ETV Bharat / state

సైబర్ బాధితుల కోసం పోలీసుల విప్లవాత్మక అడుగు - 'సి-మిత్ర'తో ఇంటి నుంచే FIR

రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్‌ మోసాలు -బాధితుల కోసం హైదరాబాద్ పోలీసుల వినూత్న కార్యక్రమం - బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదును పోస్ట్ ద్వారా స్వీకరణకు చర్యలు - 'సి-మిత్ర' ద్వారా ఠాణాకు వెళ్లకుండానే ఎఫ్‌ఐఆర్‌

C-Mitra For Cyber Crime Victims In Telangana
C-Mitra For Cyber Crime Victims In Telangana (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 11:47 AM IST

3 Min Read
Choose ETV Bharat

C-Mitra For Cyber Crime Victims In Telangana : ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. 'సి-మిత్ర' ద్వారా ఎఫ్ఐఆర్​ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తిచేసేలా చర్యలు ప్రారంభించారు.

గతేడాది రూ.251 కోట్లు కాజేసిన నేరగాళ్లు : సైబర్ నేరాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి నేరగాళ్లు నిత్యం రూ.కోట్లలో కాజేస్తూనే ఉన్నారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గతేడాది రూ.251 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వీటిలో ట్రేడింగ్, ఇన్వెస్ట్​మెంట్, ఐడెంటిటీ థెప్ట్ వంటి కేసుల్లోనే అత్యధిక మోసాలు జరిగాయి. అయితే సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని సీపీఎస్‌ కార్యాలయంలో సి-మిత్రను హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియ పూర్తి చేయడం సి-మిత్ర ప్రధాన ఉద్దేశమని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.

నిత్యం కోట్ల రూపాయలు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లకు 'సీ-మిత్ర'తో చెక్​ (ETV)

"సైబర్​ నేరం జరిగిన తర్వాత బాధితులకు అండగా ఉండేందుకు ఓ వినూత్న సిస్టమ్​ తీసుకొచ్చాం. ఈ హెల్ప్​ డెస్క్​​ సైబర్​ క్రైం బారిన పడి నష్టపోయిన వారి కోసం ఏర్పాటు చేశాం. ఇది 365 రోజులూ పని చేస్తుంది. దీన్ని 24 మంది ఆఫీసర్లతో మొదలు పెట్టాం. అలాగే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుంది. బాధితులు ఇందులో ఏఐ ద్వారా ఎఫ్​ఐఆర్​ తయారు చేయవచ్చు. చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలని తెలియకపోవచ్చు. అలాంటి వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఎఫ్​ఐఆర్​ ఫైల్​ చేయచ్చు. మేం అది చూసి సంబంధిత ఆఫీసర్​ వద్దకు చేరుస్తాం." - సజ్జనార్‌, హైదరాబాద్ సీపీ

ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు : చాలా మంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి 'సి-మిత్ర' బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్ కొరియర్ ద్వారా పంపించాలి. లేదా సైబర్ క్రైం పీఎస్ వద్ద డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. మన దేశంలో సైబర్ క్రైం జరిగినా 18 శాతం ఫిర్యాదులు​ మాత్రమే వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏఐ ద్వారా ఎవరెవరు? ఎక్కడి నుంచి ఈ నేరం చేస్తున్నారని తెలుసుకోవచ్చని సజ్జనార్​ తెలిపారు.

స్టేషన్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా : సంతకం చేసిన ఫిర్యాదు కాపీలను అందులో వేయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్​ఐఆర్​ను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సి-మిత్ర సేవలను పొందేందుకు అర్హులు. పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా సి-మిత్ర సేవలు అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

పండగ వేళ మోసాల బారినపడొద్దు - సైబరాసురుల నుంచి తస్మాత్​ జాగ్రత్త!

సైబర్​ క్రైం​ సీఐకే సైబరాసురుల టోకరా - టీటీడీ దర్శనం పేరిట రూ.1.62 లక్షలు కాజేత