఒక్కరోజు దృష్టి సారించి, కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను తర్వాత తరాలకు తెలియజేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు. మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహించారు.

పిన్నమనేని సిద్ధార్ధ వైద్యకళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు (ETV Bharat)

ప్రత్యేకమైన కోలాటాలతో విద్యార్ధుల ఆటలు : రంగవల్లులు, భోగిమంటలతో వైద్య విద్యార్ధులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాలలో సంక్రాంతి పండుగకు ముందే సంబరాలు మొదలయ్యాయి. ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే వైద్య విద్యార్ధులు సంప్రదాయ దుస్తులతో దర్శనమిచ్చారు. అందంగా అలంకరించుకుని సంబరాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు. పండుగలో ప్రత్యేకమైన కోలాటాలతో విద్యార్ధులు ఆటలు ఆడారు. వైద్య కళాశాల ప్రాంగణమంతా ఒక్కసారిగా పిన్నమనేని గ్రామంగా మారింది. ఎక్కడ చూసినా గ్రామీణ వాతావరణం కనిపించింది. కళాశాల ప్రాంగణంలో తెలుగు లోగిళ్ల శోభను ఆవిష్కరించేలా రంగురంగుల ముగ్గులను సుందరంగా తీర్చిదిద్దారు. జీన్స్ ప్యాంటుతో వచ్చే విద్యార్ధులు పంచలతో ప్రాంగణానికి వచ్చారు. చిన్నప్పుడు గ్రామాల్లో చూసిన వాతావరణం నేడు తమ కళాశాలలో కనపడటంతో ఉర్రూతలూగిపోయారు. ప్రస్తుతం కాలంతో పాటు ఉరుకులు పరుగులు పెడుతున్న యాంత్రిక జీవనంలో ఉన్న యువతకు పండుగ సంప్రదాయాలు చూపేందుకు కళాశాలలో పండగ శోభ కనపడే విధంగా ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ తెలిపారు. సంక్రాంతికి వండే అరిశలు, గారెలు, పొంగళి రుచికరమైన వంటకాలను అందరికీ అందుబాటులో ఉంచారు.

మైదానంలో గుడిసెలు, ఎడ్లబండ్లు : సంక్రాంతి పండుగను తమ కళాశాలలో ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో రంగవల్లులు అందంగా వేసి రంగులతో అలంకరించారు. గంగిరెద్దుల సందడి, ఎడ్లబండి, గుడిసెలను మైదానంలో ఏర్పాటు చేశారు. సంక్రాంతి కోళ్లతో విద్యార్ధులు సరదాగా ఆటలు ఆడారు. మెడికోలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు.

"ప్రస్తుత కాలంలో అందరివీ గజిబిజి బతుకులే. ఉరుకులు, పరుగులు పెడుతున్న యాంత్రిక జీవనంలో ఉన్న యువతకు పండుగ సంప్రదాయాలు చూపేందుకు కళాశాలలో పండగ శోభ కనపడే విధంగా ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా సంక్రాంతికి వండే పిండివంటలు, అరిశలు, గారెలు, పొంగళి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచాం." - డా.భీమేశ్వర్, పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల ప్రిన్సిపల్

బస్సులు, రైళ్లు ఫుల్ - సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లేదెలా!

సంక్రాంతికి అరకొరగా బస్సుల కేటాయింపు - 35 బస్సులతో పండగని సర్దేస్తారా?