దేశానికి మంచి మెరికల్లాంటి క్రీడాకారులు - ఏసీఏ ఆధ్వర్యంలో 'విలేజ్ టు విరాట్'
ఏసీఏ ఆధ్వర్యంలో త్వరలో గ్రామీణ క్రీడా ప్రతిభ అన్వేషణ - 88 నియోజకవర్గాల్లో క్రికెట్ ఆటగాళ్ల ఎంపికకు కసరత్తు, కోచ్‌లతో పాటు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలు, దేశానికి మెరికల్లాంటి క్రీడాకారులను అందించడమే లక్ష్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 11:30 AM IST
|Updated : March 1, 2026 at 2:18 PM IST
Andhra Cricket Association Conduct Village To Virat : క్రికెట్లో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. మారుమూల నుంచి వీరి ప్రతిభను వెలికితీయడమే కీలకం. ఆంధ్ర క్రికెట్ సంఘం. ఇప్పుడు అదే పని చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నుంచి ప్రతిభ అన్వేషణ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో క్రికెట్ ఆటగాళ్ల ఎంపికకు కసరత్తు చేపట్టింది. వారికి కోచ్‌లతో ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.
మన దేశంలో ఏ మారుమూల చూసినా సందులు, వీధులు క్రికెట్ ఆటతో సందడిగా ఉంటాయి. బస్సుల్లో వెళ్లినా రైళ్లలో వెళ్లినా మనకు చిన్న చిన్న మైదానాలు, ఖాళీ ప్రదేశాల్లో క్రికెట్ ఆడుతూ పిల్లలలు కన్పిస్తారు. పల్లె నుంచి పట్టణం దాకా ఎక్కడా చూసినా క్రికెట్ సందడే కన్పిస్తుంది. అంతలా క్రికెట్ ఆట మన యువతలో భాగంగా మారింది. ఇలాంటి వారిలో బహుముఖ ప్రజ్ఞావంతులు ఎందరో ఉంటారు. వీరిని గుర్తించి బయటకు తేవడం చాలా ముఖ్యం.
ఏసీఏ ఆధ్వర్యంలో విలేజ్ టు విరాట్: అందుకే ఇలాంటి వారి కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్వేషణ మొదలుపెట్టింది. మీరు క్రికెట్ బాగా ఆడతారా? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 'విలేజ్ టు విరాట్' పేరుతో రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంకు రూపకల్పన చేస్తోంది.
88 నియోజకవర్గాల్లో కార్యక్రమం: ఏపీలోని మారుమూల పల్లెలకు చెందిన క్రీడాకారుల్లోని క్రికెట్ ప్రతిభను గుర్తించి, శిక్షణ ఇప్పించడం ద్వారా వారు రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరిసేలా కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా 88 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏసీఏ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నాయి. ఏప్రిల్ 5న అధికారికంగా రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్లు ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి. యువతీ యువకులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వయోపరిమితి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వెలుగులోకి క్రీడాకారుల ప్రతిభ: ఆపై వయసున్న వారిని నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 20 నుంచి 50 మంది ఎంపిక కానున్నారు. ఇప్పటి వరకు అర్బన్ ప్రాంతాల నుంచే మెజారిటీ క్రీడాకారులు క్రికెట్ సెలక్షన్ కు వస్తుండగా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. క్రికెట్‌ను కెరియర్ గా ఎంచుకునేలా ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు. దీనిపై తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తారు. విలేజిల నుంచి మరో విరాట్ మెరిసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రతిభ ఆధారంగా శిక్షణ: ఏసీఏ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సెలక్టర్లు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళతారు. రాష్ట్రంలోని మూడు జోన్లలో ఏకకాలంలో ఎంపికలు చేపడతారు. ప్రతి నియోజకవర్గంలో రెండు, మూడు చోట్ల ఎంపికలు ఉంటాయి. ఆయాచోట్ల దీనిపై విస్తృత ప్రచారం కల్పిస్తారు. బ్యాట్స్ మెన్, బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, ఆల్ రౌండర్స్, వికెట్ కీపర్స్ ఇలా అన్ని విభాగాల ఆటగాళ్లను తీసుకుంటారు. ఎంపికైన వారి ప్రతిభ ఆధారంగా అకాడమీలు, ఫెసిలిటేటింగ్ సెంటర్లలో శిక్షణను ఇప్పిస్తారు.
ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం: అవసరానికి అనుగుణంగా ఉచిత వసతి, రవాణా భత్యాలను కల్పిస్తారు. వయోపరిమితి ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నమెంట్లను సైతం ఆడిస్తారు. నైపుణ్యం ఉన్న క్రికెటర్లు ఎక్కువ మంది ఉంటే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఓ కోచ్ ను నియమించి, ప్రాక్టీస్ సెంటర్లు, ఏర్పాటు చేస్తారు. వారికి క్రీడా పరికరాలు ఉచితంగా అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడమే విలేజి టూ విరాట్ కార్యక్రమం లక్ష్యమని విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అభిప్రాయపడ్డారు.
"ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి ఫలిస్తే మన రాష్ట్రం నుంచి దేశానికి మంచి మెరికల్లాంటి క్రీడాకారులను అందించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రతిభాన్వేషణ కార్యక్రమాలు గ్రామీణ యువతకు భరోసా ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం" -కేశినేని శివనాథ్, ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు
ఏపీకి రండి - సన్‌రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు-శరవేగంగా ముస్తాబు అవుతోన్న మంగళగిరి స్టేడియం

